శనివారం, 23 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 29 ఏప్రియల్ 2020 (19:09 IST)

వలస కూలీలు - యాత్రికుల తరలింపునకు కేంద్రం పచ్చజెండా

కరోనా వైరస్ కారణంగా దేశం లాక్‌డౌన్‌లోకి వెళ్లింది. ఫలితంగా దేశంలో ఒక్కసారిగా ప్రజా రవాణా బంద్ అయింది. ఈ కారణంగా వివిధ రాష్ట్రాల్లో చిక్కుకున్న వలస కార్మికులు, పర్యాటకులు, విద్యార్థులు, ఇతరులు తమతమ ప్రాంతాల్లోనే బస చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే, ప్రస్తుతం దేశంలో రెండో దశ లాక్‌డౌన్ అమల్లో వుంది. ఇది వచ్చే నెల మూడో తేదీతో ముగియనుంది. 
 
ఈ నేపథ్యంలో కేంద్రం అంతర్రాష్ట్ర ప్రయాణాలకు అనుమతినిస్తూ కొన్ని మార్గదర్శకాలను జారీచేసింది. వలస కూలీలు, కార్మికులు, విద్యార్థులు, పర్యాటకుల తరలింపుపై హోంశాఖ మార్గదర్శకాలు విడుదల చేసింది. అయితే, వలస కూలీలు, ఇతరుల తరలింపుపై ఇరు రాష్ట్రాలు పరస్పరం అంగీకారానికి రావాలని పేర్కొంది. 
 
ఇందుకోసం అన్ని రాష్ట్రాలు నోడల్ అధికారులను నియమించుకోవాలని సూచన చేసింది. అందరికీ పరీక్షలు నిర్వహించిన తర్వాతే కరోనా లక్షణాలు లేని వ్యక్తుల తరలింపును చేపట్టవచ్చని తెలిపింది. తరలించే సమయంలో భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవాలని సూచించింది. వలస కూలీలను తరలించేందుకు ఉపయోగించే వాహనాలను సైతం శానిటైజ్‌ చేసి నిబంధనలు పాటించాలని హోంశాఖ పేర్కొంది. 
 
అలాగే, వివిధ రాష్ట్రాల్లో చిక్కుకున్న టూరిస్టులు, యాత్రికులు, విద్యార్థులు, ఇత‌రులు త‌మ త‌మ రాష్ట్రాల‌కు వెళ్లేందుకు అనుమ‌తి ఇచ్చింది. అయితే ఆయా రాష్ట్ర ప్ర‌భుత్వాలు ఏర్పాట్లు చేయాల‌ని, బ‌స్సుల ద్వారా చిక్కుకున్న వారిని త‌ర‌లించాల‌ని కేంద్ర హోంశాఖ ఆదేశాల్లో పేర్కొంది. 
 
వీరంతా స్వరాష్ట్రానికి చేరుకున్న తర్వాత హోమ్ క్వారెంటైన్‌లో తప్పనిసరిగా ఉండాలని ఆదేశించింది. స్థానిక అధికారులు టూరిస్టుల‌కు సంబంధించిన స‌మాచారాన్ని సేక‌రిస్తార‌ని, ఒక‌వేళ వాళ్ల‌కు హాస్పిట‌ల్ క్వారెంటైన్ అవ‌స‌రం వ‌స్తే అప్పుడు మ‌రిన్ని చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ప్ర‌భుత్వం సూచించింది.