30 ఏళ్ల స్త్రీ తనపై రేప్ జరిగిందంటే నమ్మేదెలా? ఎఫైర్ పెట్టుకుని... మంత్రి సంచలనం
దేశంలో జరుగుతున్న అత్యాచారాలపై ఇప్పటికే కొంతమంది తమ ఇష్టంవచ్చిన వ్యాఖ్యలు చేసి మహిళా సంఘాల ఆగ్రహానికి గురయ్యారు. కొందరైతే మహిళలు వేసుకుంటున్న మోడ్రన్ దుస్తులే అత్యాచారాలకు కారణమవుతున్నాయంటూ వ్యాఖ్యానించి చివరికి క్షమాపణలు చెప్పారు. తాజాగా ఉత్తరప్రదేశ్ రాష్ట్ర నీటి పారుదల శాఖామంత్రి ఉపేంద్ర తివారీ చేసిన వ్యాఖ్యలు సంచలనమయ్యాయి. ఆయన అత్యాచారాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
ఆయన ఏమన్నారంటే... స్త్రీలు కొంతమంది తమకు నచ్చిన వారితో ఏడెనిమిదేళ్లు వివాహేతర సంబంధాన్ని పెట్టుకుని ఆ తర్వాత తమను అత్యాచారం చేశారంటూ పురుషులపై కేసులు పెడుతున్నారంటూ సంచలన వ్యాఖ్యాలు చేశారు. మైనర్ బాలికలపై జరిగే అఘాయిత్యాలను అత్యాచారాలకు పరిగణించవచ్చు కానీ 30 నుంచి 35 ఏళ్ల దాటిన స్త్రీలు తమపై అత్యాచారం జరిగిందంటే విశ్వసించేది ఎలా అంటూ ప్రశ్నించి అందరికీ షాక్ ఇచ్చారు.
దీనితో ఇప్పుడు అతడి వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం పెల్లుబుకుతోంది. ఐతే అంతలోనే సంబాళించుకుంటూ అత్యాచార ఘటన తన దృష్టికి వస్తే ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వెంటనే స్పందిస్తున్నారని చెప్పుకొచ్చారు. ఐతే ఆయన వ్యాఖ్యలపై మహిళా సంఘాలు ఇప్పటికే ఆగ్రహాన్ని తెలియజేశాయి.