శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Modified: శుక్రవారం, 4 అక్టోబరు 2019 (13:26 IST)

హిందీ భాషా వివాదం: సంస్కృతం - హిందీ - తమిళం - తెలుగు, ఏది ప్రాచీన భాష? ఏ భాష మూలాలు ఏమిటి?

భాష అనేది ప్రజల దైనందిన వ్యవహారాల్లో సమాజ సమాచార సంబంధాల్లో ప్రభుత్వ పాలనా వ్యవహారాల్లో చాలా ప్రధానమైనది. అంతేకాదు.. సంస్కృతీ వారసత్వ సంపదల్లో మాతృభాషకు అగ్రస్థానం ఉంటుంది. అదే సమయంలో.. 'ఇతర భాషల' వల్ల తమ మాతృభాషకు ముప్పు ఉంటుందన్న భయం నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది. ముఖ్యంగా భారతదేశంలో ఈ అంశం తరచుగా భావోద్వేగపూరితమైన వివాదాలకు కేంద్రబిందువుగా మారుతోంది.

 
భారతదేశంలో అత్యధికులు మాట్లాడే హిందీ భాషకి జాతీయ భాషగా పట్టంగట్టాలని ఆ భాషకు చెందినవారు - ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాలవారు తరచుగా వాదిస్తుంటారు. కానీ.. దేశంలో హిందీ మాట్లాడేవారికన్నా వేర్వేరు భాషలు మాట్లాడేవారే అధికంగా ఉన్నారు కనుక ఇది కుదరదని ఇతర భాషలవారు - ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలవారు అభ్యంతరం చెప్తుంటారు.

 
ఎక్కువ మంది మాట్లాడే భాషను తక్కిన ప్రజలంతా తప్పనిసరిగా నేర్చుకుని తీరాలనటం భాషా సామ్రాజ్యవాదం కిందకే వస్తుందని.. అది వేల ఏళ్లుగా వారసత్వంగా వస్తున్న తమ భాషా సంస్కృతులకు చేటు చేస్తుందని దక్షిణ రాష్ట్రాల ప్రజలు ఆందోళన వ్యక్తంచేస్తుంటారు. హిందీని భారతీయ సంస్కృతికి ప్రతీకగా గుర్తించాలని ఒకరంటే.. తమ ద్రవిడ భాషా సంస్కృతి మీద హిందీని బలవంతంగా రుద్దవద్దని మరొకరు అంటుంటారు.

 
ఈ వివాదంలో భాషలు, వాటి మూలాలు కూడా చర్చల్లోకి వస్తుంటాయి. ఇటీవల కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. 'హిందీ జాతీయ భాష' వ్యాఖ్యలతో మరోసారి దేశంలో భిన్న భాషలు, వాటి మూలాలు చర్చనీయాంశంగా మారాయి. నిజానికి భారతీయ భాషలు, వాటి మూలాల గురించి ఇప్పటివరకూ జరిగిన పరిశోధనలు ఏం చెప్తున్నాయనే అంశాల మీద ప్రజల్లో శాస్త్రీయ అవగాహన ఇప్పుడిప్పుడే పెరుగుతోంది. తాజా చర్చ నేపథ్యంలో భారతదేశంలో ప్రధానమైనవిగా గుర్తించిన భాషల పూర్వాపరాలపై పరిశోధనలు చెప్తున్న ప్రధానాంశాలివీ...

 
భారత భాషలు - భాషా పరిశోధన విప్లవం
భారతీయ భాషలు, వాటి మూలాల మీద పదహారో శతాబ్దం వరకూ శాస్త్రీయ పరిశోధనలు పెద్దగా జరగలేదు. అత్యంత ప్రాచీన సాహిత్య గ్రంథాలుగా పరిగణించే వేదాల భాష అయిన సంస్కృతమే భారతీయ భాషలన్నిటికీ మూలమనే భావన సామాన్య ప్రజానీకంలో ఉండేది. అయితే.. పదహారో శతాబ్దంలో భారత ఉపఖండాన్ని సందర్శించిన యూరోపియన్ పరిశోధకులు.. భారతీయ భాషలకు, గ్రీకు, లాటిన్, పర్షియన్, జర్మన్ తదితర భాషలకు గల సారూప్యతలను గుర్తించి పరిశోధనలు మొదలుపెట్టారు.

 
ఇలా పరిశోధించిన భాషాశాస్త్ర పరిశోధకుడు, నాటి బెంగాల్ సుప్రీంకోర్టు జడ్జి సర్ విలియం జోన్స్ 1786లో కలకత్తాలోని రాయల్ సొసైటీ ఆఫ్ ఇండియాలో.. యూరోపియన్, భారతీయ భాషల మధ్య సారూప్యతల గురించి ప్రసంగిస్తూ.. ఇవన్నీ ఒకే మూలం నుంచి ఆవిర్భవించి ఉంటాయని ప్రతిపాదించారు. అనంతరం.. థామస్ యంగ్ అనే శాస్త్రవేత్త ‘పశ్చిమ యూరప్ నుంచి ఉత్తర భారతదేశం’ వరకూ విస్తరించివున్న ఈ భాషల మీద మరింత పరిశోధన చేసి ఇవన్నీ ఒకే కుటుంబానికి చెందినవని చెప్తూ.. ‘ఇండో-యూరోపియన్’ భాషా కుటుంబంగా నామకరణం చేశారు.

 
ద్రవిడ భాషా కుటుంబాన్ని గుర్తించారిలా..
ఇండో-యూరోపియన్ భాషలకు పూర్తి భిన్నంగా ఉన్న దక్షిణాది ప్రాంత భాషలు వేరే కుటుంబానికి చెందినవని మొదట గుర్తించి.. ఆ భాషా కుటుంబానికి 'ద్రవిడియన్' అని పేరు పెట్టిన భాషాశాస్త్రవేత్త రాబర్ట్ కాల్డ్‌వెల్. నిజానికి.. విలియం జోన్స్ 'ఇండో-యూరోపియన్ భాషలకు' సంబంధించి 1786లో చేసిన ప్రసంగం తర్వాత 30 సంవత్సరాలకు 1816లో.. దక్షిణ భారతదేశంలోని తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం భాషలను ప్రత్యేక భాషా కుటుంబంగా విశ్లేషిస్తూ ఇంగ్లిస్ సివిల్ సర్వెంట్ ఫ్రాన్సిస్ వైట్ ఎల్లిస్ 'డిసర్టేషన్ ఆన్ ద తెలుగు లాంగ్వేజ్' అనే పరిశోధన పత్రం ప్రచురించారు.

 
ఆ తర్వాత.. రాబర్ట్ కాల్డ్‌వెల్ 12 ద్రవిడ భాషలను పోల్చుతూ ద్రవిడ భాషల మీద మొట్టమొదటి విప్లవాత్మక పరిశోధనను 1856లో ప్రచురించారు. దక్షిణాది వారిని, వారి భాషలను - ముఖ్యంగా తమిళులను - సంస్కృత భాషా పరిశోధకులు 'ద్రవిడ' అనే పదంతో ఉటంకించేవారని.. ఆ పదాన్నే దక్షిణ ప్రాంత భాషా కుటుంబానికి పేరు పెట్టటానికి ఉపయోగించానని ఆయన వివరించారు.

 
ద్రవిడ భాషల మీద శాస్త్రీయ పరిశోధన చేసిన వారిలో తెలుగువాడైన ఆచార్య భద్రిరాజు కృష్ణమూర్తి ప్రముఖులు. ఆయన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వైస్ చాన్సలర్‌గా పనిచేశారు. ద్రవిడ భాషాశాస్త్ర పరిశోధనలో ఆయన రాసిన ‘ద ద్రవిడియన్ లాంగ్వేజెస్’ను ఉద్గ్రంధంగా పరిగణిస్తారు. భారతీయ భాషలను ఈ భాషాపరిశోధనల ఆధారంగా వివిధ కుటుంబాలుగా వర్గీకరించారు.

 
121 ప్రధాన భాషలు - ఐదు కుటుంబాలు
దేశ జనాభాలో 99.85 శాతం మంది మాట్లాడే 121 ప్రధాన భాషలు, వాటి వర్గంలోని మాతృభాషలు ఐదు భిన్నమైన భాషా కుటుంబాలకు చెందినవని.. ప్రభుత్వం ప్రచురించిన భాషా గణన వివరాలు చెప్తున్నాయి. భారత జనగణన వెబ్‌సైట్‌లోనూ, కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ వెబ్‌సైట్‌లోనూ ఈ వివరాలు పొందుపరిచారు.

భాషా కుటుంబం
ఇండో-యూరోపియన్
ఆ కుటుంబంలోని భాషల సంఖ్య అవి మాతృభాషలుగా గల ప్రజల సంఖ్య మొత్తం జనాభాలో వారి శాతం
(a) ఇండో-ఆర్యన్ 21 94,50,52,555 78.05
(b) ఇరానియన్ 1 21,677 0.00
(c) జెర్మానిక్ 1 2,59,678 0.02
ద్రవిడియన్ 17 23,78,40,116 19.64
ఆస్ట్రో-ఏసియాటిక్ 14 1,34,93,080 1.11
టిబెటో-బర్మీస్ 66 1,22,57,382 1.01
సెమిటో-హామిటిక్ 1 54,947 0.00
మొత్తం 121 1,20,89,79,435 99.85
ఆ వివరాల ప్రకారం.. ఆ ఐదు ప్రధాన భాషా కుటుంబాలు, వాటి పరిధిలోకి వచ్చే భాషల వివరాలు ఇవీ...
 
1. ఇండో-యూరోపియన్ కుటుంబం: ఇందులో మళ్లీ ఇండో-ఆర్యన్, ఇరానియన్, జెర్మానిక్ అనే మూడు మూడు శాఖల భాషలు భారతదేశంలో ఉన్నాయి. అవి -
 
ఎ) ఇండో-ఆర్యన్ శాఖ: 1. అస్సామీస్, 2. బెంగాలీ, 3. బిష్ణుప్రియ, 5. డోగ్రీ, 6. గుజరాతీ, 7. హలాబీ, 8. హిందీ, 9. కశ్మీరీ, 10. ఖాందేశీ, 11. కొంకణి, 12. లాంధా, 13. మైథిలి, 14. మరాఠి, 15. నేపాలీ, 16. ఒడియా, 17. పంజాబీ, 18. సంస్కృతం, 19. షీనా, 20. సింధీ, 21. ఉర్దూ
 
బి) ఇరానియన్ శాఖ: 1. అఫ్ఘానీ/కాబూలీ/పష్తో
 
సి) జెర్మానిక్ శాఖ: 1. ఇంగ్లిష్
 
2. ద్రవిడియన్ కుటుంబం: 1. కూర్గి/కొడగు, 2. గోండి, 3. జాతాపు, 4. కన్నడ, 5. ఖోండ్/కోంధ్, 6. కిసాన్, 7. కొలామీ, 8. కొండ, 9. కోయ, 10. కుయి, 11.కురుఖ్/ఓరాన్, 12. మలయాళం, 13. మాల్టో, 14. పర్జీ, 15. తమిళం, 16. తెలుగు, 17. తులు
 
3. ఆస్ట్రో-ఏసియాటిక్: 1. భుమీజ్, 2. గడబ, 3. హో, 4. జువాంగ్, 5. ఖారియా, 6. ఖాశీ, 7. కొండ/కోరా, 8. కొర్కు, 9.కోర్వా, 10. ముండా, 11. ముండారి, 12.నికోబరీస్, 13. సంతాళి, 14. సవర
 
4. టిబెటో-బర్మీస్: షెడ్యూల్డు భాషల జాబితాలోని బోడో, మణిపురి సహా.. గారో, కుకీ, లడాఖీ, షేర్పా, టిబెటన్, త్రిపురి తదితర 66 భాషలు ఈ కుటుంబానికి చెందినవి.
 
5. సెమిటో హామిటిక్: అరబిక్/అరబీ

 
‘ఇండో-యూరోపియన్’ మూలాలు...
భారతదేశంలో అత్యధికులు అంటే 78 శాతం మందికి పైగా మాట్లాడే హిందీ తదితర 21 ప్రధాన భాషలు.. ఇండో-యూరోపియన్ కుటుంబంలోని ఇండో-ఇరానియన్ శాఖకు ఉపశాఖ అయిన ఇండో-ఆర్యన్ వర్గంలోకి వస్తాయి. ప్రస్తుతం ఇండో-యూరోపియన్ కుటుంబంలో ఎనిమిది శాఖలు, మరిన్ని ఉప శాఖలు, వాటి పరిధిలో మొత్తం 448 భాషలు ఉన్నట్లు ‘ఎత్నోలాగ్’ వెబ్‌సైట్ చెప్తోంది. ప్రాచీన గ్రీకు, లాటిన్, సంస్కృతం మొదలుకొని.. ఆధునిక ఇంగ్లిష్, జర్మన్‌లతో పాటు హిందీ తదితర భాషలు ఇందులో ఉన్నాయి.

 
ఇండో-యూరోపియన్ భాష మాట్లాడే ఆర్యులు ప్రస్తుత శకానికి పూర్వం సుమారు 1,500 సంవత్సరాల కిందట భారతదేశంలోకి వాయవ్య ప్రాంతం నుంచి విస్తరించారని భాషాశాస్త్ర పరిశోధకులు అంచనా వేస్తున్నారు. కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ వెబ్‌సైట్‌లో పొందుపరచిన సమాచారంలో కూడా ఇదే విషయాన్ని పేర్కొన్నారు.

 
''భారతదేశంలో ఇన్ని జాతులు ఉండటానికి కారణం.. అనేక ప్రజా సమూహాలు, జాతుల వలసలు కారణమని అంచనా. యూరోపియాడ్ ప్రజా సమూహాల (టోచారియన్లు కావచ్చు) విస్తరణ సుమారు 3,800 సంవత్సరాల కిందట మొదలైంది. అప్పటికి బహుశా 1,000 సంవత్సరాల ముందు.. ఇండో-యూరోపియన్ భాషలు మాట్లాడే ప్రజలు ఉరల్ పర్వతాలకు దక్షిణంగా, నల్లసముద్రానికి ఉత్తరంగా, పశ్చిమ కజకిస్తాన్‌లో గల ఒయాసిస్‌ ప్రాంతాల (యురేసియా స్టెప్పీ ప్రాంతాల) నుంచి.. బయలుదేరి పశ్చిమ, తూర్పు దిక్కులకు పయనించి చివరికి దక్షిణానికి వచ్చి.. అప్పటికి దక్షిణ ఆసియా ప్రాంతంలో ఆదివాసులైన (బహుశా) ద్రవిడులతో కలిసిపోయారు'' అని ఆ సమాచారంలో వివరించారు.

 
సంస్కృతం - హిందీ...
ఇతర భారతీయ ఇండో-ఆర్యన్ భాషల తరహాలోనే వేద సంస్కృతం నుంచి హిందీ పుట్టింది. ఈ క్రమంలో అనేక పరిణామాలు, ప్రభావాలు ఉన్నాయి. వేద సంస్కృతం బీసీఈ (బిఫోర్ కామన్ ఎరా - బీసీఈ) 1,500 కన్నా పురాతనమైనదని భాషాశాస్త్రవేత్తల అంచనా. తొలి వేదమైన రుగ్వేదం ఈ కాలానికి చెందిందని.. ఇది భారత ఉపఖండంలోని వాయవ్య ప్రాంతంలో ఉద్భవించిందని వారు భావిస్తున్నారు.

 
ఆ ప్రాంతంలోని ప్రజలు ఈ భాష మాట్లాడేవారు. సెంట్రల్ హిందీ డైరెక్టరేట్ ఆర్కైవ్స్ ప్రకారం.. వేద సంస్కృతం కాలక్రమంలో మారుతూ బీసీఈ 250 నాటికి ప్రాచీన వేదంగా రూపొందింది. మరోవైపు బీసీఈ 500 నాటికి వేద భాష ప్రాకృత భాషగా మారటం కూడా మొదలైంది. బీసీఈ 100 - సీఈ (కామన్ ఎరా) 100 నాటికి సంస్కృతం స్థానంలో ప్రాకృత భాష ప్రాచుర్యంలోకి వచ్చింది.

 
ప్రస్తుత శకం (కామన్ ఎరా - సీఈ) 400 నాటికి ప్రాకృత అపభ్రంశ భాష ప్రాచుర్యం పొందింది. ఈ అపభ్రంశ నుంచి ఏడో శతాబ్దం నాటికి హిందీ ఆవిర్భావం మొదలైంది. నిజానికి అప్పటికి హిందీ భాషగా దీనికి నామకరణం చేయలేదు. మొఘలుల ఆస్థాన కవి అమీర్ ఖుస్రో 13వ శతాబ్దంలో తను 'హైందవి' భాషలో కవితలు రాసినట్లు చెప్పాడు.

 
అంతకుముందు.. ఇండస్ - అంటే సింధూ నదికి తూర్పున 'హింద్' ప్రాంతంలో నివసించే వారిని చెప్పటానికి 'హిందీ' అనే పదాన్ని ఉపయోగించేవారు. ప్రాచీన పర్షియన్ భాష నుంచి ఈ పదం పుట్టింది. ఆ భాషలో 'హిందీ' అనే పదానికి అర్థం నేటి 'ఇండియన్'.

 
హిందుస్తానీ - హిందీ - ఉర్దూ...
అయితే.. నేటి ఉత్తర భారతదేశం, పాకిస్తాన్ ప్రాంతాలు దిల్లీ సుల్తానులు, మొఘలుల పరిపాలనలో ఉండటంతో.. నాటి ప్రాకృత భాష మీద పర్షియా, అరబిక్ భాషల ప్రభావం చాలా ఉంది. సంస్కృత, ప్రాకృత, పర్షియా, అరబిక్ భాషల మిశ్రమంతో హిందుస్తానీ భాష రూపొందింది.

 
ఈ భాషకు.. నాటి పాలకుల రాజధాని అయిన దిల్లీ, దాని పరిసర ప్రాంతాల్లో ప్రజలు మాట్లాడే 'దేహ్లవి' అనే ప్రాకృత మాండలికం ప్రామాణికంగా మారింది. అందుకే దీనిని 'ఖడీ బోలీ' - అంటే అర్థం ప్రామాణిక భాషగా కూడా చెప్తుంటారు. ఈ భాషనే ఆధునిక కాలంలో ఒకవైపు హిందీ అని మరోవైపు ఉర్దూ అని వ్యవహరిస్తున్నారని భాషాశాస్త్ర పరిశోధకులు చెప్తారు.

 
''హిందీ, ఉర్దూలు రెండూ.. భాషాశాస్త్రపరంగా ఒకే ఉప మాండలికానికి చెందిన భిన్న సాహిత్య శైలులు. సాధారణంగా ఉపయోగించేటపుడు ఈ రెండు భాషలూ దాదాపు ఒకే విధంగా ఉంటాయి. కొన్ని పదాలు, పలికే తీరుల్లో స్వల్ప తేడాలు మాత్రమే ఉన్నాయి. లిపి కోసం హిందీ దేవనాగరిని ఉపయోగిస్తే.. ఉర్దూ పర్సో-అరబిక్ లిపిని ఉపయోగిస్తుంది. అంతే'' అని కొలిన్ పి. మాసికా తన 'ద ఇండో-ఆర్యన్ లాంగ్వేజెస్' పుస్తకంలో వివరించారు.

 
స్వాతంత్య్రానికి ముందు.. స్వతంత్ర భారత జాతీయ భాషగా హిందుస్తానీ భాషను ప్రకటించాలని మహాత్మా గాంధీ, జవహర్‌లాల్ నెహ్రూ తదితరులు భావించింది ఈ నేపథ్యంలోనే. అయితే.. పాకిస్తాన్ విడివడిన తర్వాత ఉర్దూను ఆ దేశ జాతీయ భాషగా ప్రకటించుకుంటే.. హిందీని భారతదేశ అధికార భాషగా చేశారు. సెంట్రల్ హిందీ డైరెక్టరేట్ ఆర్కైవ్స్ ప్రకారం.. టర్కిష్, పర్షియన్, అరబిక్, పోర్చుగీసు, ఇంగ్లిష్, ద్రవిడ భాషలతో హిందీ సుసంపన్నమైంది.

 
మూల ద్రవిడ భాష మూలాలు...
ఇక దేశంలో రెండో అతిపెద్ద భాషా కుటుంబం ద్రవిడ భాషలని.. అందులో 25 భాషలు భారతదేశంలో మాట్లాడుతుంటే.. ఇదే కుటుంబానికి చెందిన బ్రాహుయి భాషను పాకిస్తాన్ - అఫ్గానిస్తాన్ సరిహద్దులోని బలూచిస్తాన్‌లో మాట్లాడతారని ఎంహెచ్‌ఆర్‌డీ వివరించింది.

 
ప్రస్తుత శకానికి పూర్వం (బిఫోర్ కామన్ ఎరా - బీసీఈ) నాలుగో సహస్రాబ్దిలో - అంటే సుమారు 6,000 సంవత్సరాల కిందట మూల ద్రవిడ భాష (ప్రోటో-ద్రవిడియన్ లాంగ్వేజ్) మాట్లాడేవారు వాయవ్య దిశ నుంచి భారత ఉపఖండంలోకి ప్రవేశించి ఉంటారని.. సింధు నాగరికత వీరిదే అయి ఉండవచ్చునని కొందరు పరిశోధకులు ప్రతిపాదించారు.

 
కానీ.. ఇవన్నీ స్వాభావికంగా ఊహాగానాలే తప్ప నిర్దిష్ట ఆధారాలు లేవని.. నిజంగా ఒప్పించగలిగే సిద్ధాంత రూపకల్పన ఇంకా జరగలేదని.. ఇంకా లోతుగా పరిశోధనలు జరగాల్సి ఉందని 'ద ద్రవిడియన్ లాంగ్వేజెస్'లో భద్రిరాజు కృష్ణమూర్తి పేర్కొన్నారు.

 
అయితే.. ప్రస్తుత శకానికి 3,500 సంవత్సరాల కిందటే.. అంటే దాదాపు 5,500 సంవత్సరాల కిందటే భారత ఉపఖండంలో ద్రవిడ భాషలు మాట్లాడే ప్రజలు విస్తరించి ఉన్నారనే అంశం మీద భాషాశాస్త్రవేత్తల్లో ఏకాభిప్రాయం ఉంది. ప్రస్తుతానికి ద్రవిడ భాషలను భారత ఉపఖండానికే చెందిన భాషలుగా పరిగణనలోకి తీసుకుంటున్నారు.

 
ఆర్యులు ప్రస్తుత శకానికి సుమారు 1,500 సంవత్సరాల కిందట వాయవ్య దిశ నుంచి భారత ఉపఖండంలోకి వచ్చి ఇక్కడి ద్రవిడులతో కలిశారనేది మెజారిటీ భాష, చరిత్ర పరిశోధకులు అంగీకరించే అంశం. సంస్కృత వేదాల్లో ద్రవిడ భాషా పదాలు ఉండటాన్ని పరిశోధకులు ఇందుకు ఆధారంగా చూపుతున్నారు. అయితే.. ఇక్కడ ద్రవిడులు, ఆర్యులు అని చెప్తున్నపుడు భాషా కుటుంబాలుగానే కానీ.. జాతులుగా కాదని పరిశోధకులు స్పష్టంచేశారు.

 
ఆర్యుల ఆగమనంతో ద్రవిడ భాషలు మాట్లాడేవారు చాలా మంది ఆర్య సమాజంలో కలసిపోగా.. ప్రతిఘటించిన ద్రవిడులు క్రమంగా తూర్పు, దక్షిణ దిశలకు కదలిపోయారని భాషా పరిశోధకులు సిద్ధాంతీకరించారు.

 
మూల ద్రవిడ భాష.. శాఖలు...
ప్రస్తుతం తెలిసిన ద్రావిడ భాషలు 26 పైగా ఉన్నాయని భద్రిరాజు కృష్ణమూర్తి పేర్కొన్నారు. ఆయన 'ద ద్రవిడియన్ లాంగ్వేజెస్' పుస్తకంలో వివరించిన దాని ప్రకారం...

 
మూల ద్రావిడ భాష సుమారు 5,000 సంవత్సరాల కిందట 1) దక్షిణ ద్రావిడ, 2) దక్షిణ మధ్య ద్రావిడ, 3) మధ్య ద్రావిడ, 4) ఉత్తర ద్రావిడ అనే నాలుగు శాఖలుగా విడిపోయింది.

 
దక్షిణ ద్రావిడ, దక్షిణ మధ్య ద్రావిడ ఉపశాఖలు ఒకే మూల దక్షిణ ద్రావిడ శాఖ నుంచి విడివుండాలని భద్రిరాజు విశ్లేషిస్తారు. ప్రస్తుతం ద్రవిడ భాషలలో అతి పెద్ద భాషలుగా ఉన్న తమిళం, మలయాళం, కన్నడ భాషలు దక్షిణ ద్రావిడ శాఖ నుంచి.. తెలుగు భాష దక్షిణ మధ్య ద్రావిడ నుంచి ఉద్భవించాయని సూత్రీకరించారు.
 
దక్షిణ ద్రావిడ:తమిళం, మలయాళం, ఇరుళ, కురుంబ, కొడగు, తోడ, కోట, బడగ, కన్నడ, కొరగ, తులు
దక్షిణ మధ్య ద్రావిడ:తెలుగు, గోండి (పలు మాండలికాలు), కొండ, కుయి, కువి, పెంగో, మండ
మధ్య ద్రావిడ: కొలామి, నాయిక్రి, నాయికి, పార్జి, ఒల్లారి, గడబ
ఉత్తర ద్రావిడ: కురుక్స్, మాల్టో, బ్రాహుయి
ఉత్తర ద్రావిడ శాఖకు చెందిన బ్రాహుయి భాష ప్రస్తుతం పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్‌ ప్రజలు మాట్లాడుతున్నారు. కురుక్స్, మాల్టో భాషలు ఉత్తర భారతదేశంలోని పలు మారుమూల ప్రాంతాల్లో మాట్లాడుతున్నారు.

 
తమిళం - తెలుగు...
బీసీఈ ఏడో శతాబ్దానికి చెందిన ఐతరేయబ్రాహ్మణంలో ఆంధ్ర, సబర తెగల పేర్లు.. బీసీఈ నాలుగో శతాబ్ద కాలం నాటి భరతుడి నాట్యశాస్త్రంలో డ్రమిళ (ప్రాచీన-తమిళ), ఆంధ్ర (ప్రాచీన-తెలుగు) భాషల పేర్లు ఉన్నాయని భద్రిరాజు ఉటంకించారు. కాబట్టి.. ఐతరేయబ్రాహ్మణం రచనాకాలానికన్నా నాలుగైదు శతాబ్దాల ముందే - అంటే సుమారు బీసీఈ 11వ శతాబ్ద కాలంలో దక్షిణ ద్రావిడ భాష (ప్రాచీన తమిళం ప్రధాన భాషగా), దక్షిణ మధ్య ద్రావిడ భాష (ఆది తెలుగు ప్రధాన భాషగా) విడిపోయి ఉంటాయని విశ్లేషించారు.

 
అదే రీతిలో.. ప్రాచీన తమిళ (ప్రీ-తమిళ్) భాష ఆ శాఖలోని మిగతా భాషల నుంచి బీసీఈ ఆరో శతాబ్దంలో విడివడి ఉంటుందని అంచనా వేశారు. బీసీఈ మూడో శతాబ్దంలో తొలి తమిళం (ఎర్లీ తమిళ్) ఆవిర్భవించిందని.. తమిళ సాహిత్య గ్రంథాలన్నీ ఈ కాలం తర్వాత రూపొందాయని నిర్ధారణ చేశారు. ప్రస్తుత శకం (కామన్ ఎరా - సీఈ) తొమ్మిది నుంచి 13వ శతాబ్దాల మధ్య మలయాళం విడివడిందని పేర్కొన్నారు.

 
ఇక.. దక్షిణ మధ్య ద్రావిడ భాష నుంచి తెలుగు ఎప్పుడు విడివడిందనేది చెప్పలేము కానీ.. బీసీఈ ఐదు, ఆరు శతాబ్దాల నాటికే తెలుగు ప్రత్యేక భాషగా ఏర్పడ్డట్లు తెలుస్తోందని భద్రిరాజు కృష్ణమూర్తి 'తెలుగు భాషా చరిత్ర' పుస్తకంలో పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లాలో వెలుగుచూసిన భట్టిప్రోలు శాసనం బీసీఈ నాలుగో శతాబ్దానికి చెందినదని.. అందులో తొలి తెలుగు భాష కనిపిస్తుందని ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా సూపరింటెండెంట్ డి.జితేంద్ర దాస్ 2007లో ప్రకటించారు.

 
ద్రవిడ - ఇండో-ఆర్యన్ భాషల సంగమం
ఆర్యులు బీసీఈ 1500 కాలంలో భారత ఉపఖండంలోకి ప్రవేశించేటప్పటికి అక్కడ ప్రధానంగా ఉన్న ద్రవిడ భాషా శాఖతో వారికి సంపర్కం వల్ల రుగ్వేదంలో సైతం కొన్ని ద్రవిడ భాషా పదాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు విశ్లేషించినట్లు భద్రిరాజు తన పరిశోధనా పుస్తకంలో వివరించారు. అనంతర కాలంలో.. ఉత్తర ప్రాంతంలో నివసించే పలు ద్రావిడ భాషా సమాజాలు ఆర్య సమాజాల్లో కలిసిపోయి ఇండో-ఆర్యన్ భాషలను స్వీకరించాయని పేర్కొన్నారు.

 
''సంహితాల సాహిత్యం' నాటికి వేద సంస్కృత భాష అత్యంత ప్రాచీనంగా మారిపోయి.. కొత్త సంస్కృత భాషలు అభివృద్ధి చెందటం మొదలైంది'' అని మహదేవ్ ఎం. దేశ్‌పాండే 'సోషియో లింగ్విస్టిక్ యాటిట్యూడ్స్ ఇన్ ఇండియా' పుస్తకంలో విశ్లేషించినట్లు భద్రిరాజు పేర్కొన్నారు. బీసీఈ ఐదో శతాబ్దం కాలానికి పాళీ, ప్రాకృతి వంటి వాడుక భాషలు ప్రాచుర్యం పొందటం ఆరంభమైంది. బౌద్ధ, జైన మతాలు రాజ్యాల ప్రోద్బలంతో ఉచ్ఛస్థితికి ఎదగటంతో.. ప్రాకృత భాషలు స్థిరపడగా సంస్కృతం క్రమంగా మొదటి భాష స్థానాన్ని కోల్పోయింది. పతంజలి కాలం నాటికి (బీసీఈ ఒకటో శతాబ్దం) ప్రాకృత భాష తొలి భాషగా మారిపోగా.. సంస్కృతం కర్మకాండల అవసరాలకు పరిమితమైందని దేశ్‌పాండే పరిశోధనను ఉటంకిస్తూ చెప్పారు.

 
ఒక సహస్రాబ్ది వ్యవధిలోనే ఇంత వేగంగా మార్పు చెందటానికి ప్రధాన కారణం.. ఆర్యేతర భాషలు (ప్రధానంగా ద్రవిడ భాషలు) మాట్లాడేవారిలో అత్యధికులు 'ఆర్య' భాషా సమాజాలతో కలిసిపోయి వారి భాషను తమ సాధారణ భాషగా స్వీకరించి ఉండటం కావచ్చునని.. అలాకాకుంటే ఇంత వేగంగా మార్పు సాధ్యం కాకపోవచ్చునని భద్రిరాజు అంటారు. అయితే.. ఈ ద్రవిడ భాషా సమాజాలు ఆర్యభాషలను కచ్చితత్వంతో నేర్చుకోకపోవటం వల్ల అనేక ప్రాంతీయ ప్రాకృత భాషల పుట్టుకకు దారితీసివుండవచ్చునని విశ్లేషిస్తారు

 
ఆస్ట్రోఏసియాటిక్ భాషలు
ఆస్ట్రిక్ భాషా కుటుంబం.. ఆస్ట్రోఏసియాటిక్, ఆస్ట్రోనేసియన్‌ అనే రెండు శాఖలుగా చీలిందని.. ఆస్ట్రోఏసియాటిక్ శాఖ నుంచి మళ్లీ మూడు ఉపశాఖలు - ముండా, మాన్-ఖ్మేర్, వియత్నమీస్-మువాంగ్ పుట్టాయని.. వాటిలో ముండా భాషలు భారతదేశంలో ఉన్నాయని ఎంహెచ్‌ఆర్‌డీ పత్రం చెప్తోంది. ముండా భాషల్లో సంతాలి, ముండ్రి, భూమ్జీ, సవర తదితర భాషలు ఉన్నాయని.. ఇవి మాట్లాడేవారు ప్రధానంగా అడవులు, పర్వతాల్లో నివసిస్తున్నారని పేర్కొంది.

 
టిబెటో-బర్మీస్ భాషలు
ఉత్తరాన టిబెట్ నుంచి దక్షిణాన బర్మా వరకూ.. దక్షిణాన జమ్మూకశ్మీర్‌లోని లదాఖ్ నుంచి తూర్పున చైనా రాష్ట్రాలైన జెషెన్, యునాన్ వరకూ విస్తరించి ఉన్న సీనో-టిబెటన్ కుటుంబ భాషల్లో ఒక శాఖ టిబెటో-బర్మన్ అని ఎంహెచ్‌ఆర్‌డీ చెప్తోంది. ఈశాన్య రాష్ట్రాల్లోని లేప్చా, సిక్కిమీస్, గారో, బోడో, మణిపురి, నాగా తదితర భాషలు ఈ శాఖకు చెందినవేనని వివరించింది.

 
ఆఫ్రోఏసియాటిక్ భాషలు
ఈ కుటుంబానికి చెందిన సెమిటో-హామిటిక్ శాఖ నుంచి ఉద్భవించిన అరబీ వంటి కొన్ని భాషలు కూడా భారతదేశంలో ఉన్నాయి. ఇక అత్యంత పురాతనమైన అండమానీస్ భాషలను ఏ భాషా కుటుంబం కిందా వర్గీకరించలేకపోయారు. ఇలా ఏ కుటుంబం కిందకూ చేరని చిన్న భాషలు మరికొన్ని భారతదేశంలో ఉన్నాయి.