గురువారం, 5 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Modified: సోమవారం, 22 ఆగస్టు 2022 (20:38 IST)

అమిత్ షా - జూనియర్ ఎన్టీఆర్: అప్పుడు ఆర్ఆర్ఆర్ సినిమాను అడ్డుకుంటామన్నారు, ఇప్పుడు ఎన్టీఆర్‌ను అమిత్ షా మెచ్చుకున్నారు...

ntr - amit shah
రాజమౌళి దర్శకత్వం వహించిన ఆర్‌ఆర్‌ఆర్ సినిమా ఫస్ట్ లుక్ విడుదలైన సమయంలో తెలంగాణకు చెందిన బీజేపీ నేతలు కొందరు అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ సినిమాలో కొమురం భీం పాత్రను చిత్రీకరించిన తీరుపై ఆ బీజేపీ నేతలు అభ్యంతరం వ్యక్తంచేశారు. ఆర్ఆర్ఆర్ సినిమాలో ఈ పాత్రను జూనియర్ ఎన్టీఆర్ పోషించారు. ఆదిలాబాద్ నియోజకవర్గం నుంచి గెలిచిన బీజేపీ ఎంపీ సోయం బాపురావు అప్పట్లో ఈ సినిమా ప్రదర్శిస్తే థియేటర్లకు నిప్పు పెడతామని కూడా హెచ్చరించారు.

 
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కూడా "గిరిజనుల మనోభావాలను గాయపరుస్తున్నారు" అని ఈ సినిమాపై అప్పట్లో ఆరోపణలు చేశారు. నిమాలోని కొన్ని దృశ్యాల్లో భీం టోపీ ధరించి ముస్లింలా కనిపిస్తారు. కొమురం భీం పాత్రను ఇలా చూపించడంపై తెలంగాణ బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. కానీ, తాజాగా కేంద్ర హోం మంత్రి, బీజేపీ కీలక నేత అమిత్ షా తన తెలంగాణ పర్యటనలో జూనియర్ ఎన్టీఆర్‌తో భేటీ అయ్యారు. మునుగోడు నియోజకవర్గ ఉపఎన్నిక ప్రచారంలో భాగంగా ఆదివారం వచ్చిన అమిత్ షా... జూనియర్ ఎన్‌టీ‌ఆర్‌తో కలిసి డిన్నర్ చేశారు.

 
ఆర్ఆర్ఆర్ సినిమాలో ఆయన నటన నచ్చి ఆయన్ను ప్రశంసించేందుకే కలిసినట్లు బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. వీరిద్దరి సమావేశం ట్విటర్‌లో రెండు రోజులుగా ట్రెండింగ్‌లో ఉంది. ఇప్పటి వరకు ఈ విషయం పై #AmitShahWithNTR అనే హ్యాష్ ట్యాగ్‌తో లక్షల్లో ట్వీట్లు వైరల్ అయ్యాయి. వీరి సమావేశంపై రాజకీయ ఊహాగానాలూ మొదలయ్యాయి.

 
ఒకప్పుడు తెలంగాణ బీజేపీ నేతల నుంచి విమర్శలు ఎదుర్కొన్న సినిమా కథా రచయితను ఇటీవల బీజేపీ రాజ్యసభకు పంపించడం.. ఇప్పుడు ఆ సినిమా నటుడికి ప్రత్యేకంగా పిలిపించి ప్రశంసించడంపై చర్చ జరుగుతోంది. జూనియర్ ఎన్టీఆర్‌తో సమావేశానికి సంబంధించిన ఫోటోలను అమిత్ షా స్వయంగా ట్వీట్ చేశారు. 'అత్యంత ప్రతిభావంతుడైన నటుడు, మన తెలుగు సినిమా తారక రత్నం అయిన జూనియర్ ఎన్టీఆర్‌తో ఈ రోజు హైదరాబాద్‌లో కలిసి మాట్లాడడం ఆనందంగా ఉంది' అని ఈ ట్వీట్ లో పేర్కొన్నారు. జూనియర్ ఎన్‌టీఆర్ కూడా ఆయన ట్వీట్‌కు స్పందిస్తూ "మిమ్మల్ని కలవడం చాలా ఆనందంగా ఉంది. ఆసక్తికరమైన సంభాషణ జరిగింది. మీ అభిమానానికి ధన్యవాదాలు" అంటూ ఎన్ టీ ఆర్ సమాధానమిచ్చారు.

 
ఈ సమావేశం రానున్న తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో జరిగిందా?
అమిత్ షా జూనియర్ ఎన్‌టీఆర్‌ను కలవడం పట్ల చాలా చర్చ జరుగుతోంది. దీనిని విశ్లేషకులు అనేక కోణాల్లో చూస్తున్నారు. ఆర్ ఆర్ ఆర్ సినిమాలో ఎన్‌టీఆర్ పోషించిన గిరిజన నాయకుడు భీమ్ పాత్రను ప్రశంసించేందుకే అని కొంత మంది అంటున్నారు. ఇదే విషయాన్నిహై లైట్ చేస్తూ బీజీపీ ఎస్‌టీ మోర్చా కూడా ట్వీట్ చేసింది. ఇది మాత్రమే కాకుండా వీరి సమావేశానికి రాజకీయ కోణం ఉందనే వాదన కూడా వినిపిస్తోంది.

 
ఉత్తరాదిలో బీజేపీ హవా కొనసాగుతోంది. బీజేపీ దక్షిణాదిలో కూడా తన ప్రాచుర్యాన్ని పెంచుకోవాలని చూస్తోంది. బీజేపీ తెలంగాణపై దృష్టి పెట్టింది. 2023లో తెలంగాణాలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అమిత్ షా జూనియర్ ఎన్‌టీఆర్ ను కలవడం పట్ల అనేక ఊహాగానాలు వస్తున్నాయి. పలువురు ప్రముఖులు, విలేఖరులు వీరి సమావేశం గురించి ట్వీట్ చేశారు.

 
"భారత రాజకీయాల్లో కొత్త శకం మొదలుకాబోతోంది" అని అంటూ దైనిక్ భాస్కర్ విలేఖరి దేవాంశు మణి తివారీ ట్వీట్ చేశారు. తెలంగాణాలో బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి‌ని కేంద్ర హోం మంత్రి కలిశారు అని అంటూ డాక్టర్ ఉజ్వల్ కుమార్ ఘటక్ ట్వీట్ చేశారు. "ఈ విధానాన్ని అవలంబించి గెలవాలని అనుకుంటున్నారు. మీరు గెలవలేరు" అని అంటూ రాహుల్ తివారీ అనే యూజర్ ట్వీట్ చేశారు. "ఏం జరుగుతోంది? ఆంధ్రాలో అడుగుపెట్టేందుకు బీజేపీ జూనియర్ ఎన్‌టీ‌ఆర్ ట్రంప్ కార్డును వాడుతోందా? అని అంటూ టైమ్స్ ఆఫ్ ఇండియా ఇన్వెస్టిగేషన్స్ ఎడిటర్ సుధాకర్ ఉడుముల ట్వీట్ చేశారు.

 
"మొదట సన్నీ డియోల్‌ను పార్టీలోకి తీసుకున్నారు. ఇప్పుడు జూనియర్ ఎన్‌టీఆర్‌ను తీసుకుంటారు. డియోల్ కుటుంబానికి రాజకీయాల్లోకి వచ్చే ఆసక్తి లేదని అందరికీ తెలుసు. కానీ, వాళ్లు మోదీ-షా ఒత్తిడి వల్లే రాజకీయాల్లోకి వచ్చారు. ఎన్‌‌టీఆర్‌తో ఇదే విధానం పని చేయదు" అని అంటూ నదీమ్ అహ్మద్ అనే యూజర్ ట్వీట్ చేశారు. "జూనియర్ ఎన్‌టీ‌ఆర్‌కి ఉన్న పేరును తమ ప్రయోజనాలకు వాడుకోవాలని అమిత్ షా చూస్తున్నారు" అని మరొక యూజర్ ట్వీట్ చేశారు.

 
జూనియర్ ఎన్టీఆర్ తెలుగు దేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు మనవడు. ఆయన 2009 సాధారణ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరుపున ప్రచారం చేశారు. కానీ, ఆ తర్వాత నుంచి ఆయన రాజకీయాలకు దూరంగానే ఉన్నారు. 2009 తర్వాత ఆయన ఎటువంటి రాజకీయ కార్యక్రమంలో కనిపించలేదు. టీడీపీ నాయకులతో కానీ, సమావేశాల్లో కానీ పాల్గొనలేదు. ఒక యూజర్ ‘రాజకీయ గురువు బాక్స్ ఆఫీస్ గురువుతో సమావేశమయ్యారు’ అని అంటూ ట్వీట్ చేశారు. ఆర్‌ఆర్‌ఆర్ సినిమాలో నటనను ప్రశంసించేందుకు జూనియర్ ఎన్‌టీఆర్‌ను కలిసారని చెప్పడం భీం జెన్నీని కలిసేందుకు స్కాట్ ప్యాలెస్ కు వెళ్లానని చెప్పడమంత నిజం" అని అంటూ కార్తీక్ దయానంద్ అనే బ్లాగర్ ట్వీట్ చేశారు.

 
"దక్షిణాది సినిమాకు ఆదరణ పెరుగుతోంది. అమిత్ షా జూనియర్ ఎన్ టీ ఆర్ ను కలిశారు. ఇది బాలీవుడ్ కు హెచ్చరిక" అని రాజేష్ సాహు అనే యూజర్ ట్వీట్ చేశారు."రెండు పులులు భోజన సమావేశంలో కలవబోతున్నాయి" అని అంటూ ఆంధ్ర ప్రదేశ్ బీజేపీ సెక్రెటరీ రమేష్ నాయుడు నాగోతు ట్వీట్ చేశారు. దక్షిణాదిలో మంచి ఆదరణ ఉన్న నటుల్లో జూనియర్ ఎన్టీఆర్ కూడా ఒకరు. రాజమౌళి దర్శకత్వం వహించిన ఆర్‌ఆర్‌ఆర్ సినిమా ఈ ఏడాది బాక్స్ ఆఫీసు దగ్గర భారీ విజయాన్ని సాధించింది. ఈ సినిమాలో రామ్ చరణ్, జూనియర్ ఎన్‌టీఆర్ ప్రధాన పాత్రల్లో నటించారు.