1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 22 జులై 2022 (08:57 IST)

ప్రపంచ కుబేరుల్లో అదానీకి నాలుగో స్థానం...

Adani
భారతదేశ పారిశ్రామికవేత్తల్లో ఒకరైన గౌతమ్ ఆదానీ ఆస్తులు విలువ అంతకంతకూ పెరిగిపోతున్నాయి. కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే ఆయన సామ్రాజ్యం అంతకంతకూ విస్తరిస్తుంది. ఈ క్రమంలో ప్రపంచ కుబేరుడు బిల్ గేట్స్‌ను కూడా ఆయన వెనక్కి నెట్టేశారు. ప్రస్తుతం ఆయన ప్రపంచ కుబేరుల జాబితాలో నాలుగో స్థానాన్ని అధిరోహించారు. 
 
ఫోర్బ్స్‌ రియల్‌ టైమ్‌ కుబేరుల జాబితా ప్రకారం.. అదానీ సంపద 116.30 బిలియన్‌ డాలర్లు (సుమారు రూ.9,30,000 కోట్లు) కాగా.. గేట్స్‌ సంపద విలువ 104.6 బిలియన్‌ డాలర్లు (సుమారు రూ.8,36,800 కోట్లు). గత 24 గంటల వ్యవధిలో అదానీ సంపద 337 మిలియన్‌ డాలర్ల మేర పెరిగింది.
 
గత రెండేళ్లలో అదానీ గ్రూప్‌నకు చెందిన కొన్ని లిస్టెడ్‌ కంపెనీల షేర్ల విలువలు 600 శాతానికి పైగా పెరిగాయని.. దేశీయ విమాన ప్రయాణికుల రాకపోకల్లో 25 శాతం వాటా కలిగిన 7 విమానాశ్రయాలు గత 3 ఏళ్లలోనే అదానీ పరం అయ్యాయని బ్లూమ్‌బర్గ్‌ తెలిపింది.
 
అంబుజా సిమెంట్స్‌, ఏసీసీలో హోల్సిమ్‌ గ్రూప్‌ వాటాను 10.5 బి.డా.కు గత మే నెలలో కొనుగోలు చేయడం ద్వారా, ఒక్కసారిగా దేశీయ సిమెంటు తయారీలో రెండోస్థానానికి అదానీ గ్రూప్‌ చేరింది. ఇజ్రాయెల్‌లో అతిపెద్ద నౌకాశ్రయమైన హైఫాను గత వారంలో 1.18 బి.డా.కు కొనుగోలు చేశారు.
 
టెస్లా, స్పేస్‌ ఎక్స్‌ వ్యవస్థాపకుడు ఎలాన్‌ మస్క్‌ ఈ జాబితాలో అగ్రస్థానంలో నిలిచారు. ఆయన నికర సంపద విలువ 235.80 బిలియన్‌ డాలర్లు. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఛైర్మన్‌ ముకేశ్‌ అంబానీ 90 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.7,20,000 కోట్లు) సంపదతో ఈ జాబితాలో 10వ స్థానం పొందారు. ఫోర్బ్స్‌ అత్యంత శ్రీమంతుల జాబితాల్లో తొలి 10 స్థానాల్లో భారత్‌ నుంచి అదానీ, ముకేశ్‌లకే చోటు లభించడం గమనార్హం. 
 
ఈ జాబితాలో మొదటి స్థానంలో ఎలాన్ మస్క్ (235.80 బిలియన్ డాలర్లు), బెర్నార్డ్  ఆర్నాల్డ్ 156.20 బి.డా, జెఫ్ బెజోస్ 148.40 బి.డా, గౌతమ్ ఆదానీ 116.30 బి.డా, బిల్ గేట్స్ 104.60 బి.డా, లారీ ఎలిసన్ 99.70 బి.డా, వారెన్ బఫెట్ 99.40 బి.డా, లారీ పేజ్ 98.30 బి.డా, సెర్గీ బ్రిన్ 94.50 బి.డా, ముకేశ్ అంబానీ 90.00 బిలియన్ డాలర్లుగా ఉంది.