శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 30 సెప్టెంబరు 2020 (12:45 IST)

బాబ్రీ మసీదును కూల్చింది సంఘ వ్యతిరేకులు.. నిందితులంతా నిర్దోషులే

బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో లక్నోలోని సీబీఐ ప్రత్యేక కోర్టు బుధవారం తుది తీర్పును వెలువరించింది. ఈ కేసులో పేర్కొన్నవారందరినీ నిర్దోషులుగా కోర్టు తేల్చింది. పైగా, బాబ్రీ మసీదు కూల్చివేతకు ఎలాంటి ముందస్తు ప్రణాళిక రచించలేదని న్యాయమూర్తి సురేంద్ర కుమార్ యాదవ్ తీర్పునిచ్చారు. మొత్తం 2 వేల పేజీలు ఉన్న తీర్పు కాపీని ఆయన చదివి వినిపించారు. 
 
దీంతో దాదాపు 28 సంవత్సరాల సుదీర్ఘ విచారణ అనంతరం బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో తుది తీర్పు వెలువడింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న బీజేపీ అగ్రనేతలు ఎల్కే ఆద్వానీ, మురళీ మనోహర్‌ జోషి, ఉమా భారతితో పాటు సంఘ్ ‌పరివార్‌ నేతలందరూ నిర్దోషులుగా తేలారు. బాబ్రీ మసీదును కూల్చివేసినవారు సంఘ వ్యతిరేకులని కోర్టు తీర్పులో పేర్కొంది. 
 
నిందితులపై సీబీఐ అభియోగాలు నిరూపించలేకపోయిందని కోర్టు తెలిపింది. దీంతో నిందితులు అందరిపై ఉన్న అభియోగాలను కొట్టివేస్తున్నట్లు తెలిపింది. నిందితులు అందరినీ నిర్దోషులుగా తేల్చినట్లు ప్రకటించింది. వారంతా నేరపూరిత కుట్రకు పాల్పడ్డారన్న ఆధారాలు లేవని స్పష్టం చేసింది. 
 
లక్నో 18వ నెంబ‌ర్ కోర్టులో రూమ్‌లో తీర్పును వెలువ‌రించారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న అద్వానీ, జోషీ, ఉమాభార‌తి కోర్టుకు హాజ‌రుకాలేదు.  1992, డిసెంబ‌ర్ 6వ తేదీన బాబ్రీ మ‌సీదును ధ్వంసం చేసిన విష‌యం తెలిసిందే. కేసులో నిందితులుగా ఉన్న అద్వానీ, జోషీలు.. వీడియోకాన్ఫ‌రెన్స్ ద్వారా విచార‌ణ‌కు హాజ‌ర‌య్యారు.