శుక్రవారం, 29 సెప్టెంబరు 2023
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఠాగూర్

ముదురుతున్న 'గర్జించే సింహాల చిహ్నం' వివాదం.. మార్పునకు విపక్షాల పట్టు

national emblem
కొత్త పార్లమెంట్ భవనంపై కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన జాతీయ చిహ్నం ఇపుడు తీవ్ర వివాదానికి దారితీసింది. ఇదికాస్త రాజకీయ దుమారానికి తెరలేపింది. జాతీయ చిహ్నంలో "గర్జించే సింహాలు" బొమ్మలను అమర్చడమే ఈ వివాదానికి కారణంగా నిలిచింది. ఈ కొత్త చిహ్నంపై విపక్షాలతో పాటు కొందరు సామాజిక కార్యకర్తలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. 
 
'జాతీయ చిహ్నం'లో ఎంతో హుందాగా, రాజసంగా, ఆత్మవిశ్వాసంతో ఉండే నాలుగు సింహాలు.. క్రూరంగా, దౌర్జన్యకరంగా కనిపిస్తున్నాయని, తక్షణమే మార్చాలని డిమాండ్‌ చేస్తున్నారు. 
 
దీనిపై లోక్‌సభలో కాంగ్రెస్ పక్షనేత అధిర్ రంజన్ చౌదరి ట్వీట్‌ చేస్తూ 'మోడీ జీ.. దయచేసి సింహం ముఖాన్ని ఓసారి చూడండి. సర్నాథ్ ​నుంచి స్ఫూర్తిపొంది రూపొందించిన ప్రతిమలా ఉందా లేక వక్రీకరించిన గిర్ సింహం ఫొటోలా ఉందో ఒకసారి పరిశీలించండి. వీలైతే మార్పించండి' అంటూ ట్వీట్ చేశారు. 
 
అలాగే, జాతీయ చిహ్నంలో మార్పులను సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ తప్పుబట్టారు. 'మోదీ నవ భారత్ ఇదే' అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. తృణమూల్ కాంగ్రెస్‌ ఎంపీ మెహువా మొయిత్రా రెండు చిహ్నాల ఫొటోలను పక్కపక్కనే ఉంచి ఆ రెండు చిత్రాల మధ్య తేడాలను చూపేలా ఓ ట్వీట్‌ చేశారు.
 
తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీ జవహర్ సర్కార్ భాజపాపై మండిపడ్డారు. ‘జాతీయ చిహ్నాన్ని అవమానించారు. ఎడమ వైపు ఉన్నది ఒరిజినల్​ ఫొటో. సింహాలు హుందాగా, రాజసంతో, ఆత్మవిశ్వాసంతో ఉన్నాయి. కుడి వైపు ఉన్నది మోడీ వెర్షన్ సింహాలు.. ఆగ్రహంతో, క్రూరంగా ఉన్నాయి. ఇది సిగ్గుచేటు. తక్షణమే మార్చండి' అంటూ డిమాండ్ చేశారు.
 
రాష్ట్రీయ జనతా దళ్‌ (ఆర్‌జేడీ) సైతం తాజా చిహ్నాలపై తీవ్ర ఆక్షేపణలు చేసింది. జాతీయ చిహ్నంలోని సింహాలు సౌమ్యంగా ఉంటాయని, కానీ ఈ కొత్త చిహ్నాలు 'మనుషులను తినేసే ధోరణి'లో ఉన్నాయని మండిపడింది. ఇది మోడీ 'అమృత కాలం' విశేషం అంటూ వ్యంగ్యాస్త్రాలు విసిరింది.