శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 16 సెప్టెంబరు 2020 (18:14 IST)

అద్వానీ, జోషీలకు పిలుపు... 30న బాబ్రీ మసీదుపై తుది తీర్పు : ప్రత్యేక కోర్టు

ఎన్నో దశాబ్దాలుగా సాగుతూ వచ్చిన బాబ్రీ మసీదు విధ్వంసం కేసులో ఎట్టకేలకు తుదితీర్పు వెలువడనుంది. ఈ నెల 30వ తేదీన తుది తీర్పును వెలువరించనున్నట్టు ప్రత్యేక కోర్టు బుధవారం వెల్లడించింది. అందువల్ల ఆ రోజున ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ కురువృద్ధులైన ఎల్కే.అద్వానీ, మురళీ మనోహర్ జోషీ, ఉమా భారతిలు తప్పకుండా కోర్టుకు హాజరుకావాలని కోర్టు ఆదేశించింది. 
 
బాబ్రీ స్థలంలో పురాతన రామాలయం ఉదంటూ కరసేవకులు 1992 డిసెంబరు నెల 6వ తేదీన అయోధ్యలోని బాబ్రీ మసీదును కూల్చివేశారు. ఆ సమయంలో రామాలయ ఉద్యమానికి సారథ్యం వహించిన వారిలో ఎల్కే. అద్వానీ, ఎం.ఎం.జోషిలు ఉన్నారు. ఈ కేసు విచారణ సమయంలో అద్వానీ, జోషిలు వీడియా కాన్ఫరెన్స్ ద్వారా కోర్టుకు తమ వాంగ్మూల్మం ఇచ్చారు.
 
ఈ నేపథ్యంలో ఈ కూల్చివేత కేసుపై తుది తీర్పును ఈ నెల 30వ తేదీన ప్రత్యేక సీబీఐ న్యాయమూర్తి ఎస్‌కే యాదవ్ వెలువరించనున్నారు. ఈ తీర్పును వినేందుకు ఈ కేసులోని నిందితులందరూ తప్పనిసరిగా కోర్టుకు హాజరుకావాలని న్యాయమూర్తి ఆదేశించారు. 
 
ఇదిలావుంటే, అయోధ్య కేసుకు ఇటీవలే పరిష్కారం లభించిన విషయం తెల్సిందే. వివాదాస్పద 2.77 ఎకరాల భూమిని రామాలయ నిర్మాణం కోసం ట్రస్టుకు అప్పగించాలని గత యేడాది సుప్రీంకోర్టుకు చెందిన ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం చారిత్రక తీర్పునిచ్చింది. 
 
అయోధ్యలోనే మరో చోట ఐదెకరాల స్థలాన్ని మసీదు నిర్మాణానికి ఇవ్వాలని కూడా ధర్మాసనం తన తీర్పులో పేర్కొంది. ఈ తీర్పుతో అయోధ్యలో రామమందిర నిర్మాణానికి కూడా ఇటీవల భూమిపూజ జరిగింది.