ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. ఆయుర్వేదం
Written By
Last Updated : ఆదివారం, 28 ఏప్రియల్ 2019 (18:54 IST)

గాడిదపాలతో సబ్బుల తయారీ.. వాడితే యవ్వనంగా మారిపోతారట...

'గంగిగోవు పాలు గ‌రిటెడైనా చాలు.. క‌డివెడైన‌నేమి ఖ‌ర‌ము పాలు' అని క‌వి వేమ‌న ఒక ప‌ద్యంలో చెప్పాడు. అంటే ఆవు పాలు గరిటెడు అయినా సరిపోతాయి.. కానీ గాడిద పాలు బిందె నిండా ఉన్నా వాటితో ఉప‌యోగం లేదన్నది దానర్థం. ఇది పాతకాలపు ప్రచారం. 
 
ఈ కాలపు పరిశోధకులు మాత్రం గాడిద పాలు మంచివని అంటున్నారు. గాడిద పాల‌లో యాంటీ ఏజింగ్ గుణాలు పుష్క‌లంగా ఉన్నాయట. అందువ‌ల్లే ఢిల్లీలోని ఓ స్టార్ట‌ప్ కంపెనీ గాడిద పాల‌తో స‌బ్బుల‌ను త‌యారు చేసి విక్ర‌యిస్తూ అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురిచేస్తున్న‌ది. పైగా, ఈ సబ్బుల వాడితే మరింత యవ్వనంగా మారుతారంటూ ప్రచారం చేస్తోంది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, ఆర్గానికో అనే ఢిల్లీకి చెందిన ఓ స్టార్టప్ కంపెనీ ఇటీవలి కాలంలో గాడిద పాలతో సబ్బులను తయారు చేపట్టి, అతి తక్కువ కాలంలో పేరుగడించింది. పూర్వం ఈజిప్టు మ‌హారాణి క్లియోపాత్రా కూడా గాడిద పాల‌తోనే స్నానం చేసేద‌ట‌. ఇలా గాడిద పాల‌ను స్నానానికి ఉప‌యోగిస్తే చ‌ర్మం మృదువుగా మారుతుంద‌ని, చ‌ర్మ సంర‌క్ష‌ణ క‌లుగుతుంద‌ని శాస్త్రీయంగా నిరూపించడం జరిగింది. దీన్ని ఆదర్శంగా తీసుకున్న ఆర్గానికో కంపెనీ సబ్బులను తయారు చేసింది. 
 
ఈ సబ్బుతో స్నానం చేయడం వల్ల చ‌ర్మానికి అంత త్వ‌ర‌గా వృద్ధాప్య చాయ‌లు రావ‌ట‌. అంటే ఎక్కువ కాలం పాటు య‌వ్వ‌నంగా ఉంటార‌న్నమాట‌. చర్మం కూడా కాంతిని ప్రసాదిస్తుందట. చ‌ర్మం మృదువుగా మారుతుందట. గాడిద పాల‌లో యాంటీ బాక్టీరియ‌ల్ గుణాలు ఉంటాయ‌ని, ఇవి మొటిమ‌లను త‌గ్గిస్తాయ‌ని, చ‌ర్మ ఇన్‌ఫెక్ష‌న్ల‌ను తగ్గిస్తాయట. 
 
దీంతో దేశంలో గాడిద పాలకు మంచి గిరాకీ ఏర్పడింది. ప్రస్తుతం మన దేశంలో తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో ఖరము పాలు ఎక్కువగా లభిస్తాయి. ఈ ప్రాంతాల్లోని ప‌లువురు స‌బ్బుల‌నుకాకుండా ఏకంగా గాడిద పాల‌నే తాగేందుకు ఆస‌క్తి చూపిస్తున్నార‌ట‌. దీంతో ఓ లీటర్ పాలు వెయ్యి రూపాయల వరకు ధర పలుకుతుందట. 
 
పైగా, గాడిద పాల‌ను తాగ‌డం వ‌ల్ల లైంగిక స‌మ‌స్య‌లు పోతాయ‌ని, ఆస్త‌మా, ఆర్థ‌రైటిస్‌, షుగ‌ర్ స‌మ‌స్య‌లు త‌గ్గుతాయ‌ని అధిక శాతం మంది విశ్వసించి ఆ స‌మ‌స్య‌ల నుంచి బ‌య‌ట ప‌డేందుకు గాడిద పాల‌ను తాగుతున్నార‌ట‌. ఏది ఏమైనా ఇప్పుడీ గాడిద పాల స‌బ్బులు మాత్రం నెట్‌లో విప‌రీతంగా వైర‌ల్ అవుతున్నాయి.