బుధవారం, 6 నవంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. బడ్జెట్ 2021
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 1 ఫిబ్రవరి 2021 (11:25 IST)

బడ్జెట్ 2021-22 : కరోనా కష్టకాలంలో బడ్జెట్ ప్రవేశపెడుతున్నాం...

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ 2021-22 వార్షిక బడ్జెట్‌ను సోమవారం లోక్‌సభలో ప్రవేశపెడుతున్నారు. మేడిన్‌ ఇండియా ట్యాబ్‌లో పొందుపరిచిన బడ్జెట్‌ ప్రసంగాన్ని చదవడం ప్రారంభించారు. కొవిడ్‌-19తో కుదేలైన ఆర్థిక వ్యవస్థను గాడినపెట్టడంతో పాటు ఉద్యోగాల కల్పనకు పెద్దపీట వేసేలా బడ్జెట్‌కు రూపకల్పన చేశారు.
 
నిర్మల బడ్జెట్‌పై పలు వర్గాలు ఆశలు పెంచుకున్న క్రమంలో ఎలాంటి వరాలు, రాయితీలు కురిపిస్తారనేది ఆసక్తికరంగా మారింది.  ఇక కొవిడ్‌తో దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థలో ఉత్తేజం నింపేందుకు ఎలాంటి ఉద్దీపన ప్యాకేజ్‌లు ప్రకటిస్తారని పరిశ్రమ వర్గాలు ఉత్కంఠగా వేచిచూస్తున్నాయి.
 
"గతంలో ఎన్నడూ చూడని పరిస్థితుల మధ్య నేను బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నాను. కరోనా మహమ్మారి ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదేలు చేసింది. ఇటువంటి పరిస్థితుల్లో ఆత్మ నిర్భర భారత్‌లో భాగంగా తయారు చేసిన మేడిన్ ఇండియా ట్యాబ్‌లో ఈ బడ్జెట్‌ను తీసుకుని వచ్చాను. నష్టపోయిన రంగాలకు చేయూత ఇచ్చేందుకు నరేంద్ర మోడీ నాయకత్వంలోని ప్రభుత్వం ఇప్పటికే ఎన్నో చర్యలు తీసుకుంది. వాటికి కొనసాగింపుగా ఈ ప్రతిపాదనలు ఉంటాయి" అంటూ వరుసగా మూడవ సారి నిర్మల బడ్జెట్‌ను చదవడం ప్రారంభించారు. 
 
అంతకుముందు.. ప‌్ర‌ధాని న‌రేంద్ర‌ మోడీ అధ్య‌క్ష‌త‌న సోమ‌వారం జ‌రిగిన కేంద్ర క్యాబినెట్ స‌మావేశం 2021-22 సంవ‌త్స‌ర బ‌డ్జెట్ ప్ర‌తిపాద‌న‌కు ఆమోదం తెలిపింది. ఫారెక్స్ మార్కెట్‌లో డాల‌ర్ మీద రూపాయి ఏడు పైస‌లు బ‌ల‌ప‌డి రూ.72.89వ‌ద్ద కొనసాగుతున్న‌ది. ప్ర‌ధాని మోడీ అధ్య‌క్ష‌త‌న 10.15 గంట‌ల‌కు క్యాబినెట్ స‌మావేశం మొద‌లైంది. 
 
అంత‌కుముందు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్.. రాష్ట్ర‌ప‌తి రాంనాథ్ కోవింద్‌ను క‌లుసుకున్నారు. బ‌డ్జెట్ ప్ర‌తిపాద‌న‌ల‌ను స‌మ‌ర్పించ‌డానికి ముందు విత్త‌మంత్రి, రాష్ట్ర‌ప‌తిని క‌లువ‌డం సంప్ర‌దాయంగా వ‌స్తున్న‌ది. బ‌డ్జెట్ నేప‌థ్యంలో బీఎస్ఈలో సెన్సెక్స్ 598 పాయింట్లు లాభ‌ప‌డింది.