గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 30 సెప్టెంబరు 2020 (09:50 IST)

మరికొన్ని గంటల్లో బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో తుదితీర్పు!

మరికొన్ని గంటల్లో బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో తుదితీర్పు వెలువడనుంది. ఈ కేసు విచారణ సుమారు 28 సంవత్సరాల పాటు సుధీర్ఘంగా విచారణ జరిగింది. ఈ కేసులో తుది తీర్పు కోసం దేశ ప్రజలంతా ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. 
 
ముఖ్యంగా, బీజేపీ అగ్రనేతలు ఎల్‌కే అద్వానీ, మురళీ మనోహర్ జోషి, ఉమభారతి వంటి సీనియర్ నేతలతోపాటు సంఘ్ పరివార్ నేతలు, ప్రస్తుతం రామాలయ నిర్మాణ బాధ్యతలు పర్యవేక్షిస్తున్న ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్‌రాయ్ తదితరులు నిందితులుగా ఉండటంతో ఎలాంటి తీర్పు వస్తుందోనని దేశవ్యాప్తంగా ఎదురుచూస్తున్నారు. 
 
ఈ తీర్పు నేపథ్యంలో నిందితులందరూ కోర్టుకు హాజరు కావాల్సిందేనని న్యాయమూర్తి ఆదేశించినప్పటికీ ఎంతమంది హాజరవుతారన్నది వేచి చూడాల్సిందే. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉమాభారతి ఇప్పటికే కరోనా వైరస్ బారినపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. 
 
కాగా, 1992, డిసెంబరు ఆరో తేదీన కరసేవకులు బాబ్రీ మసీదు కూల్చివేసిన విషయం తెల్సిందే. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసులో మాజీ ఉప ప్రధాని ఎల్‌కే అద్వానీ (92), కేంద్ర మాజీ మంత్రి మురళీ మనోహర్ ‌జోషి (86), యూపీ మాజీ ముఖ్యమంత్రి కల్యాణ్ సింగ్, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఉమాభారతి, సాధ్వి రితంబర వంటి మొత్తం 49 మంది హేమాహేమీలు నిందితులుగా ఉన్నారు. 
 
వీరిలో బాలాసాహెబ్ థాకరే, అశోక్ సింఘాల్, గిరిరాజ్ కిశోర్, పరమహంస రామచంద్ర దాస్, వినోద్ కుమార్ వత్స్, రాంనారాయణ్ దాస్ తదితర 17 మంది నిందితులు మరణించారు. దీంతో ఈ కేసు తుదితీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొనివుంది.