గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 2 అక్టోబరు 2022 (18:43 IST)

భారత్ మార్స్ మిషన్ "మామ్" కథ ముగిసినట్టేనా?

mars mission
అంగారక గ్రహంపై అధ్యయనం కోసం భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) గత 2013లో పంపించిన మార్స్ మిషన్ "మామ్" కథ ముగిసిపోయింది. ఈ మిషన్‌ కోసం ఉపయోగించిన ఆర్బిటర్ మూగబోయింది. గత ఎనిమిదేళ్ల కాలంలో ఎంతో విలువైన సమాచారాన్ని చేరవేసిన ఆర్బిటర్.. ఇటీవల చివరి సందేశాన్ని చేరవేసింది. 
 
గత 2013 నవంబరు 5వ తేదీన రోదసిలోకి మార్స్ ఆర్బిటర్ మిషన్ "మామ్"ను ఇస్రో పంపించింది. ఇపుడు మామ్ స్పేశ్ క్రాఫ్ట్ మూగబోయింది. 
 
నిజానికి ఈ ఆర్బిటర్‌ను ఆరు నెలల పాటు పని చేసేలా డిజైన్ చేశారు. కానీ, ఇది ఎనిమిదేళ్లపాటు తన సేవలను నిర్విరామంగా అందించి ఇపుడు మూగబోయింది. ఫలితంగా ఇటీవలే భూమిపై ఉన్న స్పేస్ సెంటరుతో సంబంధాలను కోల్పోయింది. దీనికి పలు కారణాలు లేకపోలేదు. 
 
ఈ ఆర్బిటర్‌లో నింపిన ఇంధనం నిండుకోవడం, బ్యాటరీ శక్తి తరిగిపోవడంతో ఈ ఆర్బిటర్ పనితీరు నిలిచిపోయిందా? అనే కోణంలో ఇస్రో కారణాలు అన్వేషిస్తోంది. అంగారకుడి ఉపరితలంపై సుదీర్ఘకాలం పాటు సంభవించిన భారీ గ్రహణం వల్ల ఇది శక్తిని సమకూర్చుకోలేకపోయిందన్న కోణంలోనూ ఇస్రో విశ్లేషిస్తోంది. 
 
సాధారణంగా గ్రహణం సమయంలో దీని యాంటెన్నాను మరో దిశకు మళ్లించే యాంత్రిక విన్యాసం విఫలమైనందువల్లే ఇది పనిచేయడం ఆగిపోయి ఉంటుందన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. 
 
కాగా, ఇక ఈ స్పేస్ క్రాఫ్టును తిరిగి భూమికి తీసుకురావడం సాధ్యమయ్యే పనికాదని యూఆర్ రావు శాటిలైట్ సెంటర్ (యూఆర్ఎస్ సీ)కు చెందిన ఓ శాస్త్రవేత్త తెలిపారు. 
 
భారత్ చేపట్టిన మార్స్ ఆర్బిటర్ మిషన్ బడ్జెట్ రూ.450 కోట్లు. ఈ ఆర్బిటర్ బరువు 1.35 టన్నులు. ఈ ఆర్బిటర్‌ను పీఎస్ఎల్వీ రాకెట్ అంతరిక్షంలోకి మోసుకెళ్లింది. విజయవంతంగా అంగారక కక్ష్యలోకి ప్రవేశించింది. 
 
అప్పటి నుంచి ఇప్పటిదాకా ఎంతో విలువైన సమాచారాన్ని శాస్త్రవేత్తలకు అందించింది. మామ్ సేకరించిన డేటాను ప్రపంచవ్యాప్తంగా అనేక అంతరిక్ష పరిశోధన సంస్థలు తమ విశ్లేషణల కోసం ఉపయోగించుకోవడం విశేషం.