దిల్లీ హింస: 'ప్రేమికుల దినోత్సవం రోజు పెళ్ళి చేసుకున్నాడు... 11 రోజులకే అల్లర్లలో చనిపోయాడు"
అష్ఫాక్ హుస్సేన్
పెళ్లైన 11 రోజులకే మృతి ( అష్ఫాక్ హుస్సేన్, 24, ముస్తఫాబాద్). 24 ఏళ్ల అష్ఫాక్ హుస్సేన్‌కు ప్రేమికుల దినోత్సవం రోజున (ఫిబ్రవరి 14) వివాహమైంది. ఆ తర్వాత 11 రోజులకే ఈశాన్య దిల్లీలో చెలరేగిన మతపరమైన అల్లర్లలో తుపాకీ తూటాలకు ఆయన బలయ్యారు. మృతుడి పెద్దమ్మ హజరా బుధవారం ఆస్పత్రి దగ్గర గుండెలవిసేలా రోధిస్తున్నారు.
ఫిబ్రవరి 25న సాయంత్రం అష్ఫాక్‌ను ఐదుసార్లు కాల్చారని, అందులో మూడు తాటాలు ఛాతీలోకి దిగాయని ఆమె బీబీసీతో చెప్పారు. వృత్తి రీత్యా ఎలక్ట్రీషియన్ అయిన అష్ఫాక్... సాయంత్రం పని ముగించుకుని ఇంటికి వస్తుండగా ముస్తఫాబాద్ సమీపంలో తుపాకీ కాల్పులకు గురయ్యారు. అష్ఫాక్, అతని సోదరుడు ముహషీర్‌ల సంపాదనే వారి కుటుంబానికి ఆధారం.
"మావాడు ఏం తప్పుడు చేశాడు? ఇప్పుడు అతని భార్య పరిస్థితి ఏంటి? ఆమెను ఎవరు ఆదుకుంటారు?" అని హజరా ప్రశ్నిస్తున్నారు. ఆ ప్రశ్నలకు ఎవరి దగ్గరా సమాధానాలు లేవు. జీటీబీ ఆస్పత్రిలోని శవాగారం వెలుపల వేచిచూస్తున్న మోను కుమార్... షాక్ నుంచి ఇంకా తేరుకోలేదు. ఆయన, తన 51 ఏళ్ల తండ్రి వినోద్ కుమార్‌తో కలిసి మెడికల్ షాపు నుంచి ఇంటికి వెళ్తుండగా ఘోండా ప్రాంతంలో వారిపై దాడి జరిగింది.
"అల్లాహూ అక్బర్" అంటూ పెద్దఎత్తున నినాదాలు చేస్తూ వచ్చిన ఓ గుంపు... తమపై రాళ్లు, కత్తులతో వారిపై దాడి చేసిందని మోను కుమార్ చెప్పారు. తీవ్ర గాయాలతో మోను కుమార్ ప్రాణాలతో బయటపడ్డారు. కానీ, ఆయన తండ్రి వినోద్ కుమార్ అక్కడికక్కడే చనిపోయారు. తమ ద్విచక్ర వాహనానికి నిప్పు పెట్టి కాల్చేశారని మోను కుమార్ తెలిపారు.
కాల్చి చంపారు (పర్వేజ్ ఆలం, 50, ఉత్తర ఘోండా)
50 ఏళ్ల స్తిరాస్థి ఏజెంటు పర్వేజ్ ఫిబ్రవరి 24న రాత్రి ఉత్తర ఘోండా ప్రాంతంలోని తన ఇంటి ముందే కాల్పులకు గురయ్యారు. వెంటనే అంబులెన్సు రాకపోవడంతో ఆయన్ను బైకు మీద ఆస్పత్రికి తీసుకెళ్లా ఆయన కుమారుడు చెప్పారు. తీవ్ర రక్తస్రావం అవ్వడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పర్వేజ్ చనిపోయారు.
తన తండ్రిపై దాడి జరిగినప్పుడు పోలీసులు రాలేదని, గంట తర్వాత అంబులెన్సు వచ్చిందని మృతుడి కుమారుడు మొహమ్మద్ షాహిల్ చెప్పారు. "గొడవలు అవుతున్నాయి ఇంటి నుంచి బయటికి వెళ్లకు అని మా నాన్నకు చెప్పాను. ఏమీ కాదంటూ ఆయన అలాగే వెళ్లారు. కానీ, మా ఇంటి ముందే ఆయన్ను కాల్చారు" అని షాహిల్ వివరించారు.
"మేమంతా ఇక్కడి పరిసర ప్రాంతాల్లోనే ఉంటాం. కానీ, ఈ నాయకుల రెచ్చగొట్టే వ్యాఖ్యల తర్వాత ఇప్పుడు మేమంతా శత్రువులమయ్యాం. వారిలో చాలామంది నా స్కూలు స్నేహితులు ఉన్నారు. అందరం కలిసి తిన్నాం. అనేక ఏళ్ల మా స్నేహాన్ని వాళ్లు ఒక్క నిమిషంలో మరచిపోయారు. ఇక్కడ ఏం జరుగుతోంది?" అని రోధిస్తూ షాహిల్ అడుగుతున్నారు. వారి స్వస్థలం ఉత్తర్‌ప్రదేశ్‌లోని బులంద్‌షహర్. ఈ అల్లర్ల కారణంగా తన తండ్రి అంత్యక్రియలకు వచ్చేందుకు కూడా తమ బంధువులు భయపడుతున్నారని షాహిల్ అంటున్నారు.