బుధవారం, 28 ఫిబ్రవరి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 14 ఫిబ్రవరి 2023 (14:10 IST)

సిగ్నల్ జంప్ చేసినందుకు ఆపిన కానిస్టేబుల్ - కిలోమీటరు ఈడ్చు కెళ్లిన కారు డ్రైవర్

car bonnet
మహారాష్ట్రలో ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్‌ను ఒక కారు డ్రైవరు ఏకంగా ఒక కిలోమీటరు మేరకు ఈడ్చుకెళ్లాడు. ఈ ఘటన రాష్ట్రంలోని పాల్ఘర్ జిల్లాలో జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
 
ముంబైకి 60 కిలోమీటర్ల దూరంలోని వాసాయి శివారు ప్రాంతంలో ఆదివారం సాయంత్రం వేగంగా దూసుకొచ్చిన ఓ కారు డ్రైవర్ సిగ్నల్ జంప్ చేయగా ఆ కారును ఆపే ప్రయత్నంలో రోడ్డుపై కారుకు అడ్డంగా ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్ నిలబడ్డాడు. పోలీసును చూసిన కారుడ్రైవర్ మరింత వేగంతో ముందుకు పోనిచ్చాడు. దీంతో ఆయన ఎగిరి కారు బానెట్‌పై పడ్డాడు. 
 
అయినప్పటికీ పట్టించుకోని కారు డ్రైవరు ఆయనను అలాగే, కిలోమీటరు దూరం పాటు ఈడ్చుకెళ్లారు. అలా వెళ్తూ ట్రాఫిక్ జామ్‌లో చిక్కుకుపోవడంతో ట్రాఫిక్ పోలీసుల చేతికి చిక్కాడు. దీంతో 19 యేళ్ల కారు డ్రైవర్‌ను అరెస్టు చేశారు. పైగా అతడికి డ్రైవింగ్ లైసెన్సు కూడా లేదని పోలీసులు తెలిపారు. 
 
ప్రభుత్వం ఉద్యోగిపై దాడి చేయడం, హత్యాయత్నం సహా పలు కేసులు నమోదు చేసినట్టు చెప్పారు. కారు మాత్రం ఉత్తరప్రదేశ్ రాష్ట్ర రిజిస్ట్రేషన్ నంబరుతో రిజిస్టర్ అయింది. ఈ ఘటనపై గాయపడిన ట్రాఫిక్ కానిస్టేబుల్‌ను సహచర పోలీసులు సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.