రాసలీలల వీడియోలను రూ.30 కోట్లకు బేరం పెట్టిన కిలేడీలు
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల వెలుగు చూసిన హనీట్రాప్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. వలపు వల విసిరిన అమ్మాయిలు.. పలువురు రాజకీయ నేతలను, బ్యూరోక్రాట్లను ముగ్గులోకి దించారు. వారికి అందమైన అమ్మాయిలను పంపి.. రహస్యంగా వీడియోలు చిత్రీకరించారు. ఆ తర్వాత వాటిని ఆయా రాజకీయ నేతల ప్రత్యర్థులకు విషయం చేరవేసి బేరం పెట్టారు. అలా వారి వద్ద ఉన్న రాసలీలల వీడియోలకు ఏకంగా రూ.30 కోట్ల ధర నిర్ణయించారు. చివరకు ప్లాన్ తిరగబడటంతో ఇపుడు జైలు ఊచలు లెక్కిస్తున్నారు.
ఈ వివరాలను పరిశీలిస్తే, మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన కొందరు కామ కిలేడీలు రాజకీయ నేతలపై వలపు వల విసిరారు. రాజకీయ నాయకులను ముగ్గులోకి దింపారు. వారి వద్దకు అమ్మాయిలను పంపారు. అమ్మాయిలతో సన్నిహితంగా ఉన్న రాజకీయ నాయకులను వీడియోలు తీశారు. వీటిని తమకు అనుకూలంగా మార్చుకోవాలని ప్లాన్ చేశారు.
రాసలీలల వీడియోలను అమ్మకానికి పెట్టారు. తమకు రూ.30 కోట్లు ఇస్తే వాటిని ఇచ్చేస్తామని రాజకీయ పార్టీలు, నాయకులకు ఆఫర్ ఇచ్చారు. దశలవారీగా చర్చలు జరిగాయి. తనకు కొన్ని వీడియోలు కావాలని ఓ రాజకీయ నాయకుడు ముందుకొచ్చాడు. అందుకు రూ.6 కోట్లు ఇస్తానని ఆఫర్ ఇచ్చాడు. కానీ, విడివిడిగా ఇచ్చేది లేదని, మొత్తం అన్ని వీడియోలూ తీసుకోవాలని, రూ.30 కోట్లకు తక్కువైతే కుదరదని ససేమిరా అన్నారు.
మొత్తం కలిపి ఎవరూ తీసుకోకపోవడంతో, చివరికి, రాజకీయ నాయకులకు విడివిడిగా వాటిని అమ్మేశారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో పార్టీల్లోని కిలేడీల సంబంధాలపై ప్రభావం చూపిందని, దాంతో, దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలన్న చందంగా వీలైనంత దండుకోవడానికి ప్రయత్నించారని, ఈ క్రమంలోనే కిలేడీలు పట్టుబడ్డారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఈ వ్యవహారంలో ఐదుగురు కిలేడీలను మధ్యప్రదేశ్ పోలీసులు అరెస్టు చేయగా, వారంతా ప్రస్తుతం జ్యూడీషియల్ రిమాండ్‌లో ఉన్నారు.
పైగా, ఈ కేసులో బడా రాజకీయ నేతలు, బ్యూరోక్రాట్లు ఉన్నట్టు తేలింది. దీంతో కేసును నీరుగార్చేందుకు కుట్రలు జరుగుతున్నట్టు సమాచారం. ముఖ్యంగా ఆ రాష్ట్ర సీఎం కమల్‌నాథ్ వర్గంలోకి కీలక నేత ఒకరు ఈ కేసును నీరుగార్చేందుకు తీవ్ర ఒత్తిడి తెస్తున్నట్టు వినికిడి. పైగా, ఈ కేసులో విచారణ జరిపితే తేనెటీగల తుట్టెను కదిపినట్టేనని సీఎం కమల్‌నాథ్‌కు ఆయన సలహాదారులు సూచించడంతో సీఎంఓ కూడా మిన్నకుండిపోయినట్టు సమాచారం.