సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 26 మార్చి 2020 (14:06 IST)

కరోనా కష్టాల్లో శుభవార్త : ఆర్థిక ప్యాకేజీ ప్రకటించిన కేంద్రం..

కరోనా వైరస్ కల్లోలంతో దేశ వ్యాప్తంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అనేక మంది పస్తులతో ఉంటున్నారు. ఇలాంటి వారికోసం కేంద్రం ఓ భారీ ఆర్థిక ప్యాకేజీని ప్రకటించింది. దీనికి గరీబ్ కళ్యాణ్ ప్యాకేజీ పేరుతో దీన్ని అమలు చేయనున్నారు. ఈ ప్యాకేజీ విలువ రూ.1,70,000 కోట్లు. ఈ విషయాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారమన్ వెల్లడించారు. 
 
ఇదే అంశంపై ఆమె గురువారం మీడియాతో మాట్లాడుతూ, లాక్‌డౌన్ కారణంగా దేశంలో ఆకలి చావులు లేకుండా కేంద్రం అన్ని ఏర్పాట్లు చేసిందనీ.. పేదలకు నేరుగా సాయం అందేలా చర్యలు తీసుకుంటామని నిర్మల ప్రకటించారు. కరోనా రోగులకు చికిత్స అందిస్తున్న వైద్యులు, పారామెడికల్ సిబ్బంది, పారిశుద్ధ్యం సిబ్బందికి రూ.50 లక్షల మేర హెల్త్ ఇన్సూరెన్స్ కల్పించనున్నట్టు తెలిపారు. 
 
80 కోట్ల మంది పేద ప్రజలకు ఇప్పుడిస్తున్న రూ.5 కేజీల బియ్యం, గోధుమలకు అదనంగా మరో 5 కేజీలు ఉచితంగా అందిస్తామని నిర్మల పేర్కొన్నారు. ఇప్పుడిస్తున్న 1 కేజీ పప్పు ధాన్యాలకు అదనంగా మరో కేజీ పప్పు ధాన్యాలు ఇస్తామన్నారు. ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన కింద వచ్చే మూడు నెలల పాటు ఈ అదనపు ప్రయోజనాలు అందిస్తామన్నారు. 
 
ఈ ప్యాకేజీని రెండు విధాలుగా అందిస్తామని నిర్మలా సీతారామన్ చెప్పారు. ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా లబ్ధిదారులకు నేరుగా సాయం అందిస్తామని తెలిపారు. పేద వారిలో ఒక్కరూ ఆకలి బాధతో ఉండే పరిస్థితి రానివ్వబోమని హామీ ఇచ్చారు. రానున్న మూడు నెలలకు సరిపడా బియ్యం, గోధుమలు కూడా పంపిణీ చేస్తామని విత్తమంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు.