శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఐవీఆర్
Last Modified: సోమవారం, 23 మార్చి 2020 (23:05 IST)

వామ్మో దిన పత్రికపై కరోనా వైరస్ వుంటే? ప్రింట్‌ మీడియా బంద్‌....!?

ప్రపంచాన్ని వణికిస్తోన్న ‘కరోనా’ ప్రింట్‌ మీడియాపై కూడా తన ప్రతాపాన్ని చూపుతోంది. మీడియాలో పనిచేసే వ్యక్తులు దీని భారిన పడడం సంగతి ఎలా ఉన్నా పత్రికను కొనుగోలు చేయడానికి, వాటిని చూడడానికి ప్రజలు ఇష్టపడడం లేదు. నిత్యం ఇంటి ముందుకు వచ్చే పత్రిక వల‌న ‘కరోనా’ వైరస్‌ ఉంటుందనే భయంతో చాలామంది పత్రికను చదవడానికి నిరాకరిస్తున్నారు. 
 
అంతే కాదు.. పత్రికను సరఫరా చేసే ఏజెన్సీస్‌, పేపర్‌ బాయ్స్‌ పత్రికను అంటుకోవడానికి భయపడుతున్నారు. పత్రికను పట్టుకుంటే భయంకరమైన ‘కరోనా’ ఎక్కడ తమను కబళిస్తుందనే భయంతో వారు పత్రికల‌ పంపిణీకి ఇష్టపడడం లేదు. చిన్న పత్రికలు ఇప్పటికే ప్రభుత్వాల‌ అనాదరణ, పెరిగిన న్యూస్‌ ప్రింట్ ధరలు, ఇతర వ్యయాల‌తో కుంగిపోయి ఉన్నాయి. 
 
ఈ పరిస్థితుల్లో మహమ్మారి ‘కరోనా’ దెబ్బకు పూర్తిగా కూల‌బడిపోయాయి. ఇప్పుడు ప్రముఖ పత్రికలు కూడా అదే దారిలో పయనిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ప్రసిద్ధ చెందిన పత్రికల‌కు ‘కరోనా’ భయం పట్టుకుంది. ప్రింటింగ్‌ చేసిన పత్రికను సరఫరా చేయడానికి ఎవరూ ముందుకు రాకపోతుండటంతో కొన్నాళ్లు పత్రికను ముద్రించకుండా బంద్‌ చేయాల‌నే భావన వారిలో కనిపిస్తోంది. తెలుగులో అత్యధిక సర్క్యులేషన్‌ ఉన్న ‘ఈనాడు’ యధావిధిగా పత్రికను ముద్రిస్తుంది. 
 
అయితే మిగతా పత్రికల‌ సంగతి ఏమిటో తెలియ రావడం లేదు. ‘ఈనాడు’ తరువాత ఉన్న పత్రికల్లో అత్యధిక పత్రికలు ‘కరోనా’ ప్రభావం తగ్గే వరకు బంద్‌ చేయాల‌నే భావనలో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రముఖ ఇంగ్లీషు పత్రిక, దాని ప్రాంతీయ పత్రికలు ఇప్పటికే బంద్‌ అయ్యాయని వార్తలు వస్తున్నాయి. మరి మిగతా పత్రిక యాజమాన్యాలు నేడో రేపో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కాగా..ఆయా పత్రికల‌ను బంద్‌ చేసినా... వాటి అనుబంధంగా ఉండే వెబ్‌సైట్లు, యాప్‌లు య‌ధావిధిగా పనిచేస్తాయి.