పార్లమెంట్‌లో బీజేపీ ఎంపీ కారుకు తుపాకీ ఎక్కుపెట్టిన సెక్యూరిటీ.. ఎందుకు?
పార్లమెంట్ మలిదశ బడ్జెట్ సమావేశాలు వాడివేడిగా సాగుతున్నాయి. అధికార, విపక్ష పార్టీలకు చెందిన సభ్యులు పోటాపోటీగా రెచ్చిపోతున్నారు. ముఖ్యంగా, ఢిల్లీ అల్లర్లు పార్లమెంట్ ఉభయసభలను కుదిపేస్తున్నాయి. ఈ తరుణంలో పార్లమెంట్ ప్రాంగణంలోని ఒకటో నంబరు ప్రధాన ద్వారం వద్ద కలకలం చెలరేగింది. దీంతో ఓ ఎంపీ కారుకు క్విక్ యాక్షన్ ఫోర్స్‌కు చెందిన భద్రతా బలగాలు తుపాకీ ఎక్కుపెట్టారు.
అసలు ఎంపీ కారుకు తుపాకీ ఎందుకు ఎక్కుపెట్టారో తెలుసుకుందాం. మంగళవారం సమావేశాలు ప్రారంభంకావడానికి ముందు గేట్ నెంబర్ వన్ వద్ద కలకలం చెలరేగింది. బూమ్ బ్యారికేడ్‌ను ఓ కారు ఢీ కొట్టడంతో దాని నుంచి స్పైక్స్ బయటకు వచ్చి, ఆ కారు అక్కడే నిలిచిపోయింది. వెంటనే సైరన్ మోగడంతో అక్కడ ఉన్న భద్రతా దళాలు అప్రమత్తమై ఏకే 47 తుపాకులతో ఆ కారుకి గురిపెట్టారు.
ఆ కారు బీజేపీ ఎంపీ వినోద్ కుమార్ సోనకర్‌దని తేలడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనలో ఆ కారు స్వల్పంగా ధ్వంసమైంది. పొరపాటున ఆ కారు వాటికి తగిలిందని భద్రతా బలగాలు గుర్తించాయి. కాగా, 2001లో పార్లమెంట్‌పై ఉగ్రదాడి జరిగిన తర్వాత భద్రతను కట్టుదిట్టం చేస్తూ.. పార్లమెంటు గేట్ల వద్ద స్పైక్స్‌లను అమర్చారు.