బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎంజీ
Last Updated : బుధవారం, 29 సెప్టెంబరు 2021 (22:26 IST)

అసాంఘిక కార్యకలాపాలపై పటిష్ట నిఘా ఉంచాలి : డిజిపి మహేందర్ రెడ్డి

సమాజంలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే క్రిమినల్ గ్యాంగులపై  ప్రత్యేక దృష్టి సారించి వారి అక్రమాలకు అడ్డుకట్ట వేసేలా పటిష్ట చర్యలు తీసుకోవాలని తెలంగాణ డిజిపి మహేందర్ రెడ్డి ఆదేశించారు. బుధవారం డిజిపి కార్యాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పోలీసు కమిషనర్లు, జిల్లాల ఎస్పీ లతో నేరసమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా  మాట్లాడుతూ తీవ్రమైన నేరాలకు పాల్పడే నెరస్థులపై, అలవాటుగా నేరాలకు పాల్పడే వారిపై పి.డి. యాక్టులు నమోదు చేసి నిందుతులకు శిక్షలు పడేలా కఠినంగా వ్యవహరించాలని సూచించారు. అలాంటి వ్యక్తుల కదలికలపై పటిష్టమైన నిఘా వ్యవస్థను ఏర్పాటు చేసుకుని రాష్ట్ర సరిహద్దుల నుండి  వచ్చే గంజాయి, గుట్కా సరఫరా చేసే మూలాలను, కీలక వ్యక్తులను గుర్తించి వారిపై కేసులు నమోదు చేసి అక్రమ రవాణా పకడ్బందీగా నియంత్రించాలన్నారు.

నేరాలను అదుపు చేసేందుకు అవసరమైన ప్రణాళికలతో పాటు, నేరస్తులను పట్టుకోవడానికి అవసరమైన అన్ని సాంకేతిక ఆధారాలను సైతం సేకరించేలా అధికారులందరూ ప్రావీణ్యత కలిగి ఉండేలా అన్ని రకాల శిక్షణలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అదే సమయంలో ప్రతి కేసులో నాణ్యతతో కూడిన నేర విచారణ ఉండే విధంగా, తద్వారా నేర నియంత్రణలో ఫలితాలు పొందేలా పనితీరు మెరుగుపర్చుకోవాలని సూచించారు.

నేరం చేసిన వారికి న్యాయస్థానాల్లో శిక్ష తప్పదనే భావన కలిగినప్పుడే నేరాలు అదుపులో ఉంటాయన్నారు. ప్రజలలో పోలీసు వ్యవస్థపై మరింత నమ్మకాన్ని పెంపొందిస్తూ, నేరాల అదుపులో ప్రజల సహకారాన్ని కూడా పొందుతూ పోలీస్ శాఖ గౌరవాన్ని పెంపొందించాలన్నారు. ఇందుకు అనుగుణంగా అన్ని స్థాయిల అధికారులు నిబద్ధతతో, బాధ్యతాయుతంగా కృషి చేయాలన్నారు.
 
సమర్థవంతమైన పనితీరుతో పెండింగులో ఉన్న కేసుల సత్వర పరిష్కారానికి కృషి చేసిన పోలీస్ అధికారులను అభినందించారు. పెండింగ్ కేసుల పరిష్కారం కోసం సమర్ధవంతంగా పని చేస్తున్న అధికారులు అదే స్పూర్తితో  ప్రతి కేసులో ప్రణాళిక, సమగ్ర విచారణ తో నేరస్థులకు శిక్ష పడేలా చేస్తూ, బాధితులకు న్యాయం చేసే విధంగా విధి నిర్వహణ చేయాలని చెప్పారు.

పోక్సో, మహిళలపై దాడుల కేసులలో ప్రత్యేక దృష్టి సారించి నిందితులకు శిక్ష పడేలా పకడ్బందిగా ఆధారాలు సేకరించి కోర్టుకు సమర్పించాలని ఆయన సూచించారు. జవాబుదారీతనాన్ని పెంపొందించేలా అమలు చేస్తున్న ఫంక్షనల్ వర్టికల్స్ ద్వారా మంచి ఫలితాలు వస్తున్నాయన్నారు.

ప్రధానంగా ప్రజలంతా అత్యవసర సమయంలో వినియోగించే డయల్100 పనితీరు పట్ల రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలలో మంచి స్పందన లభిస్తోందని, ఇకపై మరింత వేగంగా స్పందించి ప్రజలకు సేవలందించాలన్నారు. పోలీస్ స్టేషన్లలో పరిధిలో నమోదు చేసే ప్రతి కేసు వివరాలను ఆన్ లైన్ లో నమోదు చేయడంతో పాటు పోలీస్ స్టేషన్లలో రిసెప్షన్, పెట్రో వెహికల్స్, కోర్టు డ్యూటీ, సెక్షన్ ఇంఛార్జీలు, స్టేషన్ హౌస్ ఆఫీసర్ పర్యవేక్షణ నిరంతరం వుండాలన్నారు.
 
డిఐజి ఏ.వి. రంగనాధ్ మాట్లాడుతూ జిల్లాలో పెండింగ్ కేసుల పరిష్కారంతో పాటు కోర్టు కేసులలో శిక్షల శాతం పెంచే విధంగా ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకుంటున్నామని, ఫంక్షనల్ వెర్టికల్స్ పనితీరు ఎప్పటికప్పుడు మెరుగుపరిచే విధంగా అదనపు ఎస్పీ నర్మద నేతృత్వంలో ప్రతి నిత్యం పర్యవేక్షణ చేస్తున్నట్లు తెలిపారు.

అధికారుల పనితీరు మెరుగుపర్చడం, సాంకేతిక పరిజ్ఞానం ఎప్పటికప్పుడు పెంపొందించుకునేలా శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఆయన వివరించారు.