శనివారం, 24 ఫిబ్రవరి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఐవీఆర్
Last Modified: బుధవారం, 29 జూన్ 2022 (22:11 IST)

మీ అందరి ముందు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తున్నా: మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాకరే

uddhav Thackeray
మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్లు శివసేన అధినేత ఉద్ధవ్ థాకరే బుధవారం ప్రకటించారు. రేపు అసెంబ్లీలో మెజారిటీని నిరూపించుకునేందుకు బలపరీక్ష నిర్వహించాలని థాకరే నేతృత్వంలోని మహా వికాస్ అఘాడి (ఎంవిఎ) ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించిన కొద్దిసేపటికే ఫేస్‌బుక్ లైవ్ ద్వారా ఈ ప్రకటన వెలువడింది.


రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ఉద్ధవ్ మాట్లాడుతూ, తన ప్రభుత్వం ఔరంగాబాద్‌ను తన తండ్రి బాల్ థాకరే మొదటగా స్థాపించిన శంభాజీ నగర్‌గా మార్చడం పట్ల సంతృప్తి చెందానని అన్నారు. తన కూటమి భాగస్వాములు శరద్ పవార్, సోనియా గాంధీలు తమకు మద్దతు ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు.

 
విశ్వాస పరీక్షను ఎదుర్కోవాలని సిఎం ఉద్ధవ్‌కు మహారాష్ట్ర గవర్నర్‌ ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ శివసేన చీఫ్‌ విప్‌ సునీల్‌ ప్రభు వేసిన పిటిషన్‌పై సుదీర్ఘ విచారణ అనంతరం కోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది. అంతకుముందు విచారణ సందర్భంగా, ప్రజాస్వామ్యానికి సంబంధించిన ఈ సమస్యల పరిష్కారానికి సభా వేదిక ఒక్కటే మార్గమని అత్యున్నత న్యాయస్థానం అభిప్రాయం వ్యక్తం చేసింది. దీనితో ఉద్ధవ్ థాకరే ముందు రాజీనామా తప్ప మరో మార్గం కనిపించకుండా పోయింది.

 
మరోవైపు సీఎం పదవికి ఉద్ధవ్ రాజీనామా చేయగానే భాజపా శ్రేణులు మిఠాయిలు పంచుకున్నాయి. రాష్ట్రంలో తమ ప్రభుత్వం రాబోతోందంటూ వారంతా డబ్బులు వాయిస్తూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.