మంగళవారం, 7 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 28 ఫిబ్రవరి 2022 (10:54 IST)

ఉక్రెయిన్ - రష్యా యుద్ధం : ఐక్యరాజ్య సమితి అత్యవసర సమావేశం

ఉక్రెయిన్ రష్యా దేశాల మధ్య యుద్ధం భీకరంగా సాగుతోంది. చిన్నదేశమైనప్పటికీ రష్యా సేనలకు ఉక్రెయిన్ సైన్యంతో పాటు.. ఆ దేశ ప్రజలు చుక్కలు చూపిస్తున్నారు. ఒక పట్టానలొంగడం లేదు. ఉక్రెయిన్ అధ్యక్షుడు ఏకంగా తుపాకీ చేతబట్టి వీధుల్లో తిరుగుతూ, తమ దేశ ప్రజల్లో స్ఫూర్తి నింపుతున్నారు. పైగా, ప్రాణాలకు భయపడి పారిపోవడమే, బంకర్లలో దాక్కోవడమో చేయబోనని, దేశ ప్రజలతోనే కలిసి వుంటానని బాహాటంగా ప్రకటించారు. 
 
అదేసమయంలో రష్యా పంపిన శాంతి చర్చలకు పచ్చజెండా ఊపారు. అయితే, ఒకవైపు శాంతి చర్చలకు పిలుపునిచ్చిన రష్యా.. మరోవైపు ఉక్రెయిన్‌పై బాంబులతో విరుచుకుపడుతుంది. దీన్ని ప్రపంచ దేశాలు ముక్తకఠంతో ఖండిస్తున్నారు. మరోవైపు, ఉక్రెయిన్‌కు నాటో దేశాల నుంచి క్రమంగా మద్దతు పెరుగుతుంది. ఆర్థిక సాయంతో పాటు ఆయుధాలను కూడా సఫరా అవుతున్నాయి. ఇది రష్యాకు ఏమాత్రం మింగుడు పడటం లేదు. దీంతో రష్యా అధ్యక్షుడు పుతిన్ కోపం మరింత పెరిగింది. అణ్వాయుధ యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. 
 
ఈ నేపథ్యంలో ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ అత్యవసరంగా సమావేశం అవుతుంది. ఉక్రెయిన్ రష్యా యుద్ధంపై చర్చించనున్నట్టు ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి నిర్ణయించింది. ఉక్రెయిన్‌పై దాడిని ఖండిస్తూ భద్రతా మండలి చేసిన తీర్మానాన్ని రష్యా వీటో అధికారంతో అడ్డుకుంది. ఇపుడు అదే అంశంపై చర్చించేందుకు 199 సభ్య దేశాలున్న ఐక్యరాజ్య సమితి సర్వప్రతినిధి సభ అత్యవసరంగా సమావేశం అవుతుంది.
 
మరోవైపు, ఉక్రెయిన్‌పై దాడిని ఖండిస్తూ భద్రతా మండలిలో ఇప్పటికే ఓటింగ్ నిర్వహించగా, ఇందులో 15 సభ్య దేశాలు పాల్గొన్నాయి. తీర్మానానికి అనుకూలంగా 11 ఓట్లు రాగా, ఒక దేశం వ్యతిరేకంగా ఓటు వేసింది. భారత్, చైనా, యూఏఈ దేశాలు ఓటింగ్‌ ప్రక్రియకు దూరంగా ఉన్నాయి. దీంతో సభ ఛైర్మన్ హోదాలో ఉన్న రష్యా తన వీటో అధికారంతో దాన్ని అడ్డుకుంది. అందుకే ఇపుడు సర్వప్రతినిధి సమావేశాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.