శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By
Last Modified: బుధవారం, 16 జనవరి 2019 (19:35 IST)

అమెజాన్ కొబ్బరి చిప్పా... మజాకా? దాని ధర ఎంతో తెలిస్తే షాకే...

కోతికి కొబ్బరి చిప్ప ఇస్తే అది దాన్ని ఎక్కడో పెట్టి కొడుతుందని అంటుంటారు మన పెద్దలు. అంటే... కోతికి కొబ్బరి చిప్ప ఇస్తే అంత ప్రమాదం మరి. ఇంతకీ ఈ కొబ్బరి చిప్ప గొడవ ఏంటనేగా మీ డౌటు. మరేం లేదండీ... ఇపుడీ కొబ్బరి చిప్ప వార్తల్లోకి వచ్చేసింది. దీనికి కారణం ఇ-కామర్స్ సంస్థ అమెజాన్.
 
ఆన్ లైన్లో కొనుగోలు చేసేవారిలో కొందరికి తాము బుక్ చేసిన ఐటెమ్ కాకుండా భిన్నమైనవి వస్తుంటే షాకవుతుంటారు. ఆ విషయాన్ని సామాజిక నెట్వర్కింగ్ సైట్లలో పోస్ట్ చేస్తుంటారు కూడా. ఐతే ఇది అలాంటిది కాకపోయినా ఆశ్చర్యాన్ని మాత్రం కలిగిస్తోంది. అమెజాన్ తన ఆన్‌లైన్ మార్కెట్ ప్లేస్‌లో ఓ కొబ్బరిచిప్పను వుంచి దాని పక్కనే దాని ధరను పెట్టింది.
 
ఆ ధరను చూస్తే షాకే. ఎందుకంటే కేవలం 20 రూపాయలకో 30 రూపాయలకో దొరికే కొబ్బరికాయను పగులగొట్టి దాన్నుంచి కొబ్బరి తీసేసుకుని చిప్పలను పారేస్తుంటారు. ఐతే ఆ చిప్పను మార్కెట్ ప్లేసులో పెట్టి దాని ధర రూ. 1365 అని పెట్టడమే ఇప్పుడు పెద్ద షాకుగా మారిపోయింది. సహజంగా కొబ్బరి చిప్పలపై ఏదయినా కళాత్మక ఆకృతులను చెక్కి ధరను పెంచి అమ్ముతుంటారు. 
 
కానీ ఇక్కడ ఈ కొబ్బరి చిప్పకు అలాంటిదేమీ లేదు, కేవలం కొబ్బరికాయను పగులగొట్టి సగం చిప్పను అక్కడ వుంచారు. మరీ షాకింగ్ విషయం ఏంటంటే... ఈ కొబ్బరి చిప్పను 55% డిస్కౌంట్ ఇచ్చి మరీ అమ్మకానికి పెట్టడం. అంటే, దీని అసలు ఖరీదు రూ. 3000 అన్నమాట. అమెజాన్ కొబ్బరి చిప్పా మజాకా?