గురువారం, 5 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Modified: గురువారం, 24 ఆగస్టు 2023 (15:14 IST)

చంద్రయాన్-3: ల్యాండింగ్ సమయంలో 18వ నిమిషంలో ఏం జరిగింది... ఇస్రో సైంటిస్టులు 30 సెకన్ల పాటు ఎందుకు వణికిపోయారు?

chandrayaan-3
చంద్రుడి దక్షిణ ధ్రువం మీద చంద్రయాన్-3 ల్యాండర్ విక్రమ్ విజయవంతంగా కాలుమోపింది. ఈ చరిత్రాత్మక ఘట్టాన్ని భారత్‌తోపాటు ప్రపంచ దేశాలన్నీ చాలా జాగ్రత్తగా గమనించాయి. అయితే, ల్యాండింగ్‌లో ఒక 30 సెకన్లు మాత్రం ఇస్రో శాస్త్రవేత్తలను గజగజ వణికించాయి. ఈ ప్రాజెక్టు విజయంపైన ఆ దశలో ఇస్రో శాస్త్రవేత్తలను ఆందోళనకు గురి చేసిన ఆ 30 సెకన్లలో ఏం జరిగింది?
 
అసలేం జరిగింది?
చంద్రుడి తలం మీద 800 మీటర్లకు వచ్చేవరకూ విక్రమ్‌ ల్యాండింగ్ ప్రక్రియలన్నీ సవ్యంగానే జరిగినట్లు విజ్ఞాన్ ప్రసార్ సీనియర్ సైంటిస్టు టీవీ వెంకటేశ్వరన్ చెప్పారు. ‘‘అప్పటివరకూ అన్నీ ముందుగా ఊహించినట్లే జరిగాయి. అయితే, 150 మీటర్ల ఎత్తులోకి వచ్చినప్పుడు కిందకు దిగబోయే ప్రాంతంలో ఒక అడ్డంకి ఉన్నట్లుగా ల్యాండర్ గుర్తించింది’’ అని ఆయన అన్నారు. ‘‘ఆ అడ్డంకిని గుర్తించిన వెంటనే ల్యాండర్ తన దిశను మార్చుకుంది. ల్యాండింగ్‌కు ఆ పక్కనే ఉన్న మరో చోటును ఎంచుకుంది’’ అని ఆయన తెలిపారు.
 
‘‘లైవ్ చూసేవారికి అది అర్ధం కాకపోవచ్చు. ఎందుకంటే ఇక్కడ అన్నీ చకచకా జరిగిపోయాయి’’ అని ఆయన చెప్పారు. ‘‘సరిగ్గా ల్యాండ్ కాబోతున్న సమయంలో ఆ అడ్డంకి కనపడటంతో మేం షాక్‌కు గురయ్యాం’’ అని సీనియర్ సైంటిస్టు టీవీ వెంకటేశ్వరన్ తెలిపారు. ‘‘ఆటోమాటిక్ ల్యాండింగ్ సీక్వెన్స్ కమాండ్ ఇచ్చేందుకు ముందు నాలుగు నిమిషాల నుంచే ల్యాండింగ్‌కు సన్నాహాలు మొదలయ్యాయి. వీటికి ల్యాండింగ్ 15 నిమిషాలను కలిపితే మొత్తంగా 19 నిమిషాలు అవుతుంది. అప్పుడు 18వ నిమిషంలో ఈ సమస్య తలెత్తింది. దీన్ని విక్రమ్ ల్యాండర్ పరిష్కరించుకొంది’’ అని ఆయన చెప్పారు.
 
అయితే, ఈ మార్పుల వల్ల ల్యాండింగ్‌కు మరో 30 సెకన్లు అదనంగా పట్టినట్లు ఆయన తెలిపారు. బెంగళూరులోని ఇస్రో టెలికమ్యూనికేషన్స్‌ సెంటర్‌లో మిగతా శాస్త్రవేత్తలతోపాటు ఆ మార్పులను ఆయన జాగ్రత్తగా గమనించారు. మొత్తానికి ఆ సమస్య పరిష్కారం కావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ‘‘ఆ సమయంలో ల్యాండింగ్ వేగం మారింది. ఆ తరువాత అది సురక్షితంగా చంద్రుడి మీద కాలు మోపింది. దీని బట్టి ల్యాండర్‌లోని సెన్సర్లు, గైడెన్స్ ఎక్విప్‌మెంట్, డ్యామేజ్ డిటెక్షన్ ఎక్విప్‌మెంట్.. ఇలా అన్నీ చక్కగా పనిచేస్తున్నట్లు తెలుస్తోంది’’ అని ఆయన చెప్పారు.
 
రోవర్ ఏం చేస్తుంది?
ల్యాండింగ్ వల్ల విక్రమ్‌లో భాగాలపై ఎలాంటి ప్రభావం పడింది? ప్రస్తుతం వాటి పరిస్థితి ఏమిటి లాంటి వివరాలను డేటాను విశ్లేషించడం ద్వారా తెలుస్తుంది. విక్రమ్ ల్యాండర్ నుంచి రోవర్ బయటకు రావడంపై టీవీ వెంకటేశ్వరన్ మాట్లాడుతూ.. ‘‘ల్యాండర్ డోర్ తెరచుకున్న రెండు గంటల్లో సోలార్ ప్యానెల్స్‌ ఏర్పాట్లు పక్రియ పూర్తవుతుంది. ఆ తర్వాత రోవర్ బయటకు వస్తుంది’’ అని రోవర్ బయటకు వచ్చే ముందు చెప్పారు. ‘‘రోవర్ బయటకు వచ్చిన తర్వాత, గంట సేపు ఎండలో చార్జింగ్ పెట్టుకుంటుంది. ఆ తర్వాత ఫోటోలు తీస్తుంది. వీటి కోసం ప్రపంచం మొత్తం ఎంతో ఉత్కంఠతో ఎదురుచూస్తోంది. ల్యాండర్‌కు రోవర్, రోవర్‌కు ల్యాండర్ ఫోటోలు తీసుకోవడం పూర్తయితే, ఈ ప్రయోగం వంద శాతం విజయవంతమైనట్లుగా చెప్పుకోవచ్చు’’ అని ఆయన చెప్పారు. ఇప్పటివరకు 95 శాతం ప్రయోగం విజవంతమైందని సతీశ్ ధవన్ స్పేస్ రీసెర్చ్ సెంటర్ డాక్టర్ ఎస్ పాండియన్ అన్నారు.
 
ఇస్రో మైలురాయి..
చంద్రయాన్-3 ప్రయోగంతో ఇస్రో కీలకమైన మైలురాయిని అధిగమించింది. దీంతో చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండింగ్‌ను విజయవంతంగా పూర్తిచేసిన నాలుగో దేశంగా భారత్ రికార్డు సృష్టించింది. అంతేకాదు చంద్రుడి దక్షిణ ధ్రువ ప్రాంతంలో అడుగు మోపిన తొలి దేశం కూడా భారతే. బుధవారం సాయంత్రం 5.47కు మొదలైన ఈ ల్యాండింగ్ ప్రక్రియ ఆ తర్వాత 15 నిమిషాల్లో విజయవంతంగా పూర్తైంది. ఈ విషయాన్ని ట్విటర్ వేదికగా ఇస్రో ప్రకటించింది. ‘‘చంద్రయాన్-3, నా లక్ష్యాన్ని నేను చేరుకున్నాను, అలానే మీ లక్ష్యాలను కూడా పూర్తిచేశాను’’ అని ఇస్రో ఒక ట్వీట్ చేసింది. చంద్రయాన్-1 ప్రయోగం 2008లో నిర్వహించారు. అప్పటి నుంచే సాఫ్ట్‌ ల్యాండింగ్ కోసం ప్రయత్నాలు మొదలయ్యాయి. మొత్తానికి 15 ఏళ్ల తర్వాత ఆ కల సాకారమైంది.