సంబరాలు చేసుకుంటున్న రోజా వ్యతిరేకులు, ఎందుకు?
మొన్న జరిగిన నామినేటెడ్ పదవుల పందేరంలో ఎమ్మెల్యే రోజాకు సీఎం జగన్ షాక్ ఇచ్చారని ఆమె ప్రత్యర్థులు చంకలు గుద్దుకుంటున్నారు. నగరి ఎమ్మెల్యే ఆరె.కె. రోజాకు ఉన్నఏపిఐఐసీ ఛైర్మన్ పదవిని లాక్కుని ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి షాక్ ఇచ్చారని సంబరపడుతున్నారు.
ఉన్న పదవిని ఊడబీకేశారని ఆమె వ్యతిరేకులు సంతోషపడిపోతుంటే, లేదు... వచ్చే మంత్రి వర్గ విస్తరణలో రోజాకు మంత్రి పదవి ఖాయమని ఆమె సన్నిహితులు పేర్కొంటున్నారు. చిత్తూరు జిల్లా నగరి నుంచి ఎమ్మెల్యే రోజా 2014, 2019ల్లో వరుసగా గెలుపొందారు. గత సార్వత్రిక ఎన్నికలకు ముందు ఆమె మళ్లీ గెలిచి, జగన్ పార్టీ అధికారంలోకి వస్తే, ఆమెకు మంత్రి పదవి వస్తుందని చాలామంది ఆశించారు. జగన్ పార్టీ అయితే గెలిచింది కానీ, ఆమెకు మంత్రి పదవి మాత్రం రాలేదు.
వైకాపా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆమె టిడిపిపై తిరుగులేని పోరాటం చేశారు. అసెంబ్లీ సాక్షిగా అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబుపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై ఆగ్రహం చెందిన అప్పటి స్పీకర్ ఆమెను అసెంబ్లీకి రానీయకుండా రెండేళ్లపాటు సస్పెండ్ చేశారు. దీనిపై ఆమె న్యాయ పోరాటం చేశారు. తనను అసెంబ్లీకి రానీయకపోయినా..టిడిపి ప్రభుత్వంపై ఆమె రాజీలేని విధంగా మాటలు తూటాలు పేల్చారు.
చంద్రబాబును, ఆయన తనయుడుని రకరకాలుగా విమర్శిస్తూ, ఆమె నిత్యం వార్తల్లో నిలిచారు. అప్పట్లో రోజాను కంట్రోల్ చేయడం చంద్రబాబుకు తలకుమించిన పనైంది. టిడిపిలో రోజాకు సమాధానం చెప్పే నేతలే కరువయ్యారు. అటువంటి ఫైర్ బ్రాండ్ లీడర్ అయిన రోజాకు వైకాపాలో సముచిత స్థానం లభిస్తుందని ఆమె అభిమానులతో పాటు, రాజకీయ విశ్లేషకులు భావించారు. వారు ఆశించిన విధంగా ఆమెకు మంత్రి పదవి లభించలేదు.
ఆమెను ఏపిఐఐసీ ఛైర్మెన్‌గా జగన్ నియమించారు. తాను మంత్రి పదవి ఆశిస్తే ఛైర్మెన్ పదవి లభించిందని, అయినా రెండేళ్ల తరువాత తనకు మంత్రి పదవి లభిస్తుంది ఆమె సరిపెట్టుకున్నారు. కాగా ఆమెను ఏపిఐఐసీ పదవి నుంచి తప్పించి ఆమె స్థానంలో మెట్టు గోవిందరెడ్డికి ఛైర్మన్ పదవిని జగన్ అప్పగించారు. ఒకవైపు మంత్రిపదవి రాలేదు.. ఉన్న పదవి ఊడిపోయిందని ఆమె ప్రత్యర్థులు సంబరాలు చేసుకుంటున్నారు.
వాస్తవానికి గత కొన్ని రోజులుగా వైసీపీలో ఎమ్మెల్యే రోజా పరిస్థితి పార్టీలో ఏమంత బాగాలేదు. తన నియోజకవర్గంలో స్వంత పార్టీ నేతల నుంచే ఆమెకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. నగరి పార్టీలో ఆమె ఒంటరి అయిందని వార్తలు వస్తున్నాయి. ఆమెకు వ్యతిరేకంగా ఓ సీనియర్ మంత్రి వర్గాన్ని ప్రోత్సహిస్తున్నారని, ఆయన అండతో వారు రోజాపై ఒంటికాలిపై లేస్తున్నారని, ఈ విషయాన్ని అధిష్టానానికి చెప్పినా అక్కడ నుంచి స్పందన లేదని ఆమె వాపోతున్నారట.
డిప్యూటీ సిఎం నారాయణస్వామి, రోజాలు ఒకరిపై ఒకరు మాటలతో దాడులు చేసుకున్నారు. ఈ సందర్భంలో అధిష్టాణం నారాయణస్వామి వైపే ఉంది. నారాయణస్వామితో పాటు, పంచాయితీరాజ్ మంత్రి రామచంద్రారెడ్డిలతో ఆమెకు తీవ్ర విభేదాలు ఉన్నాయి. పెద్దిరెడ్డి ఆమెకు వ్యతిరేకంగా కేజే శాంతిని ఉసిగొలుపుతున్నారు. ఆమెకు ఈడిగ కార్పొరేషన్ పదవి దక్కడం వెనుక పెద్దిరెడ్డి ఉన్నారనే అనుమానాలు రోజాకు ఉన్నాయి.
కానీ ఏమీ చేయలేని నిస్సహాయతతో ఆమె రోజులు నెట్టుకొస్తున్నారు. వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా మరోసారి నియోజకవర్గంలో రోజా వ్యతిరేకులు రెచ్చిపోయారు. అయినా రోజా ఏమీ చేయలేని పరిస్థితులు నెలకొన్నాయి. త్వరలో మంత్రివర్గ విస్తరణ ఉంటుందని భావిస్తున్నా, ఆమెకు పొమ్మనకుండానే ఆమె ప్రత్యర్థులు పొగపెడుతున్నారంటున్నారు. కానీ, ఆమె సన్నిహితులు మాత్రం ఎమ్మెల్యే రోజాను మంత్రివర్గంలోకి తీసుకోవడానికే ప్రస్తుత పదవిని తీసివేశారని, మరో మూడు నెలల్లో ఆమె మంత్రి కావడం ఖాయమని చెపుతున్నారు.