శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. బడ్జెట్ 2018-19
Written By chj
Last Modified: సోమవారం, 29 జనవరి 2018 (17:05 IST)

2018-19 ఆర్థిక సంవత్సరంలో అది మనకు సులభమే అంటున్న సీఎం చంద్రబాబు

‘‘ఈ ఏడాది తొలి అర్థసంవత్సరంలో 11.5% వృద్ధి సాధించాం, 62% ప్రజల్లో సంతృప్తికి చేరుకున్నాం. ఇంకా 18% సంతృప్తి సాధించాలి. ఈ స్ఫూర్తిని ఇదేవిధంగా కొనసాగించాలి. 15% వృద్ధి, 80% ప్రజా సంతృప్తి లక్ష్యంగా అందరూ పనిచేయాలి. సక్రమంగా పనిచేస్తే 15% వృద్ధి సాధించ

‘‘ఈ ఏడాది తొలి అర్థసంవత్సరంలో 11.5% వృద్ధి సాధించాం, 62% ప్రజల్లో సంతృప్తికి చేరుకున్నాం. ఇంకా 18% సంతృప్తి సాధించాలి. ఈ స్ఫూర్తిని ఇదేవిధంగా కొనసాగించాలి. 15% వృద్ధి, 80% ప్రజా సంతృప్తి లక్ష్యంగా అందరూ పనిచేయాలి. సక్రమంగా పనిచేస్తే 15% వృద్ధి సాధించడం సులభమే’’ అని ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. సోమవారం తన నివాసం నుంచి నీరు-ప్రగతి, వ్యవసాయం పురోగతిపై టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.
 
గత నెలలో 5% సంతృప్తి ప్రజల్లో  పెరిగిందని,ఏప్రిల్ నాటికి మరో 5% సంతృప్తి చెందేలా అధికార యంత్రాంగం, ప్రజా ప్రతినిధులు పనిచేయాలని ముఖ్యమంత్రి కోరారు. పెన్షన్లపై సంతృప్తి గతనెలలో ఉన్నట్లే 79% ఉండగా, ఈనెలలో రేషన్ పై సంతృప్తి 69%నుంచి 76%కు పెరగడం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. జన్మభూమిలో వచ్చిన వినతుల పరిష్కారంపై శ్రద్ధ చూపిన అధికారులు, సిబ్బందిని అభినందించారు. జనవరి 31 లోపు వినతులన్నీ పరిష్కారం అయ్యేలా కృషి చేయాలన్నారు.
 
ప్రతి పేద కుటుంబానికి సొంతింటి కల నిజం చేయాలి:
‘‘సొంత ఇల్లు ఉండాలన్న ఆలోచన అందరిలో ఉంటుంది. వారి కల నెరవేర్చాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ఇళ్ల నిర్మాణానికి ప్రజల్లో డిమాండ్ అధికంగా ఉంది. ప్రతి పేద కుటుంబానికి సొంతింటి కల నిజం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది’’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. 2016-17 ఎన్టీఆర్ గ్రామీణ్ ఇళ్ల నిర్మాణం 64%మాత్రమే చేశారంటూ 100% లక్ష్యం చేరుకోవాలని ఆదేశించారు. 2017-18, 2018-19 ఇళ్ల కేటాయింపులు వేగవంతం చేయాలన్నారు. ఫిబ్రవరిలో రెండవ విడత సామూహిక గృహ ప్రవేశాలు పండుగగా నిర్వహించాలన్నారు. అంగన్‌వాడి భవనాల నిర్మాణం వేగవంతం చేయాలని, నిర్మించిన ప్రతి అంగన్ వాడి భవనాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
 
నరేగాతో అటు ఉపాధి,ఇటు ఆస్తుల కల్పన జరుగుతోంది ఆంధ్రప్రదేశ్ లోనే: 
‘‘ఇతర రాష్ట్రాలలో ఉపాధికి మాత్రమే నరేగా వినియోగిస్తున్నారు.మన రాష్ట్రంలో అటు ఉపాధి,ఇటు ఆస్తుల కల్పనకు నరేగా నిధులు సద్వినియోగం చేసుకుంటున్నాం.పంటకుంటల తవ్వకంలో మొదటిస్థానంలో ఉన్నాం, నరేగా నిధుల వ్యయంలో 3వస్థానంలో ఉన్నాం. పనిదినాల సంఖ్య మరింతగా పెంచుకోవాలి’’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.   
 
జియో ట్యాగింగ్ చేశాకే నరేగా పనులను ప్రారంభించాలని, లేకపోతే ఇబ్బందులు వస్తాయని హెచ్చరించారు. మెటీరియల్ కాంపోనెంట్ పనులు ఎక్కువ జరిగిన జిల్లాలలో లేబర్ కాంపోనెంట్ పెంచుకోవాలన్నారు.అవెన్యూ ప్లాంటేషన్ లో నాటిన మొక్కల పెరుగుదలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆదేశించారు. ఈ టెలికాన్ఫరెన్స్‌లో వ్యవసాయ, ఉద్యాన, పశుగణాభివృద్ధి, జలవనరులు, గ్రామీణాభివృద్ధి, అటవీ శాఖల ముఖ్య కార్మదర్శులు రాజశేఖర్, చిరంజీవి చౌదరి, గోపాలకృష్ణ ద్వివేది, శశిభూషణ్,జవహర్ రెడ్డి, అనంత రాము,మల్లికార్జున రావు, హవుసింగ్ ఎండి కాంతిలాల్ దండే,  ఆర్ధిక శాఖ అధికారిణి సునీత, సెర్ప్ సీఈవో కృష్ణమోహన్, రియల్ టైం గవర్నెన్స్ ప్రతినిధి బాలాజి, ఇతర అధికారులు, వివిధ జిల్లాల కలెక్టర్లు పాల్గొన్నారు.