ఒకరి తర్వాత ఒకరు, ఆ నలుగురికి ఈ నెల 19న ఉరి? చావు భయంతో అన్నం తినడం లేదట...
'నిర్భయ' దోషుల్లో చావు భయం..!! సరిగా తినడం లేదు..!! ఓ చెల్లిని దారుణంగా 'హత్యాచారం' చేసిన 'నిర్భయ' కేసులోని నలుగురు నిందితులకు మృత్యువు దగ్గర పడింది. దోషులు ఉరికొయ్యలకు వేలాడే కౌంట్‌డౌన్ ప్రారంభమయ్యాయి.
ఈ నెల 19న వారిని ఉరి తీయడానికి తీహార్ జైలు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలోనే సంబంధిత కోర్టు డెత్ వారెంట్ (ఫారం నెంబర్.42) జారీ చేయనుంది. ఒక నేరస్తుడికి 'మరణశిక్ష' అమలు చేయాలంటే సంబంధిత జైలు అధికారులకు ‘డెత్ వారెంట్’ అందటం తప్పనిసరి.
ఇప్పటికే ఈ నిందితుల్లో ఒకరు రాష్ట్రపతిని క్షమాభిక్ష కోరగా.. మరొకరు కోర్టు తీర్పును పునఃపరిశీలించాలంటూ సుప్రీంలో రివ్యూ పిటీషన్ దాఖలు చేశాడు. కాగా, కోర్టు లేదా రాష్ట్రపతి దోషులు చేసి నేర ప్రవృత్తి తీరును బట్టి, తదుపరి చర్యలు తీసుకోవాలని వారు అనుకున్నప్పుడు 'డెత్ వారెంట్'ను జారీ చేస్తారు.
డెత్ వారెంట్ అంటే..:
‘వారెంట్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ఎ సెంటెన్స్ ఆఫ్ డెత్’ అని అర్ధం. దీనిని ఇంకా క్లుప్తంగా చెప్పాలంటే ఒక దోషిని ఉరి తీయడానికి సంబంధిత కోర్టు జైలు సూపరింటెండెంట్‌కు ఈ వారెంట్‌ను పంపుతుంది. ఇక అప్పుడు అధికారి దోషులను ఉరి తీసే సమయం నిర్ణయించి కోర్టుకు వివరిస్తాడు. ఒకసారి కోర్టు 'డెత్ వారెంట్' జారీ చేసిన అనంతరం.. ఆ ఉత్తర్వులను 'ఎర్రటి ఎన్వలప్ కవర్' ద్వారా తీహార్ జైలుకు పంపిస్తారు. దీనికి అనుగుణంగానే ఉరి తీయబోయే దోషి కుటుంబానికి కూడా సమాచారాన్ని అందిస్తారు.
ఇకపోతే 'డెత్ వారెంట్' ఒక్కసారి వచ్చిన తర్వాత దోషికి జైలులో సాధారణ ఖైదీలకు అప్పగించే ఏ పని అప్పగించరు. దోషులు ఒకరితో ఒకరు మాట్లొడుకునే వెసులుబాటు ఉండదు. అతడిని 24 గంటలు జైలు అధికారులు పర్యవేక్షిస్తుంటారు. అంతేకాకుండా రోజుకి రెండుసార్లు మెడికల్ చెకప్ కూడా చేస్తారు. మరోవైపు 'డెత్ వారెంట్'లో దోషులను 'ఉరి ఏవిధంగా తీయాలనేది' పూర్తిగా వివరించి ఉంటుంది.
‘సంబంధిత దోషిని ఉరి తీయడానికి జారీ అయిన అఫీషియల్ ఉత్తర్వులు.. "అతడు చనిపోయేవరకు మెడకు ఉరి తాడు బిగించి ఉంచాలని" అందులో స్పష్టంగా రాసి ఉంటుంది.
19న 'ఉరి' ముహూర్తం..?
అక్షయ్ ఠాకూర్ దాఖలు చేసిన రివ్యూ పిటిషన్ సుప్రీంలో డిసెంబర్ 17వ తేదీన విచారణకు రానుంది. ఈ పిటిషన్‌ను సుప్రీం తోసిపుచ్చితే డిసెంబర్ 18వ తేదీన విచారణలో పటియాలా కోర్టు నిర్భయ దోషులకు 'డెత్ వారెంట్' జారీ చేసే అవకాశం ఉంది. నిర్భయ దోషులు పవన్ గుప్తా, ముఖేశ్ సింగ్, వినయ్ శర్మ రివ్యూ పిటిషన్లను సుప్రీం ఇప్పటికే తోసిపుచ్చింది. నిజానికి మరణశిక్ష తీర్పు వెలువడిన వెంటనే ఈ నలుగురు రివ్యూ పిటిషన్‌కు వెళ్లే అవకాశం ఉన్నా.. శిక్షను వాయిదా వేయాలన్న కారణంతోనే ఆలస్యంగా రివ్యూ పిటిషన్లు వేర్వేరుగా దాఖలు చేశారు.
ఈ దోషులు గతంలో తినే భోజనం కన్నా తక్కువ తింటున్నట్లు జైలు అధికారులు చెపుతున్నారు. అలాగే 'తలారి' ఒక్కరే ఉండటంతో ఈ దోషులను ఒకేసారి ఉరి తీసే సదుపాయం లేదు. దీంతో ఏక కాలంలో ఉరితీసే అవకాశం లేనందున... అన్నీ అనుకున్నట్లుగా జరిగితే ఈనెల 19వ తేదీన తెల్లవారుజామున ఉదయం 5 గంటల నుంచి 6 గంటల మధ్య ఈ ఉరితీత తతంగం ఉంటుంది. 'ఉరితీత ట్రైల్' సందర్భంగా అక్కడి 'లాక్' అండ్ 'కీ' పరికరాన్ని అధికారులు 'ఆయిల్'తో శుభ్రం చేశారు. అంతా ఓకే అని తెలియజేశారు.