శనివారం, 30 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Modified: గురువారం, 12 ఆగస్టు 2021 (18:45 IST)

అఫ్గానిస్తాన్: ‘వాళ్లు పాశ్చత్య సంస్కృతిని వీడటం లేదు, మేం వారిని చంపాల్సిందే’ - బీబీసీతో తాలిబన్లు

అఫ్గానిస్తాన్‌లో తాలిబన్లు ఒక్కో నగరాన్ని స్వాధీనం చేసుకుంటూ వెళ్తున్నారు. వారిని అడ్డుకునేందుకు అఫ్గాన్ బలగాలు ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలో భీకర పోరాటం జరుగుతోంది. తాలిబన్ల ఆధీనంలో ఉన్న ప్రాంతానికి వెళ్లి, వారిని ఇంటర్వ్యూ చేసే అరుదైన అవకాశం బీబీసీకి లభించింది.

 
బీబీసీ ప్రతినిధి సికందర్ కిర్మానీ అఫ్గానిస్తాన్ నుంచి అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ ఇది. అఫ్గానిస్తాన్‌లోని అతి పెద్ద నగరాల్లో ఒకటైన మజర్-ఇ- షరీఫ్‌ నుంచి 30 నిమిషాల్లో చేరుకునేంత దూరంలో తాలిబన్ ఫైటర్లు ఉన్నారు. మేము వారిని అక్కడే కలిశాము. అక్కడ ఒక హమ్వీ (సైనిక వాహనం), రెండు వ్యాన్లు, చాలా శక్తిమంతమైన మెషీన్ గన్స్ ఉన్నాయి. ఆయుధాలతో వచ్చిన ఆ గుంపుకి మదర్సాలో చదువుకున్న అయినుద్దీన్ నాయకుడు. ఆ ప్రాంతానికి మిలటరీ కమాండర్ కూడా ఆయనే.

 
అంతర్జాతీయ బలగాలు వెనుతిరగడంతో ఈ తిరుగుబాటుదారులు రోజువారీగా కొత్త ప్రాంతాలను తమ ఆధీనంలోకి తెచ్చుకుంటున్నారు. దీంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. వేలాది మంది సాధారణ అఫ్గాన్ ప్రజలు ఇళ్లను వదలి పారిపోయారు. గడిచిన కొన్ని వారాల్లో వందలాది మంది చనిపోవడమో, గాయపడటమో జరిగింది.

 
ఈ హింసను ఎలా సమర్థించుకుంటారని అడిగితే ఏమన్నారంటే.. ప్రజల తరఫున పోరాటం చేస్తున్నామని చెప్పుకుంటున్న అయినుద్దీన్ను ఈ హింసను ఎలా సమర్ధిస్తారని నేను ప్రశ్నించాను. 'ఇది పోరాటం. అందుకే ప్రజలు చనిపోతున్నారు' అని ఆయన ప్రశాంతంగా సమాధానమిచ్చారు. పౌరులకు హాని కలుగకుండా ఉండేందుకు సాధ్యమైనంత మేరకు తమ దళం ప్రయత్నం చేస్తోందని వివరించారు.

 
పోరాటాన్ని మొదలుపెట్టిందే తాలిబన్లు కదా అని నేను అడిగాను. 'కాదు' అని ఆయన సమాధానం ఇచ్చారు. 'మాకు ఒక ప్రభుత్వం ఉండేది. అది కూలిపోయింది. వాళ్లు(అమెరికన్లు) పోరాటాన్ని మొదలుపెట్టారు' అని పేర్కొన్నారు. పోరాటంలో తమదే పైచేయని, 2001 తర్వాత తమకు తొలిసారిగా ఆధిపత్యం వచ్చిందని అయినుద్దీన్‌తో పాటు అక్కడున్న తాలిబన్ బృందం భావిస్తోంది. 'వాళ్లు పాశ్చాత్య సంస్కృతిని వదులుకోవడం లేదు. కాబట్టి మేం వారిని చంపి తీరాలి' అని అయినుద్దీన్ అన్నారు. కాబుల్‌లో ఉన్నది 'తోలుబొమ్మ ప్రభుత్వం' అని విమర్శించారు.

 
మా సంభాషణ పూర్తయిన కొద్దిసేపటికే ఆ ప్రాంతంలో హెలికాప్టర్ల చప్పుడు వినిపించింది. హమ్వీతోపాటు తాలిబన్ ఫైటర్లు అక్కడి నుంచి వెంటనే వెళ్లిపోయారు. దీని అర్థం అఫ్గాన్ ఎయిర్‌ఫోర్స్ నుంచి తిరుగుబాటుదారులకు ముప్పు ఉందని. యుద్ధం ముగియడానికి ఇంకా చాలా సమయం ఉందని కూడా అర్థమవుతోంది. పురాతన మూలాలు కలిగిన పట్టణం బాల్ఖ్‌లో మేం ఉన్నాం. సుప్రసిద్ధ ఇస్లాం కవి జలాలుద్దీన్ రుమీ ఇక్కడే జన్మించారు.

 
ఈ ఏడాది ఆరంభంలో కూడా మేం ఇక్కడికి వచ్చాం. అప్పుడు ఈ ప్రాంతం ప్రభుత్వ ఆధీనంలోనే ఉంది. కానీ, చుట్టుపక్కల గ్రామాలు మాత్రం తాలిబన్ల ప్రాబల్యంలో ఉండేవి. ఇటీవల జరిగిన ఊహించని పరిణామాలతో తాలిబన్ల చేతిలోకి వెళ్లిన 200 జిల్లా కేంద్రాల్లో బాల్ఖ్ కూడా ఒకటి. ఉత్తర అఫ్గాన్‌పై ఉద్దేశపూర్వకంగానే దృష్టి సారించినట్లు తాలిబన్ సీనియర్ అధికారి ఒకరు చెప్పారు. తాలిబన్లపై వ్యతిరేకత ఉండటమే కాక ఆ ప్రాంతం వైవిధ్యతతో నిండివుండటం కూడా ఇందుకు కారణమని వెల్లడించారు.

 
తాలిబన్ ముఖ్య నాయకుల్లో ఎక్కువ మంది పస్తూన్ జాతికి చెందినవారు. మిగిలిన జాతుల వారికీ అవకాశం ఇచ్చామని సదరు అధికారి చెప్పారు. బాల్ఖ్‌లో రోజువారీ జీవితం ఎలా నడుస్తుందో మాకు ఆశ్రయమిచ్చిన స్థానిక తాలిబన్ నాయకుడు హజి హెక్మత్ చూపించారు. ఆ బజారు షాపింగ్ చేస్తున్న ఆడ, మగవాళ్లతో నిండివుంది.

 
స్థానికులు ఇచ్చిన సమాచారం ప్రకారం మగ వ్యక్తి తోడు లేకుండా ఆడవాళ్లు బయటకు రాకూడదని తెలిసింది. కానీ మేం బజారుకి వెళ్లినప్పుడు అలా అనిపించలేదు. మిగతాచోట్ల తాలిబన్ కమాండర్లు చాలా కఠినంగా ఉంటారని తెలిసింది. మేం చూసిన మహిళలందరూ జుట్టు, ముఖం కనిపించకుండా బుర్ఖాను ధరించారు. మేం ఎవరినీ 'బలవంతం' చేయలేదని హజీ హెక్మత్ నొక్కి చెప్పారు. మహిళలు ఎలాంటి దుస్తులు ధరించాలో మాత్రమే వారికి తాలిబన్ చెప్పిందని తెలిపారు.

 
కానీ, బుర్ఖా ధరించని మహిళలను పట్టణంలోకి తీసుకురావొద్దని ట్యాక్సీ డ్రైవర్లను తాలిబన్లు ఆదేశించారని నాకు తెలిసింది. బాల్ఖ్ నుంచి మేం వెళ్లిన ఓ రోజు తర్వాత సరైన దుస్తులు వేసుకోనందుకు ఓ యువతిని చంపినట్లు రిపోర్టులు వచ్చాయి. దానికి కారణం తాలిబన్ సభ్యులు కాదంటూ, ఆరోపణలను హాజీ హెక్మత్ ఖండించారు. బజారులోని ప్రతిఒక్కరు తాలిబన్ గ్రూపునకు మద్దతునిచ్చారు. వారి భద్రతను పెంచినందుకు కృతజ్ఞతలు తెలిపారు.

 
కానీ మా వెంట నిరంతరం తాలిబన్ ఫైటర్లు ఉండటం వల్ల నిజంగా వారు ఏం అనుకుంటున్నారో తెలుసుకోవడం కష్టంగా మారింది. తాలిబన్ నియమాలు, సంప్రదాయ అఫ్గాన్లను పోలి ఉన్నాయి. వారిప్పుడు పెద్ద సంఖ్యలో నగరాలను అదుపులోకి తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. గత వారం మజర్ ఇ షరీఫ్ మసీదు వద్ద పరిస్థితులు సాధారణంగా ఉన్నాయి. ప్రస్తుతం ఈ నగరం ప్రభుత్వ ఆధీనంలో ఉంది. నేను మాట్లాడిన ప్రతి ఒక్కరూ తాలిబన్ ఆక్రమణలపై ఆందోళన వ్యక్తం చేశారు. స్వేచ్ఛ, స్వాతంత్య్రాలతో పెరిగిన యువత ఇబ్బందులు ఎదుర్కుంటుందని చెప్పారు.

 
కానీ, బాల్ఖ్ జిల్లాలో తాలిబన్లు ఓ పోలీసు భవనం మినహా ఇతర ప్రభుత్వ భవనాలన్నింటినీ వారి ఆధీనంలోకి తీసుకున్నారు. ఆ భవనంలో తాలిబన్లపై పోరాడిన ఓ పోలీసు చీఫ్ ఉండేవారు. దాన్ని తిరుగుబాటుదారులు బాంబుతో పేల్చారు. ఫలితంగా కొంతభాగం ధ్వంసమైపోయింది. ఈ ఆపరేషన్ గురించి మాట్లాడుతున్నప్పుడు జిల్లా తాలిబన్ గవర్నర్ అబ్దుల్లా మంజూర్ మొహం వెలిగిపోయింది. అతని మనుషులు నవ్వారు. ఇక్కడ, అఫ్గానిస్తాన్లోని ఇతర ప్రాంతాల్లో జరుగుతున్న పోరాటం వ్యక్తిగతమైనది, సైద్ధాంతిక పరమైనదని ఆయన చెప్పారు.

 
తాలిబన్ల ఆధీనంలోకి వచ్చినా కొన్ని కార్యక్రమాలు మాత్రం అలానే కొనసాగుతున్నాయి. నారింజ రంగు దుస్తులు ధరించి వీధులు శుభ్రం చేసేవారు, కొందరు ఆఫీసర్లు విధులకు హాజరవుతున్నారు. వీరిని కొత్తగా నియమితులైన తాలిబన్ మేయర్ చూసుకుంటున్నారు. ఆయన టేబుల్‌కి ఓ వైపున ఇస్లామిక్ ఎమిరేట్ ఆఫ్ అఫ్గానిస్తాన్ అనే చిన్న జెండా ఉంది.

 
గతంలో ఆయన ఆయుధ సామగ్రి సరఫరాకు ఇంచార్జ్‌గా ఉండేవారు. ఇప్పుడు పన్నులను చూసుకుంటున్నారు. వ్యాపారులపై గత ప్రభుత్వం కంటే తక్కువ మొత్తంలో పన్నులు విధిస్తున్నామని ఆయన గర్వంగా నాతో చెప్పారు. మిలటరీ జీవితం నుంచి సాధారణ జీవితానికి ఇక్కడ మార్పులు జరుగుతున్నాయి. మాకు ఇంటర్వ్యూ ఇస్తున్న సమయంలో మేయర్ వెనుక ఓ తాలిబన్ తుపాకీ పట్టుకుని ఉన్నాడు. తాలిబన్లలో సీనియర్ నాయకులు రావడంతో అతను వారి వద్దకు వెళ్లాడు.

 
కొన్నిచోట్ల తిరుగుబాటుదారులు ఇస్లాం గ్రంథంలోని నియమాలకు కొత్త అర్థాలను ఇవ్వడం కనిపించింది. ఓ స్థానిక రేడియో స్టేషన్‌లో, ఇస్లామిక్ మ్యూజిక్‌తో పాటు సాధారణ సంగీతాన్ని ప్లే చేసేవారు. ఇప్పుడు కేవలం మత సంబంధిత గీతాలు మాత్రమే ప్లే చేస్తున్నారు. నిషేధిత సంగీతం ప్రజల్లో 'అసభ్యత'ను పెంచుతుందని హాజీ హెక్మత్ అన్నారు. అయితే, ఎవరికి వారు వారికి నచ్చిన సంగీతాన్ని వినే వీలుందని చెప్పారు. బజారులో ఎవరైనా పాటలు వింటూ దొరికితే, వారు ఎండలో సొమ్మసిల్లి పడిపోయే వరకూ చెప్పులు లేకుండా నడిపిస్తారని నాకు తెలిసింది. అలాంటి సంఘటనలేవీ జరగలేదని హాజీ హెక్మత్ చెప్పారు.

 
మేం అక్కడి నుంచి బయల్దేరే సమయంలో మాకు గడ్డాలు లేవని ఆయన తన మనుషులకు సైగ చేశారు. 'చూడండి! మేం ఎవరినీ ఒత్తిడి చేయడం లేదు' అంటూ నవ్వారు. ప్రపంచం దృష్టిలో తాము కూడా మంచివారిమనే ముద్ర వేసుకోవాలని తాలిబన్లు తాపత్రయపడుతున్నారు. కానీ, దేశంలోని ఇతర ప్రాంతాల్లో కఠిన నిబంధనలు ఉన్నాయి. స్థానిక కమాండర్లను బట్టి ఈ తేడాలు ఉంటున్నాయి. ఇదివరకు తాలిబన్లు అధికారంలో ఉన్నప్పుడు షరియా చట్టం ప్రకారం క్రూరమైన శిక్షలను విధించేవారు.

 
గత నెలలో దక్షిణాదిలోని హెల్మండ్ ప్రావిన్సులో ఓ పిల్లాడిని ఎత్తుకుపోయినందుకు ఇద్దరు వ్యక్తులకు ఉరి శిక్ష విధించారు. బాల్ఖ్‌లో ఉన్నప్పుడు ఒక కోర్టులో కేసు విచారణకు మేం వెళ్లాం. అక్కడ జరుగుతున్న కేసులన్నీ భూమి వివాదాలకు సంబంధించినవే. అక్కడ చాలామంది వారు చేసే న్యాయం గురించి భయపడుతున్నారు. ఇంకొందరు గత ప్రభుత్వంలో ఉన్న అవినీతి కంటే ఇదే నయమని అభిప్రాయపడ్డారు. నా కేసును ఓ కొలిక్కి తెచ్చుకునేందుకు గత ప్రభుత్వానికి చాలా మొత్తంలో లంచాలు ఇవ్వాల్సివచ్చింది అని ఓ వ్యక్తి చెప్పారు.

 
తాను జడ్జిగా నియమితులైన నాలుగు నెలల్లో ఎవరికీ ఉరి శిక్ష విధించలేదని న్యాయమూర్తి హాజీ బద్రుద్దీన్ చెప్పారు. తీర్పులపై కోర్టులకు అప్పీల్ చేసుకునే అవకాశం ఉందని వెల్లడించారు. అయితే, కఠినమైన శిక్షలను ఆయన సమర్ధించారు. 'మా షరియాలో పెళ్లి కాకుండా శృంగారంలో పాల్గొనే బాలికలు లేదా బాలురకు 100 కొరడా దెబ్బలను శిక్షగా విధిస్తాం' అని చెప్పారు. 'అదే పెళ్లి చేసుకున్న వారు వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంటే చనిపోయే వరకు రాళ్లతో కొడతాం. దొంగతనం చేసినట్లు నిర్ధారణ అయితే చేయి నరికేస్తాం' అని పేర్కొన్నారు.

 
ఆధునిక ప్రపంచంతో పోలిన శిక్షల అమలుకు ఆయన ఒప్పుకోలేదు. 'పిల్లలు అపహరణకు గురవుతున్నారు. ఇది బాగుందా? లేదా ఓ వ్యక్తి చేయి నరికేసి, మిగతా వారిని కూడా సరిచేయడం బాగుందా?' అని ప్రశ్నించారు. ప్రస్తుతానికి తాలిబన్లు విజృంభిస్తున్నా, అఫ్గానిస్తాన్‌లోని పెద్ద నగరాలు ప్రభుత్వ ఆధీనంలోనే ఉన్నాయి. రానున్న నెలల్లో ఆధిపత్యం కోసం రెండు వర్గాలు పోటీ పడతాయి. ఫలితంగా హింస పెద్ద ఎత్తున చెలరేగడానికి ఆస్కారం ఉంది.

 
తాలిబన్లు ఖచ్చితంగా గెలుస్తారా? అని నేను అడిగిన ప్రశ్నకు హాజీ హెక్మత్ 'అవును' అని సమాధానం ఇచ్చారు. 'శాంతి చర్చలు సఫలం కాకపోతే మేమే గెలుస్తాం, అదే దేవుడికి ఇష్టం' అని అన్నారు. చర్చలు ఆగిపోయాయి. ఇస్లామిక్ ప్రభుత్వాన్ని సృష్టించాలన్న డిమాండ్ ద్వారా ప్రత్యర్థులు లొంగిపోవాలని తాలిబన్లు స్పష్టం చేస్తున్నారు. 'మేం విదేశీయులను ఓడించాం. ఇప్పుడు అంతర్గత శత్రువులను కూడా ఓడించాం' అని హాజీ పేర్కొన్నారు.