శుక్రవారం, 22 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 7 మే 2020 (10:13 IST)

విశాఖ ఉక్కిరిబిక్కిరి - మాడిపోయిన చెట్లు - విగతజీవులుగా పశువులు

విశాఖపట్టణం జిల్లా గోపాలపట్నం పరిధిలోని ఆర్‌.ఆర్‌. వెంకటాపురంలోని ఎల్‌జీ పాలిమర్స్‌ పరిశ్రమ నుంచి ప్రమాదకరమైన రసాయన వాయువు లీకైంది. గురువారం వేకువజామున జరిగిన ఈ ప్రమాదంలో ఇప్పటివరకు ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోగా, ఐదు వేల మందికి పైగా అస్వస్థతకు గురైనట్టు తెలుస్తోంది.
 
అయితే ఈ రసాయన వాయువు లీక్‌ కావడంతో విశాఖ పట్టణం ఉక్కిరి బిక్కిరి అవుతోంది. రసాయన వాయువు ప్రభావంతో ముగ్గురు మృతి చెందారు. మరో ఐదుగురు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. అనేక మంది తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. వందల సంఖ్యలో బాధితులను పలు ఆస్పత్రులకు తరలిస్తున్నారు. 
 
సాయంత్రానికి మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ వాయువు ప్రభావంతో మనషులే కాదు.. మూగ జీవాలు కూడా బలవుతున్నాయి. పరిశ్రమ పరిసర ప్రాంతాల్లోని ఆవులు, దూడలు విగతజీవులుగా పడిపోయాయి. అక్కడున్న చెట్లు మాడిపోయాయి. 
 
రసాయన వాయువు లీక్‌ అయిందన్న విషయం తెలుసుకున్న స్థానిక ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. ఇండ్లలోనే చిక్కుకున్న వారి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. వాయువు ప్రభావంతో గంగరాజు అనే వ్యక్తికి కళ్లు కనబడకపోవడంతో.. బావిలో పడి చనిపోయాడు. ఈ వాయువును పీల్చిన వారు ఎక్కడికక్కడే కుప్పకూలిపోతున్నారు. 
 
మరోవైపు, ఈ విషవాయువు సుమారు 3 కిలోమీటర్ల మేర వ్యాపించింది. వాయువు లీక్​తో ఒంటిపై దద్దుర్లు, కళ్లలో మంటలు, శ్వాసలో ఇబ్బందులతో స్థానికుల అవస్థలు పడుతున్నారు. స్థానికులు భయాందోళనతో తలుపులు వేసుకుని ఇళ్లలోనే ఉండిపోయారు. సైరన్‌లు మోగించి ఇళ్లను ఖాళీ చేయాల్సిందిగా పోలీసుల హెచ్చరికలు జారీచేశారు. 
 
ఈ రసాయన పరిశ్రమకు సమీపంలోని ప్రాంతాల ప్రజలను ఇళ్ల నుంచి తరలిస్తున్నారు. రసాయన వాయువు ప్రభావంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. అపస్మారక స్థితిలో రహదారిపై పడిపోయిన కొందరిని ఆస్పత్రికి తరలిస్తున్నారు. చిన్నారులు, మహిళలు అపస్మారక స్థితిలోకి చేరుకున్నారు.