సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 1 ఆగస్టు 2022 (08:58 IST)

దేశంలో తొలి మంకీపాక్స్ మృతి కేసు నమోదు

monkeypox
దేశంలో తొలిసారి మంకీపాక్స్ మృతి కేసు నమోదైంది. యూఏఈలో ఉండగానే, మంకీపాక్స్ సోకిన యువకుడు అధికారులకు చెప్పలేదు. కేరళకు వచ్చాక ఆయనకు తీవ్ర జ్వరం, తలనొప్పి రావడంతో ఆస్పత్రిలో చేరాడు. అక్కడ జరిపిన వైద్య పరీక్షల్లో అతనికి మంకీపాక్స్ సోకినట్టు తేలింది. పైగా, చర్మంపై పుండ్లు, దద్దుర్లు వంటివి లక్షణాలు లేకపోవడంతో సాధారణ చికిత్స అందిస్తూ వచ్చారు. అయితే, ఆ యువకుడు మృతి చెందాడు. ఇది భారత్‌‌లో నమోదైన తొలి మంకీపాక్స్ కేసుగా నమోదైంది. 
 
ఈ యువకుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం రాత్రి మృతి చెందాడు. మృతుని వయసు 22 యేళ్లు. అయితే, ఈ విషయం ఆలస్యంగా తెలిసిందని కేరళ ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు అతడి నమూనాలను పరీక్షల కోసం పంపామని, మృతి కారణాలను విశ్లేషిస్తున్నామని తెలిపారు. ఇది మంకీపాక్స్ కారక మరణమేనని కేరళ ఆరోగ్య శాఖ అధికారికంగా ప్రకటించక పోయినప్పటికీ దేశంలో తొలి మంకీపాక్స్ మృతిగా పేర్కొంటున్నారు. 
 
మరోవైపు, ఈ మృతిపై కేరళ ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ స్పందించారు. శనివారం మరణించిన యువకుడిలో మంకీపాక్స్ లక్షణాలు ఏవీ కనిపించలేదని ఆ యువకుడి మృతికి కారణాలను విశ్లేషిస్తున్నామని తెలిపారు. కోవిడ్ తరహాలో మంకీపాక్స్ ప్రాణాంతకం కాదని ఆమె తెలిపారు. ఈ వైరస్ ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తున్నప్పటికీ మరణాలు రేటు మాత్రం చాలా తక్కువగా ఉందని తెలిపారు.