1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 31 మార్చి 2021 (22:43 IST)

మొరాయించిన వెబ్‌సైట్.. ఊపిరి పీల్చుకున్న పాన్‌కార్డ్ హోల్డర్స్.. ఎలా?

పాన్ కార్డ్ హోల్డర్ ఊపిరి పీల్చుకున్నారు. ఆధార్ కార్డుతో పాన్ కార్డు అనుసంధాన ప్రక్రియ గడువు తేదీని కేంద్రం మరోమారు పొడగించింది. దీంతో పాన్ కార్డు హోల్డర్స్‌లో ఆందోళన తొలగిపోయింది. వాస్తవానికి ఈ అనుసంధాన గడువు తేదీ మార్చి 31వ తేదీతో ముగిసిపోనుంది. దీంతో ఆదాయ పన్ను శాఖ వెబ్‌సైట్‌లో అనుసంధాన ప్రక్రియను పూర్తి చేయాలంటూ ఐటీ శాఖ గడువు విధించింది. అయితే, నేటితో ఆ గడువు ముగియనుండటంతో పాటు అనేక మంది పాన్, ఆధార్ కార్డులను అనుసంధానించేందుకు వెబ్‌సైట్‌లో ముమ్మర ప్రయత్నం చేశారు. కానీ, వెబ్‌సైట్ మొరాయించింది. ఒక్కసారిగా లక్షలాది మంది ఆ వెబ్‌సైట్‌ను ప్రారంభించడంతో ఈ పరిస్థితి తలెత్తింది. 
 
దీంతో ఆదాయ పన్ను శాఖ గురువారం రాత్రి ఓ శుభవార్త చెప్పింది. ఆధార్‌ కార్డుతో పాన్‌ కార్డు అనుసంధానం చేసే గడువును 2021 జూన్ 30వ తేదీ వరకు పొడిగించింది. కోవిడ్ మహమ్మారి కారణంగా తలెత్తే ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నామని ఆదాయపు పన్ను శాఖ ట్విట్టర్ ద్వారా తెలిపింది. 
 
వాస్తవానికి ఆధార్‌తో పాన్ కార్డు అనుసంధానం చేసే గడువు ఈరోజు అనగా 2021 మార్చి 31వ తేదీతో ముగియనుంది. అయితే ప్రస్తుత కరోనా పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని చివరి తేదీని ఆదాయపు పన్ను శాఖ పొడిగించింది. కాగా, మీ ఆధార్‌తో పాన్‌ నెంబర్‌ అనుసంధానం చేయకపోతే ఎస్ఎంఎస్ SMS ద్వారా కూడా చేసుకోవచ్చు. లేదా మీ ఖాతా ఉన్న బ్రాంచ్‌కు వెళ్లి కూడా చేయవచ్చు.
 
ఎస్‌ఎంఎస్‌ ద్వారా కూడా పాన్‌ ఆధార్‌ లింక్‌ చేసుకోవచ్చు. ఇందుకోసం మీ రిజిస్టర్‌ మొబైల్‌ నెంబర్‌ నుంచి UIDAIPAN అని టైప్​ చేసి మీ 12 అంకెల ఆధార్ సంఖ్యను ఎంటర్​ చేయాలి. ఆ తర్వాత స్పేస్​ ఇచ్చి మీ 10 అంకెల పాన్​ కార్డు నెంబర్​ను ఎంటర్​ చేయాలి. దీన్ని 567678 లేదా 56161 నంబర్​కు ఎస్ఎంఎస్ పంపించండి. అంతే మీ పని పూర్తయినట్లే. వెంటనే మీ ఆధార్‌తో పాన్‌ కార్డు అనుసంధానం అయినట్లు మీ మొబైల్‌ నెంబర్‌కు సందేశం వస్తుంది.