సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By
Last Updated : శుక్రవారం, 20 సెప్టెంబరు 2019 (15:20 IST)

కేంద్ర మంత్రిపై దాడి చేసిన విద్యార్థులు... రక్షించిన రాష్ట్ర గవర్నర్

బీజేపీ, కేంద్రమంత్రి బాబూల్ సుప్రియోకు చేదు అనుభవం ఎదురైంది. ఆయనపై జాదవ్‌పూర్ విశ్వవిద్యాలయంలో విద్యార్థులు దాడి చేశారు. ఘెరావ్ చేశారు. దీంతో ఆయన్ను ఆ రాష్ట్ర గవర్నర్ సురక్షితంగా రక్షించారు. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, పశ్చిమబెంగాల్‌ రాజధాని కోల్‌కతాలోని జాదవ్‌పూర్‌ విశ్వవిద్యాలయంలో గురువారం బీజేపీ విద్యార్థి విభాగం ఏబీవీపీ నిర్వహించిన సదస్సుకు బాబూల్ సుప్రియో హాజరయ్యారు. ఆయన రాకను నిరసిస్తూ భారీ సంఖ్యలో విద్యార్థులు నల్లజెండాలు పట్టుకుని నిరసన తెలిపారు. ముఖ్యంగా, ఎస్‌ఎఫ్‌ఐ, ఏఎస్‌ఐఏ, ఏఎఫ్‌ఎస్‌యూ, ఎఫ్‌ఈటీఎస్‌యూ తదితర వామపక్ష విద్యార్థి సంఘాలు వ్యతిరేకించాయి. ఘెరావ్ చేశాయి. 
 
ఈ సందర్భంగా కొందరు విద్యార్థులు తన జుట్టు పట్టుకుని లాగారనీ, దాడిచేశారని సుప్రియో ఆరోపించారు. అయితే సుప్రియో వర్సిటీ విద్యార్థినులతో దురుసుగా ప్రవర్తించారని ఏఎస్‌ఎఫ్‌యూ నేత దెబ్రాజ్‌ దేబ్‌నాథ్‌ విమర్శించారు.
 
ఈ విషయం తెలుసుకున్న గవర్నర్‌ ధనకర్‌ హుటాహుటిన విశ్వవిద్యాలయానికి చేరుకుని సుప్రియోను సురక్షితంగా బయటకు తీసుకురాగలిగారు. ఈ ఘటన అనంతరం ఏబీవీపీ కార్యకర్తలు రెచ్చిపోయారు.
 
క్యాంపస్‌లోని ఏఎఫ్‌ఎస్‌యూ కార్యాలయంలోని కంప్యూటర్లు, సీలింగ్‌ ఫ్యాన్లు, ఫర్నీచర్‌ను ధ్వంసం చేసి నిప్పుపెట్టారు. సుప్రియోపై దాడి వ్యవహారంపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని పశ్చిమబెంగాల్‌ సీఎస్‌ను గవర్నర్‌ ఆదేశించారు.