శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 12 అక్టోబరు 2019 (12:45 IST)

#Mahabalipuram సాక్షిగా కొత్త శకం ఆరంభం : మోడీ పిలుపు

భారత్ - చైనా దేశాధినేతలు తమిళనాడు రాష్ట్రంలోని సముద్రతీర ప్రాంతమైన మహాబలిపురంలో సమావేశమయ్యారు. ఈ ద్వైపాక్షిక చర్చల కోసం చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ శుక్రవారం ఉదయం ప్రత్యేక విమానంలో చెన్నైకు చేరుకున్నారు. ఆ తర్వాత ఆయనకు కేటాయించిన నక్షత్ర హోటల్‌లో కొద్దిసేపు బసచేసి, అక్కడ నుంచి నేరుగా మహాబలిపురంకు వెళ్లారు. అక్కడ ప్రధాని మోడీ ఆయనకు ఘన స్వాగతం పలికారు. 
 
ఈ నేపథ్యంలో శనివారం ఉదయం మహాబలిపురం సముద్రతీరంలో ఉన్న ఓ నక్షత్ర హోటల్‌లో చైనా అధ్య‌క్షుడు జిన్‌పింగ్‌, ప్ర‌ధాని నరేంద్ర మోడీలు సమావేశమయ్యారు. చెన్నై స‌మావేశం రెండు దేశాల మ‌ధ్య కొత్త బంధాన్ని ఏర్ప‌రిచింద‌ని మోడీ ట్వీట్ చేశారు. 
 
వూహ‌న్ స‌మ్మిట్ కొత్త ఉత్తేజాన్ని ఇచ్చింద‌న్నారు. రెండు దేశాల మ‌ధ్య విశ్వాసం పెరిగింద‌న్నారు. చెన్నై విజ‌న్‌తో కొత్త శ‌కం ఆరంభ‌మైంద‌ని పేర్కొన్నారు. చైనా, భార‌త్‌కు చెందిన ప్ర‌తినిధులు కూడా స‌మావేశంలో పాల్గొన్నారు. 
 
ఇకపోతే, ఈ సమావేశంలో భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవ‌ల్‌, విదేశాంగ మంత్రి జైశంక‌ర్‌, విదేశాంగ కార్య‌ద‌ర్శి విజ‌య్ గోఖ‌లే, తదితర ఉన్నతాధికారులు హాజరయ్యారు. త‌మిళ‌నాడు, చైనా మ‌ధ్య బ‌ల‌మైన సాంస్కృతిక‌, వాణిజ్య సంబంధాలు ఉన్నాయ‌ని మోడీ అన్నారు. గ‌త రెండు వేల ఏళ్ల నుంచి భార‌త్‌, చైనా ఆర్థిక శ‌క్తులుగా ఉన్నాయని ప్రధాని మోడీ ఈ సందర్భంగా గుర్తుచేశారు.