అమెరికా వద్దు.. భారతే ముద్దు : స్వదేశానికెళ్లేందుకు యూఎస్ పౌరులు ససేమిరా!
కరోనా వైరస్ దెబ్బకు ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి. ఇప్పటికే ఈ వైరస్ 210 దేశాలకు విస్తరించింది. అయితే, ఈ వైరస్ పుట్టిన చైనా కంటే.. ఇటలీ, అమెరికా దేశాల్లో అల్లకల్లోలం సృష్టించింది. ఈ రెండు దేశాల్లో ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారు. దీంతో అమెరికా వణికిపోతోంది. ప్రతి మూడు నిమిషాలకు ఒకరు చనిపోతున్నట్టు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. దీంతో అమెరికా చరిత్రలోనే తొలిసారి కరోనా వైరస్ సృష్టిస్తున్న మరణమృదంగాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించారు.
ఈ పరిస్థితుల్లో అమెరికాకు చెందిన పౌరులు, విద్యార్థులు పలు దేశాల్లో చిక్కుకుని ఉన్నారు. అలాంటివారినందరినీ స్వదేశాలకు వెళ్లిపోవాల్సిందిగా ఆయా దేశాలు ఆదేశాలు జారీచేస్తున్నాయి. డెడ్‌లైన్లు విధిస్తున్నాయి. ఈ క్రమంలో ఆస్ట్రేలియా ఇటీవలే భారత్ నుంచి 444 మంది తమ పౌరులను ప్రత్యేక విమానంలో తీసుకెళ్లింది.
అయితే మరికొన్ని దేశాలకు చెందిన ప్రజలు మాత్రం భారత్‌ను వీడి తమ సొంత దేశాలకు వెళ్లేందుకు ఇష్టపడడంలేదు. ముఖ్యంగా అమెరికన్ల గురించి చెప్పుకోవాలి. తాము భారత్‌లోనే ఉంటామని, అమెరికా వెళ్లబోమని అంటున్నారు. ప్రస్తుతం అమెరికాలో పరిస్థితి అత్యంత దారుణంగా ఉండటమే అందుకు కారణం.
22 వేలు దాటిన మృతుల సంఖ్య, ఐదున్నర లక్షల పాజిటివ్ కేసులతో అమెరికాలో కరోనా స్వైరవిహారం చేస్తోంది. విదేశాల్లో ఉన్న 50 వేల మంది అమెరికా పౌరులను స్వదేశానికి వచ్చేయాల్సిందిగా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పిలుపునిచ్చారు. ట్రంప్ ఆదేశాలతో అమెరికా యంత్రాంగం అనేక విమానాలను నడుపుతోంది. విదేశాల్లో నిలిచిపోయిన అమెరికన్లను తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తోంది.
భారతదేశంలో తమకు అందుబాటులో ఉన్న 800 మందిని అమెరికా అధికార్లు ఒకరోజున సంప్రదించి విమానం రెడీగా వుంది వస్తారా? అని అడిగారు. వారిలో కేవలం పదంటే.. పది మంది మాత్రమే ముందుకొచ్చారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. పైగా భారత్‌లో కరోనా వైరస్ను కట్టడి చేసేందుకు తీసుకుంటున్న చర్యలు సంతృప్తికరంగా సాగుతుండడం కూడా అమెరికన్లలో ఇక్కడుండటమే మంచిదన్న అభిప్రాయం కలిగిస్తోంది.
కాగా, భారత్ లోని వివిధ ప్రాంతాల్లో 24 వేల మంది అమెరికా పౌరులు ఉన్నట్టు అధికార వర్గాల అంచనా. ఒక్క అమెరికా పౌరులకే కాదు ప్రపంచలోని అనేక దేశాలకు ఇపుడు భారత్ అత్యంత సురక్షిత ప్రాంతంగా కనిపిస్తోంది. అంతేనా.. కరోనా కష్టకాలంలో అనేక ప్రపంచ దేశాలకు ఔషధాలను ఎగుమతి చేస్తూ ఆపద్బాంధవుని పాత్రను కూడా పోషిస్తోంది.