సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 29 ఆగస్టు 2022 (22:47 IST)

చివరి నిమిషంలో "ఆర్టెమిస్-1" ప్రయోగం వాయిదా.. ఎందుకో తెలుసా?

artemis-1
అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా చేపట్టిన ఆర్టెమిస్-1 ప్రయోగం చివరి నిమిషంలో వాయిదాపడింది. ఈ ప్రతిష్టాత్మక ప్రయోగం సోమవారం చేపట్టాల్సిందివుంది. ఇందుకోసం కౌంట్ డౌన్ కూడా ప్రారంభించారు. అయితే, ప్రయోగానికి కొన్ని నిమిషాల ముందు ఇంజిన్‌లో లోపాన్ని గుర్తించారు. లాంచ్ ప్యాడ్ వద్ద పిడుగుపడటంతో ఈ సాంకేతిక సమస్య తలెత్తినట్టు సమాచారం. 
 
దీంతో ఇంధనం నింపే ప్రక్రియకు అంతరాయం ఏర్పడింది. పైగా, ఇంజిన్‌లో నింపిన ఇంధనం కూడా లీకవుతున్నట్టు గుర్తించారు. దీంతో ఈ ప్రయోగాన్ని ఇపుడు జరపడం లేదని నాసా ప్రకటించింది. అయితే, ఈ ప్రయోగాన్ని మళ్లీ ఎపుడు చేపడుతారో కూడా నాసా అధికారికంగా ప్రకటించలేదు. 
 
ఈ ప్రయోగం కోసం సిద్ధం చేసిన రాకెట్‌లో 10 లక్షల గ్యాలన్ల హైడ్రోజన్‌తో పాటు ఆక్సిజన్ నింపాల్సివుంది. ఈ ప్రక్రియకు ఇంధన లీకేజీ అడ్డంకిగా మారింది. లాంచ్ ప్యాడ్ ఉన్న ప్రాంతంలో పిడుగులు పడటంతో ఈ సమస్య ఉత్పన్నమైనట్టు నాసా సైంటిస్టులు భావిస్తున్నారు. 
 
చంద్రుడిపైకి మానవుడిని పంపే ప్రాజెక్టులో భాగంగానే ఆర్టెమిస్-1 ప్రయోగాన్ని చేపట్టారు. ఇందులోభాగంగా, మొదట మానవరహిత ఓరియన్ కాప్యూల్ చంద్రుడి కక్ష్యలోకి వెళ్ళి తిరిగి రావాల్సివుంటుంది. ఆ తర్వాత 2024లో ఆర్టెమిస్-2, 2025లో ఆర్టెమిస్-3 ప్రయోగాలను చేపట్టాలని నాసా నిర్ణయించింది. 
 
ఇందులో ఆర్టెమిస్-3 ద్వారా మానవుడిని చంద్రుడి పైకి పంపేలా ప్లాన్ చేసింది. అయితే, ఆర్టెమిస్-1 ప్రయోగం వాయిదాపడింది. దీంతో చంద్రుడిపైకి మనిషిని పంపేందుకు మరికొంత సమయం పట్టొచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.