శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. బడ్జెట్ 2021
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 1 ఫిబ్రవరి 2021 (07:20 IST)

బడ్జెట్ 2021 వ్యాక్సిన్ : హోదా, రైల్వే జోన్ అమలుపై కోటి ఆశలు!

కేంద్ర విత్తమంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం 2021-22 ఆర్థిక సంవత్సరానికిగాను వార్షిక బడ్జెట్‌ను లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నారు. కరోనా కష్టకాలంలో ప్రవేశపెడుతున్న ఈ బడ్జెట్‌పై దేశ ప్రజలంతా కోటి ఆశలు పెట్టుకున్నారు. ముఖ్యంగా, ఆంధ్రప్రదేశ్ ప్రజలు గంపెడాశలు పెట్టుకున్నారు. ప్రత్యేక హోదాతో పాటు రైల్వే జోన్ అమలుపై సానుకూల ప్రకటన వస్తుందని భావిస్తున్నారు. 
 
ముఖ్యంగా, రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీలనైనా కేంద్రం పూర్తిగా నెరవేరుస్తుందా? అని ఎదురుచూడటం బడ్జెట్ చూశాక నిట్టూర్చడం.. ఏటా ఇదే అలవాటైంది. ఈసారి బడ్జెట్లోనైనా తమ ఆంక్షలు నెరవేరుతాయా? ప్రత్యేక హోదా, విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ అమలు జరుగుతాయా అని ప్రజలు ఎదురుచూస్తున్నారు. 
 
రాష్ట్ర విభజన జరిగి ఏడున్నరేళ్లు గడిచిపోతున్నప్పటికీ ఆంధ్రప్రదేశ్ ఇంకా బాలారిష్టాలను దాటలేదు. చేయి పట్టుకుని నడిపించాల్సిన కేంద్రం.... ఇచ్చిన హామీలనే పూర్తిగా నెరవేర్చట్లేదు. ప్రత్యేక హోదాపై రాష్ట్ర ప్రభుత్వం ఎన్నిసార్లు, ఎన్ని వేదికలపై మొరపెట్టుకున్నా కేంద్రం కనికరించడం లేదు. హోదా ప్రకటించే దిశగా ఈ బడ్జెట్లోనైనా కేంద్రం చర్యలు తీసుకోవాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారు. 
 
ప్రత్యేక హోదాతో విదేశీ ఆర్థిక సాయంతో చేపట్టే ప్రాజెక్టులు, కేంద్ర ప్రాయోజిత ప్రాజెక్టుల్లో సింహభాగం కేంద్రమే భరిస్తుంది. రాష్ట్రానికి ప్రత్యేక గ్రాంట్లూ వస్తాయి. ప్రభుత్వంపై ఆర్థికభారం తగ్గుతుంది. పారిశ్రామిక రాయితీలు లభిస్తాయి. రాష్ట్రంలో పెద్దగా పరిశ్రమలు లేకపోవడంతో ఉపాధి కరవైంది. అందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వరంగ పరిశ్రమలతోపాటు ప్రైవేటురంగంలోనూ ఎక్కువ పరిశ్రమలు వచ్చేలా కేంద్రం చొరవ తీసుకోవాలని రాష్ట్రం కోరుతోంది. 
 
రాష్ట్రంలో అనేక చోట్ల రక్షణరంగ సంబంధిత పరిశ్రమలను కేంద్రం ప్రతిపాదించినా.... ఇంకా ఆచరణకు నోచుకోలేదు. 2014-15 నాటికి రాష్ట్ర రెవెన్యూ లోటు 22,948 కోట్లు అని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి నివేదించగా... 4,117.89 కోట్లు మాత్రమే ఇస్తామని కేంద్రం తెలిపింది. అందులోనూ ఇప్పటికి 3,979.5 కోట్లు మాత్రమే విడుదల చేసి చేతులు దులుపుకుంది.