మంగళవారం, 26 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఠాగూర్

దేశంలో మళ్లీ ప్రారంభమైన కరోనా వేవ్? నిపుణులు ఏమంటున్నారు...

covid
దేశంలో కరోనా ఫోర్త్ వేవ్ ప్రారంభమైందా? గత కొన్ని రోజులుగా కరోనా పాజిటివ్ కేసులు విపరీతంగా పెరిగిపోతుండటంతో ఈ తరహా సంకేతాలు వెలువడుతున్నాయి. ముఖ్యంగా, ఢిల్లీ, మహారాష్ట్ర, కేరళ, కర్నాటక, హర్యానా రాష్ట్రంలో ఈ కేసుల నమోదు సంఖ్య అధికంగా ఉంది. దీంతో దేశంలో క్రియాశీలక కేసుల సంఖ్య 40వేలు దాటిపోయింది. 
 
అయితే, కొత్త కేసులు పెరుగుతున్నప్పటికీ ఎలాంటి భయాందోళనలు అవసరం లేదని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఆందోళన కలిగించే కొత్త వేరియంట్‌లేవీ మన దేశంలో లేవని.. కేసుల పెరుగుదల కూడా కేవలం కొన్ని జిల్లాలకు మాత్రమే పరిమితమైనట్టు గుర్తు చేస్తున్నారు. కొవిడ్‌ నిబంధనలు సరిగా పాటించకపోవడం, బూస్టర్‌ డోసులు తీసుకోకపోవడం వంటివి ప్రజల్లో ఇన్ఫెక్షన్‌ పెరుగుదలకు కారణం కావొచ్చని విశ్లేషిస్తున్నారు. 
 
ఇదే అంశంపై నేషనల్‌ టెక్నికల్‌ అడ్వయిజరీ గ్రూపు ఆఫ్‌ ఇమ్యునైజేషన్‌ ఛైర్మన్‌ డాక్టర్‌ ఎన్‌.కె.అరోడా మాట్లాడుతూ, దేశంలో ఆందోళన కలిగించే కొత్త వేరియంట్‌ ఏమీ లేదు. ప్రస్తుతం బీఏ 2కు తోడు బీఏ 4, బీఏ 5 ఒమిక్రాన్‌ సబ్‌ వేరియంట్లు ఉన్నాయి. ఒమిక్రాన్‌ ఇతర సబ్‌ వేరియంట్లతో పోలిస్తే వీటి వ్యాప్తి కాస్త ఎక్కువగానే ఉంది. ఈ పరిస్థితికి తోడు వేసవి సెలవులతో ప్రజల కదలికలు పెరగడం, దేశీయ, అంతర్జాతీయ ప్రయాణాలపై ఆంక్షల సడలింపు, ఆర్థిక కార్యకలాపాలను పూర్తిస్థాయిలో ప్రారంభించడం వంటి కారణాల రీత్యా ఇమ్యూనిటీ తక్కువ ఉన్న కొందరు వ్యక్తులకు వైరస్‌ సోకుతోందని వివరించారు. 
 
ఎక్కువ జనసాంద్రత కలిగిన భారీ, మెట్రో నగరాల్లోనే ప్రస్తుతం ఇన్ఫెక్షన్‌ పెరుగుదల పరిమితమైంది. ఇంకో ముఖ్యమైన విషయమేమిటంటే, ఇటీవల కాలంలో కొవిడ్‌ సోకుతున్న చాలా మందిలో సాధారణ జలుబు, తేలికపాటి అనారోగ్యానికే గురవుతున్నారు. అందువల్ల ఎలాంటి భయం అవసరంలేదు. కానీ కరోనా మన చుట్టూ ఉందనేది గమనంలో ఉంచుకొని తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. రోజువారీ జీవితంలో మాస్కులు ధరించడం తప్పనిసరిగా అలవాటు చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.