బుధవారం, 1 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 16 జూన్ 2020 (14:47 IST)

లడఖ్‌లో టెన్షన్ - టెన్షన్ : ముగ్గురు భారతీయ సైనికుల మృతి

భారత్ - చైనా దేశాల మధ్య మళ్లీ ఉద్రిక్తలు తలెత్తాయి. నిన్నటివరకు సమస్య ముగిసిందని భావించిన తరుణంలో మళ్లీ ఇరు దేశాల సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ముఖ్యంగా లడఖ్ ప్రాంతంలో ఇరుదేశాల సైనికుల మధ్య జరిగిన ఘర్షణలో ముగ్గురు భారత భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటన లడఖ్ గాల్వన్ లోయలో జరిగింది. చైనా సైనికుల దాడిలో ఓ అధికారితో పాటు.. ఇద్దరు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. అలాగే, చైనా సైనికులు కూడా గాయపడినట్టు సమాచారం. 
 
చైనా సైనికులు హద్దుమీరిన చర్యలను భారత్ తీవ్రంగా పరిగణిస్తోంది. దేశ రాజధాని ఢిల్లీలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, కేంద్ర విదేశాంగ మంత్రి జయశంకర్‌తో అత్యవసర సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి సీడీఎస్ బిపిన్ రావత్, త్రివిధ దళాల అధిపతులను కూడా హుటాహుటిన పిలిపించారు. చైనా దూకుడుకు ఎలా అడ్డుకట్ట వేయాలన్న దానిపై చర్చలు జరుపుతున్నట్టు సమాచారం. 
 
కాగా, 1962 యుద్ధం తర్వాత సరిహద్దుల్లో అనేక ఘర్షణలు జరిగినా, ప్రాణనష్టం జరగడం ఇదే ప్రథమం. సైనికాధికారి సహా ముగ్గురు మరణించడంతో భారత్ దీన్ని తీవ్రంగా పరిగణిస్తోంది. అందుకే డ్రాగన్ కంట్రీకి తగిన గుణపాఠం చెప్పాలన్న ధోరణితో భారత్ ఉన్నట్టు తెలుస్తోంది.