శనివారం, 23 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By జె
Last Modified: బుధవారం, 16 ఫిబ్రవరి 2022 (19:16 IST)

బాలాజీ జిల్లా కాదు తిరుపతి జిల్లా, నగరి బాలాజీ జిల్లాలోనే, సీఎంను కలుస్తా: రోజా

జిల్లాల పునర్విభజనపై కొంతమంది అనవసరంగా ఆందోళనలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారన్నారు నగరి ఎమ్మెల్యే రోజా. కొత్త జిల్లాలపై ఎలాంటి అభ్యంతరాలు ఉన్నా ఎవరైనా సరే మార్చి 2వ తేదీ లోపు రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవించుకునే అవకాశం ఉంటుందన్నారు. నూతనంగా ఏర్పడిన జిల్లాలో ప్రధానంగా నగరి నియోజకవర్గం కొంత బాలాజీ జిల్లాలో, కొంత చిత్తూరు జిల్లాలో ఉండటం వల్ల నగరి ప్రజలు ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. 

 
కాబట్టి త్వరలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కలుస్తానని చెప్పారు రోజా. బాలాజీ జిల్లాలోనే నగరి నియోజకవర్గాన్ని ఉంచాలని సిఎంను కోరుతానన్నారు. చిత్తూరు చాలాదూరం అయిపోతుందని.. తిరుపతి నగరికి చాలా దగ్గరగా ఉంటుందని రోజా చెప్పుకొచ్చారు. 

 
తిరుపతిని తిరుపతి జిల్లాగానే కొనసాగించాలన్న డిమాండ్ కూడా వినబడుతోందని.. ఇందుకు ఒకే ఒక్క అవకాశం స్థానిక ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి సిఎంను కలిస్తే సరిపోతుందన్నారు. మన సమస్యను మనమే సిఎం దృష్టికి తీసుకెళితే ఖచ్చితంగా ఆయన స్పందిస్తారని ఈ సంధర్భంగా రోజా చెప్పారు. 
 
గత రెండేళ్ళుగా తిరుపతి గంగమ్మ జాతర జరగలేదని.. ఈసారి ఖచ్చితంగా జాతర జరుగుతుందని.. రాయలసీమ ప్రజల ఇలవేల్పు గంగమ్మ తల్లి జాతరకు ముందు ఆలయాన్ని సందర్సించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు రోజా. కుటుంబ సమేతంగా తిరుపతి గంగమ్మను రోజా దర్సించుకున్నారు.