సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఠాగూర్

చొరబాటుదారుల అడ్డుకట్టకు ఎన్.ఆర్.సి. అమలు తథ్యం.. అమిత్ షా

దేశంలోకి అడ్డుగోలుగా వస్తున్న చొరబాటుదారులకు అడ్డుకట్ట వేసేందుకు ఎన్.ఆర్.సి. (జాతీయ పౌర జాబితా) అమలు తథ్యమని కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. ఈ ఎన్ఆర్సీని ఒక్క అంటూ లేకుండా దేశంలోని అన్ని రాష్ట్రాల్లో అమలు చేస్తామని ఆయన పునరుద్ఘాటించారు. 
 
హిందూస్థాన్‌ టైమ్స్‌ నిర్వహించిన ఓ సదస్సులో ఆయన మాట్లాడుతూ, 'భారతీయుడు ఎవరైనా అమెరికా, బ్రిటన్‌, రష్యాలో అక్రమంగా నివసించగలరా?.. సాధ్యం కాదు. అలాంటప్పుడు చొరబాటుదారులు భారత్‌లో అక్రమంగా నివసించడాన్ని చూస్తూ ఎందుకు కూర్చోవాలి. అందుకే ఎన్నార్సీని దేశవ్యాప్తంగా అమలు చేస్తాం' అని ఆయన స్పష్టం చేశారు. 
 
దేశ భద్రత దృష్ట్యా ఎన్నార్సీ అమలు తప్పనిసరని చెప్పారు. చొరబాటుదారులను దేశం నుంచి వెళ్లగొడుతామన్నారు. హిందు, సిక్కు, జైన, బౌద్ధ శరణార్థులకు భారత పౌరసత్వం ఇస్తామని, ఇందుకోసం చట్టం తీసుకొస్తామన్నారు. ఎన్నార్సీ విషయంలో పశ్చిమబెంగాల్‌ ప్రజలను ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. 
 
చొరబాటుదారులను దేశం నుంచి వెళ్లగొట్టాలని గతంలో పేర్కొన్న ఆమె.. ఇప్పుడు ఎన్నార్సీ విషయంలో ఎందుకు వెనుకడుగు వేస్తున్నారంటూ నిలదీశారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా పశ్చిమ బెంగాల్‌తో సహా అన్ని రాష్ట్రాల్లో ఎన్నార్సీని అమలు చేసి తీరుతామన్నారు.