హైదరాబాద్‌లో కుండపోత.. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం
హైదరాబాద్ నగరంలో కుండపోత వర్షం కురుస్తోంది. దీంతో నగరంలోని అనేక లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. రహదారులన్నీ వర్షపు నీటితో నిండిపోయాయి. ఒక్క హైదారాబాద్ నగరంలోనే కాకుండా, తెలుగు రాష్ట్రాల్లో ఈ వర్షం కురుస్తోంది.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప పీడనానికి తోడు, ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్న కారణంగానే భారీ వర్షాలు కురుస్తున్నాయని విశాఖపట్నం వాతావరణ హెచ్చరికల కేంద్రం పేర్కొంది.
అల్పపీడనం బీహార్ వైపు వెళ్లిందని, అయినా దాని ప్రభావం తెలుగు రాష్ట్రాలపై మరో 24 గంటల పాటు ఉంటుందని, ముఖ్యంగా కోస్తాంధ్రలో మరో రెండు రోజులు వర్షాలు కురుస్తాయని అధికారులు పేర్కొన్నారు.
కాగా, హైదరాబాద్ నగరంలో శనివారం ఉదయానికి నగరమంతా సగటున 7 సెంటీమీటర్ల వర్షం పడిందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. నేడంతా వర్షం కురిసే అవకాశం ఉందని హెచ్చరించారు.
ఇక రంగారెడ్డి జిల్లాలో సగటున 12 సెంటీమీటర్లకు పైగా వర్షం కురవడంతో ప్రజా రవాణాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సరూర్ నగర్ చెరువుకు వెళ్లే ప్రధాన రహదారిపైకి రెండున్నర అడుగుల మేరకు నీరు చేరింది. ఖమ్మం, కరీంనగర్, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాల్లోని పలు వాగులు వరద నీటితో పొంగి పొర్లుతున్నాయి.
ఇక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాయలసీమ పరిధిలో పలు ప్రాంతాల్లో కుంభవృష్టి కురిసింది. కడప నగరంలోకి వరద నీరు చేరింది. బద్వేలు, పోరుమామిళ్ల, నంద్యాల, కర్నూలు, ఆళ్లగడ్డ, అనంతపురం తదితర ప్రాంతాల్లో 6 నుంచి 9 సెంటీమీటర్ల వర్షం కురిసింది.
ప్రకాశం జిల్లా గిద్దలూరు, మార్కాపురం ప్రాంతాల్లో పరిస్థితి మరింత దయనీయంగా మారింది. చెరువు గట్లు తెగి, నీరు ఇళ్లలోకి చేరినట్టు సమాచారం. కోస్తాంధ్రలోని అన్ని చోట్లా ఓ మోస్తరు నుంచి, భారీ వర్షం కురుస్తోంది.