టీ అమ్ముకుని.. 23 దేశాలు తిరిగొచ్చిన వృద్ధ జంట.. ఎలాగంటే?

Last Updated: గురువారం, 10 జనవరి 2019 (16:17 IST)
ఆధునికత పెరిగిన తరుణంలో చిన్న విషయాలకు విడాకుల వరకు తీసుకెళ్లే జంటలు పెరిగిపోతున్నాయి. అలాంటి వారు ఈ వృద్ధ జంట గురించి తెలిస్తే షాకవక మానరు. 70ఏళ్ల వయస్సులో ఈ దంపతులు 23 దేశాలు తిరిగొచ్చారు. 23 దేశాలు తిరిగొచ్చారే వారి వద్ద భారీగా ఆస్తులున్నాయని అనుకుంటున్నారా.. అయితే పప్పులో కాలేసినట్టే. 
 
ఆ వృద్ధ జంట వద్ద ఆస్తుల్లేవు. ఒక్కే ఒక్క టీ కొట్టు మాత్రమే వుంది. ఆ టీ కొట్టును ఆధారంగా చేసుకుని విదేశాలు తిరిగొస్తారు. తిరిగొచ్చాక ఆ అప్పును తీర్చుకుంటారు. ఇది ఆ 70 ఏళ్ల వృద్ధ దంపతుల కథ. కేరళలోని కొచ్చి నగరంలో గిరినగర్‌లో శ్రీ బాలాజీ కాఫీ హౌస్‌ను విజయన్, ఆయన భార్య మోహన కలిసి నడుపుతున్నారు.
 
24 గంటల పాటు కష్టపడి టీ కొట్టును నిర్వహించే ఈ జంట.. విదేశాలకు ట్రిప్పేసే ముందు.. టీ కొట్టుని బ్యాంకుకు తనఖా పెట్టి అప్పు తీసుకుంటారు. తిరిగొచ్చాక కష్టపడి ఆ అప్పు కట్టేస్తారు. రెండు, మూడేళ్లు కష్టపడి అప్పు తీర్చాక మరో పర్యటనకు సిద్ధమవుతారు. 
 
వీళ్ల గురించి తెలుసుకున్న మహీంద్ర గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్ర.. ఈ జంట గురించి ట్విట్టర్‌లో పోస్ట్ పెట్టారు. దేశంలోని అత్యంత ధనికులు వీళ్లేనని.. కొచ్చికి వెళ్లినపుడు విజయన్ టీకొట్టుకు వెళ్లి టీ తాగి వస్తానని ట్వీట్‌లో పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ జంటకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. దీనిపై మరింత చదవండి :