30న బాబ్రీ కూల్చివేత కేసుపై తుదితీర్పు.. కోర్టుకు రానున్న అద్వానీ - జోషి!
బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో సీబీఐ ప్రత్యేక కోర్టు బుధవారం తుది తీర్పును వెలువరించనుంది. దీంతో బీజేపీ అగ్రనేతలు ఎల్కే.అద్వానీ, మురళీ మనోహర్ జోషి, ఉమాభారతి తదితరులు కోర్టుకు హాజరుకానున్నారు. కాగా, బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో తుది తీర్పు వెలువడనున్న నేపథ్యంలో అన్ని రాష్ట్రాలకే కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. సున్నితమైన, సమస్యాత్మక ప్రాంతాల్లో భద్రతను పెంచాలంటూ ఆదేశించారు.
సీబీఐకి చెందిన ప్రత్యేక కోర్టు బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో బుధవారం లక్నోలో తీర్పును ఇవ్వనున్నది. ఈ తీర్పు వల్ల శాంతి, భద్రతలపై సమస్య తలెత్తే ప్రమాదం ఉందని, రెండు వర్గాల చెందిన వారు అల్లర్లకు దిగే అవకాశం ఉందని, అందుకే భద్రతను పెంచాలంటూ కేంద్రం తన ఆదేశాల్లో పేర్కొన్నది.
రామజన్మభూమి - బాబ్రీ మసీదు కేసులో నిందితులు దోషులుగా తేలుతారని కొన్ని ముస్లిం సంఘాలు భావిస్తున్నాయని, ఒకవేళ తీర్పు వారి పక్షం లేకుంటే దాడులు జరిగే ప్రమాదం ఉందని కేంద్ర ప్రభుత్వం తన ఆదేశాల్లో పేర్కొన్నది. మతపరంగా సున్నితంగా ఉండే జిల్లాల్లో భద్రతను పెంచాలని కేంద్రం సూచించింది.
అలాగే, ఈ తుదితీర్పు వెలువడే సమయంలో బీజేపీ సీనియర్ నేతలు ఎల్ కే అద్వానీ, మురళీ మనోహర్ జోషి, కళ్యాణ్ సింగ్, ఉమా భారతిలు కోర్టుకు నేరుగా హాజరుకానున్నారు. ఈ మేరకు కోర్టు ఆదేశాలు కూడా జారీచేసింది. అయితే, కరోనాతో బాధపడుతున్న ఉమాభారతి మంగళవారం ఆస్పత్రిలో చేరారు.
ఇదిలావుండగా, 1992, డిసెంబర్ 6వ తేదీన అయోధ్యలో కర సేవకులు 16వ శతాబ్ధానికి చెందిన మసీదును ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. అద్వానీతో పాటు ఇతరులపై నేరపూరిత కుట్ర కింద ప్రత్యేక సీబీఐ కోర్టు అభియోగాలు నమోదు చేసింది. అద్వానీతో పాటు ఇతరులపై కుట్రపూరిత ఆరోపణలను సీబీఐ కోర్టు 2001లో కొట్టివేసింది. దాన్ని 2010లో అలహాబాద్ కోర్టు సమర్థించింది.
అయితే అలహాబాద్ కోర్టు తీర్పును సుప్రీం ఓవర్‌రూల్ చేసింది. 2017లో అద్వానీతో పాటు ఇతరులపై నమోదు అయిన నేరపూరిత అభియోగాలను రిస్టోర్ చేయాలని ఆర్టికల్ 142 ప్రకారం సుప్రీంకోర్టు ఆ కేసులో ఆదేశించింది. దీంతో కేసు మళ్లీ విచారణ జరుగగా, తుది తీర్పు వెలువరించనుంది.