సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By మోహన్
Last Updated : మంగళవారం, 19 మార్చి 2019 (18:00 IST)

చంద్రబాబు కోసం ఎద్దు కాస్త గోమాతగా మారిపోయింది.. నెట్టింట సెటైర్లు

ఎన్నికల తేదీలు సమీపిస్తున్న కొద్దీ సోషల్ మీడియా వేదికగా అన్ని రాజకీయ పార్టీలు తమ ప్రచారాన్ని మరింత ముమ్మరం చేసాయి. ఒకరి వైఫల్యాలను మరొక పార్టీ వారు ఎత్తి చూపుతూ, తదుపరి అవకాశం ఇవ్వవలసిందిగా ఓటర్లను వేడుకుంటున్నారు. తాజాగా టీడీపీకి చెందిన ప్రచార ప్రకటనపై బీజేపీ ట్విట్టర్‌ వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధించింది. 
 
వివరాల్లోకెళితే..టీడీపీ తన ఎన్నికల ప్రచార ప్రకటన కోసం ఎద్దును ఏకంగా గోమాతను చేసేసారని బీజేపీ ఎద్దేవా చేసింది. సీఎం చంద్రబాబు వల్ల తాను గోమాతను కొనుగోలు చేసినట్లు ఓ మహిళ చెబుతున్నట్లు రూపొందించిన టీడీపీ ప్రచార ప్రకటనలో.. గోమాత స్థానంలో ఎద్దు ఉండటాన్ని బీజేపీ శుక్రవారం ట్విట్టర్‌ ద్వారా ట్వీట్ చేసింది. దీనికి సంబంధించిన ఫోటోను పోస్ట్ చేసింది. 
 
రోజూ టీడీపీ చేస్తున్న తప్పులు చూపించలేక తాము కూడా విసిగిపోతున్నామంటూ బీజేపీ పేర్కొంది. ఇదిలా ఉంటే ఈ ఫోటో ఇప్పుడు సోషియల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రకటన తీసిన దర్శకుడికి ఆవుకి, ఎద్దుకి తేడా తెలియదా అని నెటిజన్లు సెటైర్లు పేలుస్తున్నారు. 
 
అంతేకాకుండా ఎద్దును గోమాత అని చెప్పి మోసం చేస్తున్నారని మరికొంత మంది విమర్శిస్తున్నారు. ఏదేమైనా ఇప్పుడు ఏ విషయం జరిగినా అది కాస్తా సోషియల్ మీడియాలో ప్రాచుర్యాన్ని పొందుతుండడం గమనార్హం.