శనివారం, 4 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By pnr
Last Updated : గురువారం, 7 జూన్ 2018 (17:12 IST)

ప్రణబ్ దాదా అంతపని చేస్తారని అనుకోలేదు : అహ్మద్ పటేల్

మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అహ్మద్ పటేల్ విమర్శలు గుప్పించారు. ఆర్ఎస్ఎస్ సమావేశానికి ప్రణబ్ హాజరవుతారని తాను ఊహించుకోలేదన్నారు.

మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అహ్మద్ పటేల్ విమర్శలు గుప్పించారు. ఆర్ఎస్ఎస్ సమావేశానికి ప్రణబ్ హాజరవుతారని తాను ఊహించుకోలేదన్నారు.
 
మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో జరగనున్న ఆరెస్సెస్ కార్యక్రమానికి మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ హజరయ్యారు. దీనిపై యూపీఏ ఛైర్ పర్సన్ సోనియాగాంధీ సలహాదారుడు అహ్మద్ పటేల్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆరెస్సెస్ కార్యక్రమానికి ప్రణబ్ హాజరవుతారని తాము ఊహించలేదన్నారు. 
 
ఆరెస్సెస్ కార్యక్రమానికి ప్రణబ్ హాజరుకాకపోవడమే మంచిదని ఆయన కుమార్తె శర్మిష్ట ముఖర్జీ చెప్పిన గంటల వ్యవధిలోనే అహ్మద్ పటేల్ స్పందించారు. ఆరెస్సెస్‌తో ప్రణబ్ కలవడం కొత్త సమస్యలకు శ్రీకారం చుడుతుందని పలువురు కాంగ్రెస్ నేతలు అభిప్రాయపడుతున్నారు. 
 
అయినప్పటికీ ప్రణబ్ ఇవేమీ పట్టించుకోకుండా ఈ సమావేశానికి హాజరయ్యారు. ఇందులోభాగంగా, ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్‌తో కూడా భేటీ అయ్యారు. అలాగే, పలువురు ఆర్ఎస్ఎస్ నేతలను కూడా ఆయన కలుసుకున్నారు. దీంతో ప్రణబ్ వ్యవహారశైలిపై విమర్శలు చెలరేగాయి. 
 
ఇదిలావుంటే, సంఘ్ కార్యక్రమానికి ప్రణబ్ హాజరుకాకూడదని తెలంగాణ నేత వి.హనుమంతరావు కూడా కోరారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడటం కోసం ప్రణబ్ తన నిర్ణయాన్ని మార్చుకోవాలని వీహెచ్ అన్నారు.
 
మరోవైపు, ప్రణబ్ నిర్ణయాన్ని బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా స్వాగతించారు. మహాత్మాగాంధీ, మాజీ రాష్ట్రపతి జాకీర్ హుస్సేన్‌లాంటి వారు కూడా ఆరెస్సెస్ కార్యక్రమాలకు అతిథులుగా వచ్చారని గుర్తుచేశారు.