శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Updated : సోమవారం, 30 డిశెంబరు 2019 (16:01 IST)

2019లో సుప్రీం కోర్టు వెల్లడించిన సంచలన తీర్పులు

భారత న్యాయవ్యవస్థ చరిత్రలో 2019కి ప్రత్యేక స్థానం ఉంది. మైలురాయి లాంటి కేసుల విచారణలు, తీర్పులతో ఈ ఏడాది సుప్రీంకోర్టు సమయం అత్యంత బిజీగా గడిచిందనే చెప్పాలి. అత్యంత క్లిష్టమైన పలు కేసులలో దేశ అత్యున్నత న్యాయస్థానం ఈ ఏడాది తీర్పులు చెప్పింది.
 
రామ జన్మభూమి-బాబ్రీ మసీదు కేసు, శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశం, మహారాష్ట్ర అసెంబ్లీలో బలపరీక్ష, ఆర్టికల్ 370 రద్దు, రఫేల్ ఒప్పందం, భారత ప్రధాన న్యాయమూర్తిని ఆర్టీఐ కిందకు తీసుకురావడం, తిరుగుబాటు ఎమ్మెల్యేలు ఎన్నికలలో పోటీ చేసేందుకు అనుమతించడం, లక్షల మందికి ఉచిత న్యాయ సహాయం... ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి.
 
అయితే, ఎన్నో ఏళ్లుగా నలుగుతున్న కొన్ని కేసులకు ఇక ముగింపు పడినట్లేనని చాలామంది భావించినా... రివ్యూ పిటిషన్ల కారణంగా విచారణలు కొనసాగుతున్నాయి.
 
1. అయోధ్య 
అయోధ్యలోని వివాదాస్పద స్థలంలో రామ మందిరం నిర్మించేందుకు అనుమతిస్తూ రాజ్యాంగ ధర్మాసనం కీలక తీర్పు ఇవ్వడంతో 164 ఏళ్లుగా నలుగుతున్న, వివాదాస్పదమైన బాబ్రీ మసీదు- రామ జన్మభూమి కేసు ముగిసింది.
 
ఆ వివాదాస్పద స్థలాన్ని ఆలయ నిర్మాణం కోసం రామ్ లల్లాకు న్యాయస్థానం అప్పగించింది. అలాగే, మసీదు నిర్మాణం కోసం సున్నీ వక్ఫ్‌బోర్డ్‌కు అయోధ్యలోనే ఒక ప్రధాన ప్రాంతంలో ఐదెకరాల స్థలం కేటాయించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
 
భారత సుప్రీంకోర్టు చరిత్రలోనే అత్యంత సుదీర్ఘ కాలం (40 రోజులు) వాదనలు విన్న రెండో కేసు ఇది. అత్యంత సున్నితమైన ఈ కేసులో తుది వాదనలు విన్న రాజ్యాంగ ధర్మాసనానికి ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ నేతృత్వం వహించారు.
 
"ఈ 2.77 ఎకరాల స్థలాన్ని భాగాలుగా పంచడం కుదరదు. ఇదంతా ఒకే భూభాగం. ఇది రామ్ లల్లాకు చెందుతుంది. ఈ స్థలంలో రామమందిర నిర్మాణం చేపట్టాలి" అని 2019 నవంబర్ 9న ధర్మాసనం తీర్పు చెప్పింది.
 
ఖచ్చితంగా ఇది భారత అత్యున్నత న్యాయస్థానం పరిష్కరించిన అత్యంత అసాధారణమైన కేసు అని చెప్పొచ్చు. ఆ తీర్పుపై దాఖలైన అన్ని రివ్యూ పిటిషన్లను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బాబ్డే నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం 2019 డిసెంబర్ 12న కొట్టివేసింది.
 
2. కాశ్మీర్: ఆర్టికల్ 370 
కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగంలోని ఆర్టికల్ 370ను సవరించి, ఇక నుంచి జమ్మూకాశ్మీర్ ఒక కేంద్రపాలితంగా, లద్దాఖ్ మరో కేంద్ర పాలిత ప్రాంతంగా ఉంటాయని ప్రకటించిన తరువాత, ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో అనేక పిటిషన్లు దాఖలయ్యాయి.
 
ఆ పిటిషన్లపై ఇంకా విచారణ కొనసాగుతోంది. 2020 ప్రారంభంలో ఆ విచారణలను ఏడుగురు న్యాయమూర్తుల ధర్మాసనానికి సుప్రీంకోర్టు బదిలీ చేసే అవకాశం ఉంది. జమ్మూ కశ్మీర్‌లో ఉద్యమాలపై ఆంక్షలు, ఇంటర్నెట్ సేవల నిలిపివేత, పత్రికా స్వేచ్ఛ, కమ్యూనికేషన్ సేవలపై ఆంక్షలు వంటి అంశాలపై దాఖలైన పిటిషన్లు కూడా అందులో ఉన్నాయి. 
 
కాశ్మీర్ అభివృద్ధి కోసం, వివాదాస్పద సమస్యల పరిష్కారానికి ఆర్టికల్ 370ని సవరించామని కేంద్ర ప్రభుత్వం చెప్పింది. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి భారత్, పాకిస్తాన్‌ల మధ్య కాశ్మీర్ విషయంలో వివాదం కొనసాగుతోంది.
 
3. శబరిమల కేసు 
సుప్రీంకోర్టు ముందున్న మరో క్లిష్టమైన కేసు శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశానికి సంబంధించినది. 10 నుంచి 50 సంవత్సరాల వయసు గల మహిళలు శబరిమల ఆలయంలోకి ప్రవేశించకుండా నిషేధం ఉండేది. అలా మహిళల పట్ల వివక్ష చూపించొద్దని, ఆ ఆలయంలోకి అన్ని వయసుల మహిళలూ వెళ్లి పూజలు చేసుకోవచ్చు అంటూ 2018 సెప్టెంబర్‌ 28న అత్యున్నత న్యాయస్థానం తీర్పు ఇచ్చింది.
 
అయితే, ఆ తీర్పును మరోసారి సమీక్షించాలంటూ దాదాపు 60 దాకా పిటిషన్లు దాఖలయ్యాయి. ఆ పిటిషన్లపై విచారణను ఏడుగురు సభ్యుల విస్తృత ధర్మాసనానికి అప్పగిస్తూ 2019 నవంబర్‌ 14న సుప్రీంకోర్టు నిర్ణయించింది. గతంలో తాము ఇచ్చిన తీర్పుపై స్టే ఏమీ లేదని స్పస్టం చేసింది. శబరిమల ఆలయ నిర్వహణకు సంబంధించి 2020 జనవరిలోగా ప్రత్యేక చట్టం రూపొందించాలని కేరళ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశించింది.
 
4. మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటు వివాదం 
మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాజకీయాలు అనేక మలుపులు తీసుకున్నాయి. బీజేపీ, శివసేన కలిసి ఎన్నికలలో పోటీ చేశాయి. కానీ, ఫలితాల తరువాత బీజేపీకి అధిక సీట్లు ఉన్నప్పటికీ, రెండున్నర సంవత్సరాలు తమకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని శివసేన డిమాండ్ చేసింది.
 
అందుకు బీజేపీ సుముఖంగా లేదు. అలాగని సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే మెజార్టీ ఆ పార్టీకి లేదు. శివసేన వెళ్లి కాంగ్రెస్, ఎన్‌సీపీల కూటమితో జతకట్టి ప్రభుత్వానికి ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతుండగానే... రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతి పాలన విధించింది.
 
ఆ తర్వాత కొద్ది రోజులకు అకస్మాత్తుగా, తెల్లవారుఝామునే రాష్ట్రపతి పాలనను ఎత్తివేసింది. ఆ వెంటనే హుటాహుటిన తమకు ఎన్సీపీ తిరుగుబాటు ఎమ్మెల్యేల మద్దతు ఉందంటూ... బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.
 
ఆ తర్వాత అసెంబ్లీలో ముఖ్యమంత్రి బలనిరూపణ చేసుకోవాలని, అందుకు రహస్య బ్యాలెట్ విధానాన్ని అనుసరించొద్దని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. దాంతో, ఎన్‌సీపీకి చెందిన ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్‌తో పాటు ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ రాజీనామా చేశారు.
 
అసెంబ్లీలో మెజారిటీని నిరూపించుకునేందుకు కోర్టు వారికి ఎక్కువ రోజులు సమయం ఇచ్చి ఉంటే, అంతకుముందు కర్ణాటకలో జరిగినట్లుగానే ఖచ్చితంగా మహారాష్ట్రలోనూ ఎమ్మెల్యేల కొనుగోళ్లు జరిగేవి.
 
5. ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హతపై
జేడీ(ఎస్), కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వానికి చెందిన 17 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయడంతో కర్ణాటకలోని కుమారస్వామి ప్రభుత్వం కూలిపోయింది. ఫిరాయింపుదారులను ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం అనర్హులుగా స్పీకర్ ప్రకటించారు. 2023లో శాసనసభ కాలపరిమితి ముగిసే వరకూ వారు ఎన్నికల్లో పోటీ చేసేందుకు అర్హులు కారని ఉత్తర్వులు ఇచ్చారు.
 
తిరుగుబాటు ఎమ్మెల్యేలు ఈ నిర్ణయాన్ని సుప్రీంకోర్టులో సవాలు చేశారు. కర్ణాటక మాజీ స్పీకర్ వారిని అనర్హులుగా ప్రకటించిన ఉత్తర్వును సుప్రీంకోర్టు సమర్థించింది. కానీ, ప్రస్తుత శాసనసభ కాలపరిమితి ముగిసేదాకా 2023 వరకు వారు ఎన్నికల్లో పోటీచేయడానికి వీల్లేదంటూ స్పీకర్ ఇచ్చిన ఉత్తర్వును కొట్టివేసింది.
 
ఒక వ్యక్తి ఇంత కాలంపాటు ఎన్నికలలో పోటీ చేయకూడదని చెప్పే అధికారం స్పీకర్‌కు లేదని కోర్టు తెలిపింది. దాంతో, ఆ ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఉపఎన్నికల్లో పోటీ చేసేందుకు మార్గం సుగమమైంది.
 
6. రఫేల్ రివ్యూ పిటిషన్
ఫ్రాన్స్‌కు చెందిన డసాల్ట్ ఏవియేషన్ సంస్థ నుంచి 36 రఫేల్ యుద్ధ విమానాలను కొనుగోలు చేసే ఒప్పందాన్ని మోదీ ప్రభుత్వం ఖరారు చేసిన తరువాత, ఆ ఒప్పందంలో సరైన విధానాలు పాటించలేదంటూ విపక్షాలు ఆరోపణలు చేశాయి. అందులో అవినీతి కూడా దాగి ఉందంటూ ఆరోపించాయి.
 
విమానాల కొనుగోలులో ప్రధానమంత్రి కార్యాలయం జోక్యం చేసుకుందని ఆరోపిస్తూ సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలు దాఖలయ్యాయి. అయితే, వ్యవహారంలో జోక్యం చేసుకోబోమని సుప్రీంకోర్టు తెలిపింది.
 
7. ఆర్టీఐ పరిధిలోకి సీజేఐ కార్యాలయం
భారత ప్రధాన న్యాయమూర్తి కార్యాలయం కూడా సమాచార హక్కు చట్టం పరిధిలోకి రావాలా? పారదర్శకంగా పనిచేయడంలేదన్న అభియోగాలు ఎదుర్కొంటున్న సుప్రీంకోర్టును చాలా కాలంగా ఇబ్బంది పెట్టిన ప్రశ్న అది. చివరికి, భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) కార్యాలయాన్ని కూడా సమాచార హక్కు చట్టం కిందకు తెస్తూ 2019 నవంబర్ 13న సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది.
 
సీజేఐ కార్యాలయం కూడా సమాచార హక్కు చట్టం పరిధిలోనే ఉండాలని చెబుతూ తుది తీర్పు నవంబర్ 13న వెలువడింది. సీజే కార్యాలయం కూడా న్యాయవ్యవస్థలో ఒక భాగంగా ఉంది కనుక, సీజే తదితర న్యాయమూర్తులతో కలిపి ఉన్న వ్యవస్థ న్యాయవ్యవస్థ అని రాజ్యాంగ అధికరణ 124లో ఉంది కనుక, మొత్తం న్యాయవ్యవస్థ ఆర్టీఐ పరిధిలోకి వస్తుందని, సీజే కార్యాలయం సమాచారం ఇవ్వాలని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదని ధర్మాసనం వివరించింది.
 
సీజేఐ కార్యాలయం కూడా ఆర్టీఐ పరిధిలోకి వస్తుందంటూ 2010లో దిల్లీ హైకోర్టు తీర్పు చెప్పింది. అయితే, ఆ తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టు సెక్రటరీ జనరల్, సెంట్రల్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. వారి పిటిషన్‌పై విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం.. దిల్లీ హైకోర్టు తీర్పును సమర్థించింది.
 
8. సీజేఐపై లైంగిక వేధింపుల ఆరోపణలు
మొట్టమొదటి సారి ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ మీద లైంగిక వేధింపుల కేసు, న్యాయవ్యవస్థను కుదిపేసింది. గొగోయ్‌కు ఒకప్పుడు జూనియర్ అసిస్టెంట్‌గా ఉన్న మహిళ ఈ లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు.
 
తన ప్రమేయం ఉన్న కేసు తీర్పులో తనను తాను సమర్థించుకోవడం వివాదాస్పదమైంది. ఆ మహిళ చేసిన ఆరోపణలను పరిశీలించేందుకు జస్టిస్ ఎస్‌ఏ బొబ్డే ఆధ్వర్యంలో ఆయన ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఆ ఆరోపణలను జస్టిస్ బొబ్డే తోసిపుచ్చారు. జస్టిస్ బొబ్డే ప్రస్తుత భారత ప్రధాన న్యాయమూర్తి.
 
9. ఉచిత న్యాయ సహాయం
వేలాది మంది అట్టడుగు, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల వారు ఉచిత న్యాయ సహాయం పొందొచ్చని 2019 ఆరంభంలో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. వార్షిక ఆదాయం రూ.5 లక్షల లోపు ఉన్న ఏ వ్యక్తి అయినా న్యాయ సహాయం పొందే వీలుంది. గతంలో ఆ ఆదాయ పరిమితి రూ. 1.25 లక్షలుగా ఉండేది.
 
10. సహజీవనంలో సెక్స్ రేప్ కాదు
సహజీవనం (లైవ్-ఇన్-పార్టనర్స్) చేస్తున్న వారి మధ్య పరస్పర అంగీకారంతో చేసే సెక్సు అత్యాచారం కాదని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. మహారాష్ట్రలో ఓ వైద్యుడిపై ఒక నర్సు వేసిన కేసులో న్యాయస్థానం ఈ తీర్పు చెప్పింది.
 
11. లింగ నిర్ధారిత శిశు ఎంపిక నిషేధం
లింగ నిర్ధారిత శిశు ఎంపిక నిషేధ చట్టం- 1994 రాజ్యాంగబద్ధతను సుప్రీంకోర్టు సమర్థించింది. ఆ చట్టం ప్రకారం, లింగ నిర్ధారణ పరీక్షలు చేయడం నేరం. లింగ నిర్ధారణ పరీక్షలు చేసిన వైద్యుల రిజిస్ట్రేషన్‌ను రద్దు చేసే అధికారం రాష్ట్ర వైద్య మండలికి ఉంటుంది. ఈ చట్టంలోని 23(1), 23(2) సెక్షన్లను సవాల్ చేస్తూ దాఖలైన కేసులో న్యాయస్థానం తీర్పు చెప్పింది.
 
12. జైలు శిక్ష నుంచి బయటపడిన అనిల్ అంబానీ
రిలయన్స్ కమ్యూనికేషన్ చైర్మన్, పారిశ్రామిక వేత్త అనిల్ అంబానీ కోర్టు ధిక్కరణకు పాల్పడినట్లు సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. స్వీడన్‌కు చెందిన టెలికం పరికరాల తయారీ సంస్థ ఎరిక్సన్‌కు రిలయన్స్ కమ్యూనికేషన్స్ బకాయిపడిన రూ.550 కోట్లు చెల్లిస్తానని చెప్పి, అనిల్ అంబానీ మాట తప్పారని 2019 ఆరంభంలో కోర్టు పేర్కొంది.
 
మార్చి 19లోగా ఎరిక్సన్‌కు రూ.453 కోట్ల బకాయి చెల్లించాలని, లేకుంటే అనిల్ అంబానీ మూడు నెలల జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని ఫిబ్రవరి 20న న్యాయస్థానం తేల్చి చెప్పింది. తన అన్న, దేశంలో అత్యంత సంపన్నుడైన ముఖేశ్ అంబానీ ఆర్థిక సాయం చేయడంతో అనిల్‌ జైలు శిక్ష నుంచి తప్పించున్నారు.