శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 14 సెప్టెంబరు 2022 (10:45 IST)

రైలులో పురుడు పోసిన హౌస్ సర్జన్ స్టూడెంట్ - వీడియో వైరల్

delivary in moving train
అర్థరాత్రి పూట రైలులో ఎలాంటి పరికరాలు లేకుండానే గర్భిణీకి ఒక హౌస్ సర్జన్ చేస్తున్న వైద్య విద్యార్థిని నార్మల్ డెలివరీ చేశారు. తద్వారా తల్లీ బిడ్డ ప్రాణాలను కాపాడారు. దీంతో ఆ వైద్యురాలని ప్రతి ఒక్కరూ అభినందిస్తున్నారు. దీనికి సంబంధించిన వార్తతో పాటు వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, విజయవాడ నుంచి విశాఖపట్నం దురంతో ఎక్స్‌ప్రెస్ రైలు సోమవారం రాత్రి బయలుదేరింది. ఈ రైలులో వైజాగ్ గీతం మెడికల్ కాలేజీకి చెందిన హౌస్ సర్జన్ స్వాతిరెడ్డి కేసరి సోమవారం రాత్రి విజయవాడలో అదే రైలులో విశాఖకు బయల్దేరారు. 
 
ఆమె ఎక్కిన బి6 బోగీలో శ్రీకాకుళానికి చెందిన సత్యవతి (28), ఆమె భర్త ప్రయాణిస్తున్నారు. సత్యవతి నిండు గర్భిణి. డెలివరీకి ఇంకా నాలుగు వారాల సమయం ఉండటంతో పుట్టింటికి వెళుతోంది. అయితే, ఆమెకు మంగళవారం తెల్లవారుజామున 3.35 గంటల సమయంలో పురిటి నొప్పులు మొదలయ్యాయి. మరో స్టేషన్ వచ్చేవరకు ఆస్పత్రికి తరలించే అవకాశం లేకపోవడంతో ఆమె భర్తలో ఆందోళన మొదలైంది. 
 
ఎవరైనా మహిళల సాయం తీసుకోవాలనే ఉద్దేశంతో స్వాతి రెడ్డి బెర్త్ వద్దకు వచ్చి ఆమెను నిద్రలేపారు. తన భార్యకు పురిటి నొప్పులు వస్తున్నాయని, సాయం చేయాలని కోరారు. స్వాతిరెడ్డి డాక్టర్ కావడంతో వెంటనే స్పందించి 15 నిమిషాల్లోనే నార్మల్ డెలివరీ చేశారు. ఆ క్షణంలో ఆమె దగ్గర ఒక్క పరికరం కూడా లేదు. బెడ్ షీటు అడ్డంగా పెట్టి పురుడు పోశారు. 
 
తెల్లవారుజామును 5.30 గంటలకు రైలు అనకాపల్లి చేరడంతో స్వాతిరెడ్డి వారిని.. అప్పటికే సిద్ధంగా ఉన్న 108 వాహనంలో ఎన్టీఆర్ ఆస్పత్రికి తరలించి.. తదుపరి వైద్యం అందించారు. పురుడు పోసి తల్లీబిడ్డలను కాపాడిన స్వాతిరె డ్డికి సత్యవతి దంపతులు కృతజ్ఞతలు తెలిపారు. గీతం కాలేజీ యాజమాన్యం కూడా ఆమెను అభినందించింది.