మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 21 సెప్టెంబరు 2020 (08:43 IST)

హైదరాబాద్‌లో ఘోరం.. చూస్తుండగానే నీటిలో కొట్టుకునిపోయాడు...

హైదాబాద్ నగరంలో దారుణం జరిగింది. గత కొన్ని రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో నగరంలోని నాలాలు, మురికి కాలువలు పొంగి పొర్లుతున్నాయి. ఈ క్రమంలో ఓ స్కూటరిస్టు అందరూ చూస్తుండగానే వరద నీటిలో కొట్టుకునిపోయాడు. నగర శివారులోని సరూర్‌నగర్‌లో గతరాత్రి ఈ ఘటన జరిగింది. 
 
బాలాపూర్ ప్రాంతంలోని 35 కాలనీలకు చెందిన వరదనీరు మినీ ట్యాంక్‌బండ్‌లో కలుస్తుంది. గత వారం రోజులుగా నగరంలో భారీ వర్షాలు కురుస్తుండడంతో వరదనీరు పెద్ద ఎత్తున మినీ ట్యాంక్‌బండ్‌‌కు వెళ్తోంది. బాలాపూర్ మండలం అల్మాస్‌గూడకు చెందిన ఎలక్ట్రీషియన్ నవీన్‌కుమార్ (32) గత రాత్రి సరూర్‌నగర్‌ చెరువుకట్ట కింద నుంచి తపోవన్‌ కాలనీ మీదుగా సరూర్‌నగర్‌ గాంధీ విగ్రహం చౌరస్తా వైపు స్కూటీపై బయలుదేరాడు.
 
భారీ వర్షాల కారణంగా తపోవన్ కాలనీ రోడ్డు నంబరు 6 నుంచి మినీ ట్యాంక్‌బండ్‌లోకి వరదనీరు ఉద్ధృతంగా వెళ్తోంది. ఈ క్రమంలో రోడ్డు దాటేందుకు కాసేపు అక్కడే నిరీక్షించిన నవీన్ కుమార్ కాసేపటి తర్వాత వరద నీటిని దాటే ప్రయత్నం చేశాడు. 
 
స్కూటీ అదుపుతప్పడంతో వరద నీటిలో పడి కొట్టుకుపోయాడు. గమనించిన స్థానికులు అతడిని రక్షించేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. సమాచారం అందుకున్న డీఆర్ఎఫ్ సిబ్బంది గల్లంతైన వ్యక్తి కోసం గాలిస్తున్నారు. అయినప్పటికీ ఆచూకీ మాత్రం లభించలేదు. దీంతో ఆయన చనిపోయివుంటాడని డీఆర్ఎఫ్ సిబ్బంది భావిస్తున్నారు.