శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By selvi
Last Updated : గురువారం, 15 మార్చి 2018 (14:37 IST)

గబ్బర్ సింగ్ గురితప్పాడా? పోయిపోయి పవన్ కాంగ్రెస్‌తో కలుస్తాడా? జగన్ వెంట నిలుస్తాడా?

జనసేనాని, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ రూటు మార్చారా?. గుంటూరులో బుధవారం జరిగిన జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ బహిరంగ సభలో పవన్ మాట్లాడుతూ.. తెలుగుదేశం పార్టీపై తీవ్ర విమర్శలు గుప్పిండం వెనుక ఆంత్యమేంటి?.

జనసేనాని, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ రూటు మార్చారా?. గుంటూరులో బుధవారం జరిగిన జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ బహిరంగ సభలో పవన్ మాట్లాడుతూ.. తెలుగుదేశం పార్టీపై తీవ్ర విమర్శలు గుప్పిండం వెనుక ఆంత్యమేంటి?. తెలుగుదేశం పార్టీ ప్రజాద్రోహం చేసిందని, ఇసుక మాఫియా తెచ్చిందని ఆరోపించారు. నారా లోకేష్‌కు అవినీతి మరక అంటించారు. ఏపీ సీఎం చంద్రబాబును ప్రత్యేక హోదా తేలేదనే కోపంతో ఏకిపారేశారు. పనిలోపనిగా విపక్ష నేత వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డిపైనా విమర్శలు చేశారు. 
 
ప్రధాన ప్రతిపక్షంగా వుండి జగన్ అసెంబ్లీకే రారని, సీఎం అయితేనే అసెంబ్లీకి వస్తానంటే ఎలా అంటూ సెటైర్లు విసిరారు. అలాగే కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీని కూడా దునుమాడారు. ఇంగ్లీష్‌లో ఆయనకు అర్థమయ్యేలా జైట్లీపై నిప్పులు చెరిగారు. ప్రత్యేక హోదాపై మాట మార్చడం.. ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని ప్రకటించి.. సెంటిమెంట్‌కు డబ్బులు రాలవని కామెంట్లు చేసిన జైట్లీపై పవన్ మండిపడ్డారు. సెంటిమెంట్‌కు డబ్బులు రాలకపోతే.. సెంటిమెంట్ కోసం తెలంగాణ ఇవ్వలేదా? అంటూ నిలదీశారు. 
 
అధికారానికి రాకముందు ఓ మాట.. అధికారంలోకి వచ్చాక మరోమాట మాట్లాడే కేంద్ర ప్రభుత్వానికి చట్టాలుండవా?.. మాట తప్పిన కేంద్రం ప్రతిపాదించే చట్టాలను తామెందుకు అనుసరించాలని అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. ప్రత్యేక హోదాపై పోరాటం ఆగదని మరో ఉద్యమం తలెత్తుతుందని పవన్ హెచ్చరించారు. కానీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై పవన్ ఒక్క మాట అనలేదు. వామపక్షాలతో కలిసి ముందుకెళ్తామని పవన్ చెప్పారు. ఇక్కడే అసలు సమస్య మొదలైంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. 
 
కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేయని.. మోడీని మాటనని పవన్ కల్యాణ్.. భవిష్యత్తులో కాంగ్రెస్‌తో చేతులు కలుపుతారని ప్రచారం జోరుగా సాగుతోంది. కాంగ్రెస్ పార్టీతో కలిసి.. జగన్ వెంట నిలిచి.. ప్రత్యేక హోదా సాధిస్తారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తంచేస్తున్నారు. ప్రత్యేక హోదా ఉద్యమం ద్వారా కేంద్రంలో కాంగ్రెస్‌కు, రాష్ట్రంలో వైకాపా పార్టీకి మద్దతిచ్చి.. పవన్ పని కానిస్తారని రాజకీయ పండితులు చెప్తున్నారు. ఇందుకు పవన్ వ్యాఖ్యలే నిదర్శనమనవి వారు చెప్తున్నారు. 
 
ఇన్నాళ్లు చంద్రబాబు సర్కారుపై అంతగా విమర్శలు చేయని పవన్.. ఈసారి టీడీపీ సర్కారును, నారా లోకేష్‌ను టార్కెట్ చేశారని.. అలాగే జగన్‌ను కొంత తిట్టి వదిలిపెట్టారని.. మోడీ మాటకు అస్సలు వెళ్లలేదని చెప్తున్నారు. ఇక టీడీపీపై పవన్ శివాలెత్తడంతో టీడీపీ చీఫ్ చంద్రబాబుతో పాటు ఆ పార్టీ నేతలంతా పవన్ కల్యాణ్‌పై ఎదురుదాడికి దిగారు. పవన్‌ను లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పిస్తున్నారు. గబ్బర్ సింగ్ గురి తప్పాడంటూ కామెంట్స్ చేస్తున్నారు. 
 
నారా లోకేష్ అవినీతికి పాల్పడ్డారని పవన్ చేసిన వ్యాఖ్యలపట్ల క్షమాపణలు చెప్పాలని టీడీపీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్ డిమాండ్ చేశారు. ప్రత్యేకహోదా కోసం పోరాడాల్సిన సమయంలో టీడీపీపై అర్థం లేని ఆరోపణలు చేయడం సరికాదని డొక్కా హితవు పలికారు. పవన్ కల్యాణ్ రాజకీయ అపరిపక్వతతో మాట్లాడినట్లుగా అనిపించిందని, జగన్ ఏ టీమ్ ఐతే, పవన్ బీ టీమ్ అని విమర్శించారు. 
 
మరోవైపు వైకాపా ఎంపీ వరప్రసాద్ ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవల పవన్‌తో ఫోన్‌లో మాట్లాడానని.. తనపై వైసీపీ నేతలు ఎందుకు విమర్శలు చేస్తున్నారని పవన్ అడిగారని.. ప్రభుత్వానికి మద్దతుగా మాట్లాడినందుకే విమర్శలు చేస్తున్నారని చెప్పాను. తాను టీడీపీతో లేనని అవసరమైతే జగన్‌కే మద్దతిస్తానని పవన్ చెప్పినట్లు వరప్రసాద్ సంచలన కామెంట్స్ చేశారు.
 
ప్రత్యేక హోదా కోసం వైసీపీ, జనసేన కలిసి పోరాటం చేస్తాయని ప్రకటించారు. శుక్రవారం పార్లమెంట్‌లో అవిశ్వాస తీర్మానం పెడతామని వంద ఎంపీలు మద్దతిచ్చే అవకాశం వుందని వరప్రసాద్ చెప్పుకొచ్చారు. అవిశ్వాస తీర్మానానికి పవన్ కూడా మద్దతిచ్చారని.. ఇతర పార్టీల మద్దతు కూడగడతానని హామీ కూడా ఇచ్చారని వరప్రసాద్ వ్యాఖ్యానించారు. 
 
ఈ కామెంట్స్‌ను బట్టి పవన్ జగన్‌తో కలుస్తారని.. ఏపీ ప్రయోజనాల కోసం కేంద్రంలో కాంగ్రెస్‌కు మద్దతిస్తారని టాక్. ఇంకా థర్డ్ ఫ్రంట్ వైపు చూస్తున్నాడని తెలుస్తోంది. అయితే పవన్ ఫ్యాన్సుకు, ప్రజలకు పవన్ కల్యాణ్ రాష్ట్రాన్ని చీల్చి.. ఏపీకి అన్యాయం చేసిన కాంగ్రెస్ పార్టీతో కలవడం, ఆర్థిక నేరస్తుడిగా ముద్రవేసుకున్న జగన్మోహన్ రెడ్డికి మద్దతివ్వడం ఏమాత్రం ఇష్టం లేదని తెలుస్తోంది. మరి పవన్ కార్యాచరణ ఎలా వుంటుందో తెలుసుకోవాలంటే.. వేచి చూడాల్సిందే.