మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Modified: ఆదివారం, 2 మే 2021 (11:37 IST)

ఆస్ట్రేలియా వార్నింగ్: భారత్ నుంచి వస్తే అయిదేళ్ల జైలు, భారీ జరిమానా

భారత్‌లో కరోనావైరస్ మహమ్మారి విజృంభణ నేపథ్యంలో భారత్ నుంచి తమ దేశంలోకి ప్రయాణాలను ఆస్ట్రేలియా ఇటీవల తాత్కాలికంగా నిషేధించింది. గత వారం భారత్ నుంచి అన్ని విమానాలను రద్దు చేసింది. భారత్‌లో చిక్కుకుపోయిన ఆస్ట్రేలియా పౌరులు ఎవరైనా ఈ నిషేధాజ్ఞలను మీరి స్వదేశంలోకి ప్రవేశిస్తే, గరిష్ఠంగా ఐదేళ్ల జైలు శిక్ష, జరిమానాలు పడే అవకాశముంది.

 
భారత్‌లో కోవిడ్19 బారిన పడి క్వారంటైన్‌లో ఉన్న ప్రజల సంఖ్యను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకొన్నట్లు ఆస్ట్రేలియా ఆరోగ్య శాఖ చెప్పింది. భారత్‌లో తొమ్మిది వేల మంది ఆస్ట్రేలియన్లు ఉన్నట్లు అంచనా. వీరిలో 600 మందిని ముప్పు తీవ్రత ఎక్కువగా ఉన్నవారిగా పరిగణిస్తున్నారు. ఆస్ట్రేలియన్లు ఆస్ట్రేలియాకు తిరిగి వస్తే వారిని నేరస్థులుగా పరిగణించడం ఇదే మొదటిసారని ఆస్ట్రేలియా మీడియా చెబుతోంది.

 
భారత్ నుంచి వచ్చేవారితో ఎదురయ్యే ముప్పుకు తగినట్లుగా కాకుండా ఎక్కువ తీవ్రమైన చర్యను ప్రభుత్వం తీసుకొంటోందని ఒక డాక్టర్ ఏబీసీ మీడియా సంస్థతో వ్యాఖ్యానించారు. “మన కుటుంబాల ప్రాణాలకు భారత్‌లో ముప్పు ఎదురవుతోంది. వారికి అక్కడి నుంచి బయటపడే మార్గం లేకుండా చేయడమంటే వారి చావుకు వారిని వదిలేయడమే అవుతుంది” అని జనరల్ ప్రాక్టీషనర్, ఆరోగ్య అంశాల విశ్లేషకులు డాక్టర్ వ్యోమ్ షార్మర్ వ్యాఖ్యానించారు.

 
ఆస్ట్రేలియాకు చేరుకోదలచిన తేదీకి 14 రోజుల ముందు వరకు భారత్‌లో ఉన్న వారిని ఆస్ట్రేలియాలోకి ప్రవేశించకుండా మే 3 నుంచి ప్రభుత్వం నిషేధాన్ని అమలు చేయనుంది. ఈ నిబంధనను ఉల్లంఘిస్తే ఐదేళ్ల వరకు జైలు శిక్ష లేదా 66 వేల ఆస్ట్రేలియా డాలర్ల (సుమారు 37.8 లక్షల రూపాయలు) జరిమానా, లేదా రెండూ విధిస్తామని ఆరోగ్యశాఖ హెచ్చరించింది. ఈ నిర్ణయాన్ని మే 15న సమీక్షిస్తామని చెప్పింది.

 
ఇలాంటి నిర్ణయాలను ప్రభుత్వం తేలిగ్గా తీసుకోదని ఆరోగ్యశాఖ మంత్రి గ్రెగ్ హంట్ ఒక ప్రకటనలో చెప్పారు. ఆస్ట్రేలియా ప్రజల ఆరోగ్యాన్ని, క్వారంటైన్ వ్యవస్థలను కాపాడుకోవడం, క్వారంటైన్ కేంద్రాల్లో కోవిడ్ కేసులను మేనేజ్ చేయగల స్థాయికి పరిమితం చేయడం తమకు ముఖ్యమని మంత్రి తెలిపారు. వెంటిలేటర్లు, పీపీఈ కిట్లు సహా అత్యవసర వైద్యసామగ్రిని భారత్‌కు పంపిస్తామని, ఈ మేరకు రెండు దేశాలూ ఒక అంగీకారానికి వచ్చాయని ఆరోగ్యశాఖ తెలిపింది. భారత ప్రజలకు, ఇండియన్-ఆస్ట్రేలియన్ సమూహానికి తమ సానుభూతిని తెలియజేస్తున్నామని చెప్పింది.

 
2020 ఫిబ్రవరి నుంచి కరోనావైరస్‌ వ్యాప్తిని నియంత్రించేందుకు ఆస్ట్రేలియా పెద్దయెత్తున చర్యలు చేపడుతూ వస్తోంది. అత్యధిక దేశాల కన్నా ఆస్ట్రేలియాలో కోవిడ్ మరణాలు తక్కువగా ఉన్నాయి. ఇన్‌ఫెక్షన్ రేటు సున్నాకు దగ్గరగా ఉంది. అయితే కఠినమైన లాక్‌డౌన్‌ల వల్ల చాలా మంది ఆస్ట్రేలియన్లు విదేశాల్లో చిక్కుకుపోయారు.

 
హక్కులకు హామీ లేదు: బీబీసీ ప్రతినిధి విశ్లేషణ
ఆస్ట్రేలియా పౌరులు విదేశాల్లో కష్టాల్లో ఉన్నప్పుడు వారికి సహాయం అందించాలని, రక్షణ కల్పించాలని ఆస్ట్రేలియా పాస్‌పోర్టులో రాసి ఉంటుందని సిడ్నీలోని బీబీసీ ప్రతినిధి ఫ్రాన్సెస్ మావో ప్రస్తావించారు. ఆస్ట్రేలియన్లు స్వేచ్ఛగా స్వదేశానికి తిరిగి వెళ్లాలంటే కూడా ఇన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఎవరూ ఊహించి ఉండరని వ్యాఖ్యానించారు. స్వదేశానికి తిరిగి రావడం, వచ్చి అక్కడే బతకడం పౌరసత్వంలో ప్రాథమిక అంశాలని తెలిపారు. స్వదేశానికి తిరిగి వచ్చే హక్కును అంతర్జాతీయ చట్టంలోనూ గుర్తించారని, ‘యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్‌’లో పొందుపరచారని చెప్పారు.

 
విదేశాల్లో చిక్కుకుపోయిన ఆస్ట్రేలియన్లకు ఎదురయ్యే ముఖ్యమైన సమస్య ఏమిటంటే- “ఆస్ట్రేలియా కోర్టుల్లో ఐక్యరాజ్యసమితి ఒప్పందాన్ని కూడా తమకు మద్దతుగా చూపించలేరు. పౌరసత్వ హక్కులు, అనేక స్వేచ్ఛల విషయంలో వారికి ఆస్ట్రేలియా చట్టం హామీ ఇవ్వదు. ఆస్ట్రేలియాకు మానవ హక్కుల చార్టర్‌ లేదు. రాజ్యాంగంలో స్పష్టమైన రక్షణ ఏర్పాట్లు కూడా లేవు.

 
అత్యవసర పరిస్థితుల్లో రాత్రికి రాత్రి ఏ చర్యనయినా ప్రభుత్వం నేరంగా పరిగణిస్తూ నిర్ణయం తీసుకోగలదు. నిరుడు కరోనావైరస్ వ్యాప్తి తీవ్రస్థాయిలో ఉన్న సమయంలో-బయోసెక్యూరిటీ యాక్ట్‌ను ప్రభుత్వం బలోపేతం చేసింది. పార్లమెంటును కూడా బైపాస్ చేస్తూ నిర్ణయాలు తీసుకొనే అపరిమిత అధికారాలను ఆరోగ్యశాఖ మంత్రికి కట్టబెట్టింది.

 
ఈ కారణాల వల్లే- ఇప్పుడు భారత్‌లో ప్రమాదకర పరిస్థితుల్లో చిక్కుకుపోయిన ఆస్ట్రేలియన్లు స్వదేశానికి తిరిగి వెళ్తే జైలు పాలయ్యే పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రభుత్వం విధించిన రెండు వారాల నిషేధంపై న్యాయపోరాటం చేయాలంటే సమయం పడుతుంది. పైగా, అది ఖర్చుతో కూడుకున్నది కూడా! ప్రజాగ్రహం, ఒత్తిడే ప్రస్తుత సమస్యకు ప్రభావవంతమైన పరిష్కార మార్గాలు కావొచ్చు” అని ఫ్రాన్సెస్ మావో విశ్లేషించారు.