అంతర్జాతీయ మహిళా దినోత్సవం మార్చి 8, ఎలా వచ్చిందో తెలుసా?
బ్రిటీష్ ఎంపి జాన్ స్టార్ట్ మిల్ల్ 1869వ సంవత్సరంలో మహిళలకు ఓటు హక్కు కావాలని బ్రిటీష్ పార్లమెంటులో ప్రస్తావించి డిమాండ్ చేశారు. 1893 సెప్టెంబరు 19న న్యూజిలాండ్ ప్రభుత్వం మహిళలకు ఓటు హక్కు కల్పిస్తూ తీర్మానం చేసిన ఏకైక దేశం. ఇతర దేశాలలో మహిళలకు ఓటు హక్కు చాలా సంవత్సరాల వరకు లభించలేదు.
కోపెన్‌హెగన్‌లో 1910వ సంవత్సరంలో రెండవ అంతర్జాతీయ మహిళా ఉద్యోగినుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలోనే మహిళలకు ప్రత్యేకంగా ఓ రోజుండాలని అదే అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా ప్రతి దేశంలోని మహిళలు జరుపుకోవాలని జర్మనీకి చెందిన సోషియల్ డెమోక్రటిక్ పార్టీలోని వుమెన్స్ కార్యాలయంలో అధికారి అయిన క్లారా జెట్‌కిన్ కోరారు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళామణులు తమ కోర్కెలను విన్నవించుకునే వెసలుబాటు కలగాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో 17 దేశాలనుంచి వివిధ సంఘాలకు చెందిన మహిళా నాయకురాళ్ళు దాదాపు వందమంది హాజరైనారు. ఇందులో ఆమె చెప్పిన డిమాండుకు ప్రతి ఒక్కరు ఆమెకు కృతజ్ఞతలు తెలుపుతూ ధన్యవాదాలు చెప్పారు. ఇక అప్పటి నుంచి ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా మహిళలు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నారు.
తొలిసారిగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని మార్చి 19 (మార్చి 8న కాదు) జెక్టిన్ ఘనంగా ప్రారంభించారు. పర్షియన్ రాజు మహిళలకు ఓటు హక్కు కల్పిస్తామని అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకునేందుకు మార్చి 19, 1848న అంగీకరించాడు. తదుపరి అతను ఇచ్చిన వాగ్దానాలన్నిటినీ నెరవేర్చాడు. కాని మహిళలకు ఓటు హక్కును కల్పించడం మాత్రం చట్టబద్ధత కల్పించలేదు. ఇచ్చిన మాట నెరవేర్చలేకపోయాడు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం మార్చి ఎనిమిదవ తేదీన ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటుంటారు. దేశం, జాతి, భాష, రాజ్యం, సంస్కృతి, భేదభావాలకు తావు లేకుండా మహిళలందరూ ఒకచోట చేరి ఉత్సవాన్ని ఘనంగా జరుపుకుంటారు. చరిత్రను అనుసరించి సాధికారత సాధన దిశగా మహిళలు పోరాటానికి అంకురార్పణ చేశారు.
ప్రాచీన గ్రీకు రాజ్యంలో లీసిస్టాటా పేరు గల మహిళ ఫ్రెంచి విప్లవం ద్వారా యుద్ధానికి ముగింపు చెప్పాలని విజ్ఞప్తి చేస్తూ ఆందోళనకు శ్రీకారం చుట్టింది. పార్శీ మహిళలతో కూడిన సమూహం ఒకటి ఇదే రోజున వెర్సెల్స్‌లో ఒక ఊరేగింపును నిర్వహించింది. యుద్ధం కారణంగా మహిళలపై రోజురోజుకు పెరిగిపోతున్న అత్యాచారాలను నిరోధించాలని డిమాండ్ చేస్తూ వారు ఈ ఊరేగింపు జరిపారు.
1909వ సంవత్సరం ఫిబ్రవరి 28వ తేదీన అమెరికా సోషలిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో అమెరికాలో మహిళా దినోత్సవం జరిగింది. 1910 సంవత్సరంలో కొపెన్‌హెగన్‌లో సోషలిస్ట్ ఇంటర్నేషనల్ ద్వారా మహిళా దినోత్సవం ఆవిర్భవించింది. 1911 సంవత్సరంలో ఆస్ట్రియా, డెన్మార్క్, జర్మనీ మరియు స్విట్జర్లాండ్ దేశాల్లో లక్షలాదిగా మహిళలు తరలివచ్చి ఈ ర్యాలీలో పాల్గొన్నారు.
మతాధికారం, ప్రభుత్వ ఉద్యోగాల్లో తగు ప్రాధాన్యత, కార్యాలయాల్లో మహిళలపట్ల వివక్షత నిర్మూలన తదితర డిమాండ్ల సాధన కోసం మహిళలు ఈ ర్యాలీ నిర్వహించారు. 1913-14 మధ్య కాలంలో జరిగిన మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో శాంతిని స్థాపించాలని కోరుతూ ఫిబ్రవరి మాసంలో వచ్చిన చివరి ఆదివారం నాడు రష్యా దేశానికి చెందిన పలువురు మహిళలు మహిళా దినోత్సవాన్ని జరుపుకున్నారు.
ఐరోపా అంతటా యుద్ధ వ్యతిరేక ఆందోళన కార్యక్రమాలు చోటు చేసుకున్నాయి. 1917వ సంవత్సరం వరకు జరిగిన ప్రపంచ యుద్ధంలో రష్యాకు చెందిన సైనికులు దాదాపు రెండు లక్షలకు పైగా మరణించారు. ఆహారం మరియు శాంతిని కోరుతూ ఇదే రోజున రష్యా మహిళలు ధర్నా కార్యక్రమం చేపట్టారు. తమ ఉద్యమాలు, పోరాటాలతో రష్యా మహిళలు ఓటు హక్కును సాధించుకున్నారు. మహిళలు సాధించిన విజయాలకు చిహ్నంగా సాధికారతను పొందే క్రమంలో భాగంగా ప్రతి సంవత్సరం మార్చి ఎనిమిదవ తేదీన విశ్వవ్యాప్తంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది.